
‘‘ఈ ఆశ్రమ ప్రాంగణంలో పాషాణ రూపం పొంది, ఆపదల పడుతూ వుండు’’ అని ఘోరంగా శపించాడు. ఆ శాప వాక్యం విన్నంతనే అహల్య మిక్కిలి భీతిల్లి ఆ గౌతమ బ్రహ్మర్షిని కనుకొని ‘‘ఇంద్రుడు కపటి అయి మీ రూపం ధరించి అపరాధం ఒనరించాడని కూడా నేను ఎరుగను. అజ్ఞానకృత్యం అయిన దోషం ఇది. మీరు విజ్ఞానమయం అయిన మనోవీధిని వీక్షించి నన్ను మన్నింప వేడుకొంటున్నాను’’ అని బోరన విలపించింది.
అంత గౌతమ మహర్షి అహల్యని అనునయిస్తూ ‘‘ఇక్ష్వాకు వంశంలో విష్ణువు రామమూర్తియై ఉదయించి, లోక సంరక్షణార్థం ఈ ఆశ్రమానికి చనుదెంచుతాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి అంఘ్రితలం సోకి శుద్ధాత్మవై ఎప్పటి నీ రూపం పొందుతావు. పిమ్మట నా కడకు రాగా నేను ఎలమితో నిన్ను స్వీకరిస్తాను’’ అని వచించాడు. అప్పుడు అహల్య ఆ తాపసోత్తముణ్ణి కాంచి ‘‘సురిచి రాకారుడైన ఆ బాలుణ్ణి కూడ, ఆ మువ్వురిని దయతలచిన విధంగానే పెంచవలసింది’’ అని ప్రార్థించింది.
గౌతముడున్ను శుద్ధాత్ముడై నెయ్యంతో ‘‘ఈ బాలుడు శతమన్యుడివల్ల ఉద్భవించాడు కనుక శతానందుడనే నామధేయంతో పరమ కరుణామూర్తి అయి విలసిల్లుతాడు. ఈ ఇంద్రసుతుడు, రవి సుతుడు మరణించిన అనంతరం సహస్ర లోచన, సహస్ర కిరణుల్లో లీనమవుతారు. ఈ ఇరువరే వనచరులై వాలి సుగ్రీవాభిధేయాలతో అమేయ పరాక్రమవంతులై ఒక యింతిని పొంది అలరారుతారు. ఆ ఇంతికై వాలి పరుడిచే మరణించుతాడు’’ అని శాపం ఒసగాడు.
భ్రామక భరిత ప్రాప్తులైన ఆ ఇర్వురు ఆ మునినాథుడిని ప్రీతితో ప్రార్థించి ‘మమ్ము క్షమించండి’ అని కోరారు. ఇందు భాస్కర తనయుల విధేయ వాక్కులకు హర్షించి, దివిజ సన్నిభుడు ఆ గౌతముడు తన యెదలో దయ కలుగ ఆ వాలి సుగ్రీవులతో ఈ పగిది వాకొన్నాడు.
‘‘మీరు మహా తేజాలతో ఒప్పుతూ నిర్మల హృదయులై ఇంద్ర సూర్యులకు జరిగినది తెలిపి, అనంత సత్వములు వరల కపి రూపాలు ధరించండి’’ అని పలికి గౌతముడు ఎటకేని వెడలిపోయాడు.
అప్పుడు ఆ అన్నదమ్ములు అంజనని కని ‘‘నీవల్ల మాకీ ఘోర శాపం, ఈ కర్మఫలం సంభవించాయి. నువ్వు నగచరుడైన కపివీరుడిని వరించి జగత్ప్రాణుడైన ఆ పురుషుడివల్ల శివ వీర్య కలితుడైన సుతుణ్ణి కను’’ అని శపించారు.
సుగ్రీవుడు కడు కుపితుడై వాలిని, అంజనని చూసి ‘‘అక్కటక్కటా! ఈ కన్య జనించనేల? పలు కర్మలవల్ల మనం విధినియోగాన్ని కావించాలి. కర్మం ప్రాపించవలసి వుంటే అది ఈశ్వరుడికైనా తప్పదు. నేనయినా, లక్ష్మీపతి అయినా తన కర్మకి తానే కర్త తప్ప అన్యుడు కాడు. పిదప అంజనని వీక్షించి వినయంతో ఈ పగిది నుడవసాగాడు.
‘‘అంజనా! నువ్వు అతి ముగ్ధమతివి. నీకు ఒదవకూడని దుష్కృతం వాటిల్లింది. అసమాన సంగ్రామ చతురుడు, అతిసత్త్వుడు, బాహావిక్రముడు అయిన శావాఖాచరవరుణ్ణి కంటావు. ఆ కుమారుణ్ణి నాకిష్టుడుగా ఒసగవలసింది. ఈ కోరికకి మన్నించు’’ అని వచించాడు. అంత అంజన ఆ సుగ్రీవుణ్ణి కని ‘‘నా తనయుడికి మీరు మాతులులు. మమ్మల్ని రక్షింప బాధ్యులెవరు? ఈ తలపు ఇటమీద ఏం అవుతుందో’’ అని పలికింది.
ఆమె వాక్కులు విని సుగ్రీవుడు ఆ విధంగానే అవుతుందిగాక! వారితో కలిసి ఇంద్రుడి సన్నిధికి అరిగారు. తను గౌతముడు ఒసగిన శాప ప్రకారం, ఆ శాపమోక్ష ప్రకారం వినించి వానర రూపాలు ధరించారు.
అక్కడ అహల్య కూడా తన శాపమంతా స్వీకరించి శిలగా పడి వుంది. అంత అనుష్ఠాన పరాయణుడైన గౌతమ రుషి తన పత్నీత్వం వితధం అయినందువల్ల చాలా చింతించి అంజనని శతానందనుణ్ణి తోడ్కొని మిథిల రాజ్యం చేరాడు. జనక మహారాజు ఏతెంచి, ఆ ముని నాథుడిని ప్రార్థించి రవి సమానుడైన శతానందుడిని తన ప్రాసాదానికి కొనిపోయాడు.
-ఇంకాఉంది