
ఆనందించాల్సిన విషయం ఏమిటంటే రాజు తదితరులులాగే రాజోద్యోగులు కూడా దేశభక్తులు. బాధ్యత తెలిసినవారు. వారందరిలోనూ చంద్రే చిన్నవాడు.
అంతమంది పెద్దవాళ్ళకి అధిపతిగా వుండడం కాస్త సిగ్గుగానే వుంది చంద్రకి.
అయినా పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండానే పనులు నిర్వహిస్తున్నారు.
అయితే అతనికో తలనొప్పి వచ్చిపడింది. కొత్తగా మానస, మాటకు ముందు దివాణానికి రమ్మని తండ్రి ద్వారా కబురు చెయ్యడం ఇతను వెళ్ళడం, తీరా వెళ్లాక మానస అతన్ని కూర్చోపెట్టుకుని కబుర్లతో కాలక్షేపం చెయ్యడం తరచూ జరుగుతోంది.
అంతేకాదు. మానస ప్రవర్తనలోనూ, చూపుల్లోనూ ఏదో ఆరాధనాభావం తొంగి చూసేది.
ఇదంతా గమనించిన చంద్ర మరింత హడలిపోయాడు.
‘‘అయినా రాజకుటుంబంలోని స్ర్తిలకి బైటికొచ్చే స్వేచ్ఛ, మగాళ్ళెదురుగా మాట్లాడే పద్ధతి! వుండదు కదా.. మరి వీళ్ళేమిటి.. మాటకి ముందు తనని పిల్చి సరదా కాబుర్లాడతారు!’’ అని మనసులోనే విసుక్కునేవాడు.
ఆ రోజు చిరుతల గురించి పులిల గురించి మానస అడుగుతుంటే తనకి తెలిసినంత వరకూ చెప్తున్నాడు చంద్ర.
అప్పుడే రాజు వచ్చి-
‘‘చంద్రా! రేపేగా మన సింధుని చేసుకోవడానికి కుశాంక దేశపు పరివారం వచ్చేది?’’ అన్నాడు.
‘‘చేసుకోవడానిక్కాదు నాన్నా! చూసుకోవడానికి!’’ నవ్వింది మానస.
‘‘అదీ కాదు.. లగ్నాలు పెట్టుకోవడానికి అన్నాడు చంద్ర నవ్వుతూ.
చిత్రంగా రాజభవంతిలో కూడా అతనికి ఊహించని చనువు ఏర్పడింది
‘‘లగ్నాలు పెట్టుకోగానే పెళ్లి చేసెయ్యలి! లేకపోతే మనూ పెళ్లిలాగే అవుతుంది!’’ చిరాగ్గా కూతురికేసి చూస్తూ అంది జలంధర.
‘‘ఇప్పుడు రాకుమారి పెళ్ళికేమైందమ్మా! అనుకున్న రోజుకన్నా కాస్త ఆలస్యం అయింది. అంతేగా!’’ విషయం కొంతవరకు తెలిసిన చంద్ర నవ్వేస్తూ అన్నాడు.
‘‘నిజమే! అదే నేనూ అంటే ఈవిడగారేదో కొంపలు మునిగినట్టు తెగ బాధపడిపోతోంది’’ అన్నాడు రాజు
‘‘బాధ కాక! మనూ పెళ్లికన్నా ముందు సింధూ పెళ్ళే జరుగుతోంది. ఇంకా మన మనూ...’’
‘‘్ధరా!... అన్యాయంగా మాట్లాడకు. సింధు కూడా మన బిడ్డలాంటిదే! మన పిల్లతోపాటే పెరిగింది. అది మర్చిపోకు!’’ అంటూ వెళ్లిపోయాడు ప్రచండుడు.
చంద్ర ముందు అలా బైటపడినందుకు కాస్త సిగ్గుపడింది జలంధర.
అదేం గమనించనట్టు వాళ్ళందరికీ చెప్పి వెళ్లిపోయాడు చంద్ర.
సింధు పెళ్లి విషయం గుర్తురాగానే అతని మనసంతా చేదుగా అయిపోయింది.
‘‘అతను సింధూని చక్కగా చూసుకుంటాడా లేకపోతే రకరకాలుగా ఏడిపించుకుతింటాడా!
వాళ్ళు సింధూ చిన్న పిల్లని చేసి ఆరళ్ళు పెడితే.. ఆవేశపరురాలు సింధు, ఏ అఘాయిత్యమూ చెయ్యదు కదా?’’ ఇలావున్నాయతని ఆలోచనలు.
సింధూని, సింధూ కాపురాన్ని చల్లగా చూడమని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నాడు.
ఆ రాత్రంతా కూడా వరుణ్ని గురించి, ఆ కుటుంబం గురించీ ఆలోచిస్తూ పడుకున్నా. వాళ్ళొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళే ఉద్దేశ్యం లేదు.
అయినా తెల్లవాసరికి మంత్రిగారు రమ్మన్నారంటూ వార్తాహరుడి వార్త. ఎటూ తప్పించుకోని పరిస్థితి!
కాస్సేపు తర్వాత మళ్లీ కబురు రావడంతో వెళ్ళక తప్పలేదతనికి. వెళ్తూనే మిత్రాజీ దగ్గరికెళ్లి.
‘‘ఇదిగో బాబా! ఇపుడే చెప్తున్నాను. వాళ్ళక్కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. కానీ వాళ్ళెదుటికి మాత్రం రాను. నన్ను పిలవద్దు!’’ అన్నాడు
‘‘ఏంరా?... ఎందుకు రావు?’’ నవ్వుతూ అన్నాడు మిత్రాజీ.
చంద్ర పట్టు పట్టడంతో మిత్రాజీ అతన్ని ఏరా అనే పిలుస్తున్నాడు ఆప్యాయంగా.
‘‘నాకు సిగ్గు! నేను రానంతే!’’
‘‘సరేలే.. వాళ్ళు వచ్చే వేళయింది ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయో లేదో చూడు’’ అంటూ వెళ్లిపోయాడు మిత్రాజీ.
‘‘అయ్యా! మహరాజావారు, మానసమ్మ కూడా వస్తున్నారా?’’ ఓ వృద్ధరాసి అడిగిందతన్ని.
మిత్రాజీ మొహం వాడిపోయింది.
‘‘లేదమ్మా! మనూ నిశ్చితార్థం అందర్నీ పిల్చి ఆర్భాటం చేశారు కదా.. ఇప్పుడు నాలుగుసార్లనుకుంటే నాలుగుసార్లూ ముహూర్తం తప్పిపోయింది. అందుకే క్లుప్తంగా చెయ్యమన్నారు రాజావారు. అదికాక భవానీ శంకరుడు కూడా ఎలాంటి ఆడంబరాలూ పెట్టుకోవద్దు! పెళ్లి మనం చెయ్యచ్చు అని కబురంపారు. ఇపుడు కూడా తండ్రీ కొడుకులు తప్ప ఆడవాళ్ళెవరూ రారట!’’ అన్నాడు దిగులుగా
‘‘పోనె్లండి బాబుగారూ! అంతటి చక్రవర్తిగారు మీ వియ్యంకుడవుతాడంటే ఏడ్చేవాళ్ళు చాలామంది వున్నారు! ఇలా చెయ్యడమే మంచిది!’’ అందా దాసి.
మరికాసేపటికి మందీ మార్బలంతో దిగారు భవానీ శంకరుడు, కొడుకు.
మర్యాదలూ, పలకరింపులూ అయ్యాయి.
చక్రవర్తి వెంట వచ్చిన దాసీలు బంగారుపళ్ళాల్లో, నగలు, పట్టువస్త్రాలూ తెచ్చి లోపల పెట్టి బైటికెళ్ళిపోయారు.
వరుడి కళ్ళు వధువు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
అది గ్రహించిన మిత్రాజీ స్వయంగా తనే తీసుకొచ్చాడు కూతుర్ని.
సర్వాలంకారభూషిత అయిన సింధూరని చూసి ఆనందంతో వుబ్బితబ్బిబైపోయారు రాకుమారుడు. చక్రవర్తి కూడా తృప్తిగా తలపంకించాడు.
అయితే సింధూర మొహంలో మాత్రం జీవం లేదు. బలికి సిద్ధమైన జంతువులా వుంది.
‘‘వూ! మీరు అదృష్టవంతులు మిత్రాజీగారూ! కాబోయే చక్రవర్తికి మామగారవబోతున్నారు!’’ కాస్త దర్పంగా అన్నాడు భవానీ శంకరుడు.
‘‘అంతా దైవకృప!’’ వినయంగా అన్నాడు మిత్రాజీ
‘‘ఇంక లోపలికెళ్ళమ్మా!’’ అన్నాడు చక్రవర్తి సింధుతో.
అన్నదే చాలన్నట్టు గభాల్న లేచి లోపలికెళ్లిపోయింది సింధూర.
‘‘తనకేసి ఓరగానైనా చూళ్ళేదు. కొంపదీపి నాతో సంబంధం ఈ పిల్లకి నచ్చలేదా!’’ అనుకున్న రాకుమారుడు.
- ఇంకా ఉంది