‘‘మానవులు కోరుకునేది శాశ్వతమైన స్వర్గలోకవాస నివాము. మరుజన్మ లేకుండా వుండాలంటే అటువంటి ఫలం చేకూర్చే పుణ్యకార్యాలు ఆచరించాలి. సత్కార్యాలు ఆచరించడంవల్ల పుణ్యం చేకూరుతుంది. మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అలాంటి పుణ్య ప్రాప్తికి పురుషులు, స్ర్తిలు, బాల వృద్ధులు, ఇలాంటి భేదభావాలు లేకుండా అందరూ అత్యంత సులభంగా ఆచరించడానికి వీలైనది ‘మాఘస్నానము’.
ఇహలోకంలో ఎటువంటి నిత్యకర్మలు ఆచరించకుండా శాశ్వత స్వర్గలోక వాసము కోరుకునేవారు, జపతపాలవల్ల శరీరానికి బాధ కలిగించకుండా విష్ణు సన్నిధిని పొందగోరేవారు, చేయరాని పాపకర్మలెన్నో చేసి మరణానంతరం కైలాసవాసం కోరుకునేవారు. ధనదాన, భూదాన, స్వర్ణగోఅన్నదాన, వస్తద్రాన, ఉదకదానాదులేవీ చేయకుండా స్వర్గలోకవాసము కోరుకునేవారు, వారి కోరికలు నెరవేరాలంటే మాఘమాసమున అనగా మకరరాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది. పూర్వం అయోధ్యానగరాన్ని దిలీపుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆతడు ఒక రోజు వేటకు అరణ్యానికి వెళ్ళాడు. ఎన్నో క్రూర మృగాలను వేటాడి తుదకు ఒక జింకను తరుముతూ అడవి మధ్యకు చేరుకున్నాడు. తుదకు జింకను వధించాడు. మిట్టమధ్యాహ్నం ఎండవేడికి దాహంతో నీటికోసం నలుమూలలా వెదికి చివరకు ఒక నదిని చూసి అందులోని నీటితో దాహం తీర్చుకొని నది ఒడ్డునే విశ్రాంతి తీసుకున్నాడు. రాజు నిద్రలేచేసరికి బాగా చీకటి పడింది. పరివారం కనుపుచూపు మేరలో లేనందున ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి చాలా భాగం గడచిన తరువాత రాజుగారిని వెతుకుతూ అతని పరివారం నదీ తీరానికి చేరుకుని రాజుగారిని కలుసుకున్నారు. అందరూ ఆ రాత్రి అక్కడే విశ్రమించి వేకువనే నగరానికి బయలుదేరారు. రాజుగారు కొద్దిదూరం వెళ్ళగానే ఆయనకు ఒక మునీశ్వరుడు వడివడిగా నడుస్తూ ఎదురురావడం చూశాడు. దిలీపుడు ఆ మునికి వినయంగా నమస్కరించి ఆయన వివరాలు అడిగాడు. ‘‘రాజా నా పేరు వృద్ధహరీతుడు. నేను ఇప్పుడు ఆ కనిపించే నదిలో మాఘస్నానం చేయడానికి వెళుతున్నాను. నీవు కూడా నాతో వచ్చి అత్యంత ఫలదాయకమైన మాఘస్నానము చేయి’’ అన్నాడు. ‘‘మునివర్యా! మాఘస్నానంవల్ల చేకూరే ఫలము ఏమిటో వివరించమని’’ అడిగాడు దిలీపుడు. రాజా ఆ వివరాలు నీకు చెప్పడానికి ఇప్పుడు సమయం చాలదు. సూర్యోదయం కాకుండా మాఘస్నానం చేయాలి. ఆ వివరాలు మీ కుల గురువును అడుగు’’ అని ముని ముందుకు కదిలాడు. రాజు కూడా ఆయనతో నదికివెళ్లి మాఘస్నానం చేసి తన పరివారంతో నగరం చేరుకొని నేరుగా వసిష్ఠాశ్రమానికి వెళ్లి ఆయనకు నమస్కరించి విషయం చెప్పాడు. వసిష్ఠులవారు రాజును దీవించి ‘‘మాఘమాస మహత్మ్యము’’ గురించి చెప్తాను శ్రద్ధగా విను. అంటూ జరిగిన కథను వివరించి మాఘస్నాన ఫలం పొందిన వారిగురించి చెప్పాడు. అవన్నీ తెలుసుకొన్న రాజు మాఘస్నానం తాను ఆచరించడమేకాక తన రాజ్యంలోని వారుఆచరింపచేసేట్టుగా చర్యలు పూనుకొన్నాడు.
ఆయువు, ఆరోగ్యము, విద్యా వివేకము, సిరిసంపదలు భార్యా పుత్రులు కోరుకునేవారికి వాటినన్నిటినీ చేకూర్చేది మాఘస్నానమొక్కటే! అని దిలీపునకు వసిష్ఠుడు చెప్పాడు. ఈ మాఘస్నానం చేసిన వ్యక్తికే కాక వారి ఉభయ వంశములలోని ఏడు తరాలవారిని నరకయాతన నుండి కాపాడి వారికి విముక్తి కలిగించి వైకుంఠం చేరుకుంటారు. పూర్వం అదితి మానస సరోవరంలో పనె్నండు సంవత్సరాలు మాఘస్నానాలు చేసి అత్యంత ప్రభావ సంపన్నులైన ద్వాదశ ఆదిత్యులను పుత్రులుగా పొందింది. ఇంద్రాణి మాఘస్నానంవల్ల త్రిభువన మోహన రూపం పొందింది. రోహిణీదేవి మాఘస్నానంవల్ల సౌభాగ్యం పొందింది. అరుంధతీదేవి కారుణ్యం పొందింది’’.కనుక మాఘస్నానం వల్ల లెక్కపెట్టలేని పుణ్యరాశి లభిస్తుంది.
మంచిమాట
english title:
manchimaata
Date:
Thursday, January 30, 2014