న్యూఢిల్లీ, జనవరి 30: తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర విధానసభ ఆమోదించిన తీర్మానంపై భారతీయ జనతాపార్టీ మండి పడింది. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ మరోసారి తీవ్ర ద్రోహానికి పాల్పడిందని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావడేకర్ విమర్శించారు. రాష్ట్రం ప్రశాంతంగా విడిపోవాలన్నదే తమ పార్టీ ధ్యేయమని ఆయన విలేఖరులకు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే సీమాంధ్రకు ఎట్టి అన్యాయం జరగకుండాప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జావడేకర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని రెండుగా విభజించే చర్యలు తీసుకోకుండా ప్రజల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆయన కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మాదిరి తమ పార్టీ రోజుకొక మాట మాట్లాడదని ఆయన చెప్పారు. తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న సొంత ముఖ్యమంత్రిని అదుపుచేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉందని ఆయన గేలి చేశారు. విధానసభ తిరస్కరించిన నేపథ్యంలో టి.అంశం కోర్టు తలుపు తడుతుందేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌పై బిజెపి మండిపాటు * టి.బిల్లు తిరస్కృతిపై సీరియస్
english title:
bjp
Date:
Friday, January 31, 2014