
న్యూఢిల్లీ, జనవరి 30: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ విధానసభ తీర్మానం ఆమోదించినంత మాత్రాన రాష్ట్ర విభజనకు ఎలాంటి అవరోధం ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అంతేకాక తెలంగాణ ఏర్పాటులో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ పూరె్తైందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలికిన బిజెపి మాటపై నిలబడి ఇతర ప్రతిపక్షాలు సహకరిస్తే ఫిబ్రవరిలో ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో టి.బిల్లు ఆమోదం పొందితీరుతుందని ఆయన చెప్పారు. ఎన్నికలలో గెలుపు ఓటమితో నిమిత్తం లేకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 3వ అధికరణకు లోబడి రాష్ట్ర విభజనకు అవసరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని దిగ్విజయ్ భరోసా ఇచ్చారు. విధానసభలో బిల్లుపై ఓటింగ్ జరగలేదు. బిల్లును తిరస్కరించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానాన్ని మాత్రమే సభ ఆమోదించినందున, బిల్లుపై ముందుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. అసెంబ్లీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి మాత్రమే బిల్లు పంపటం జరిగిందని, అభిప్రాయాలు తెలుసుకోవటంతో రాజ్యాంగ ప్రక్రియ పూరె్తైందని అన్నారు. బిల్లు తిరిగి రాగానే కేబినెట్ చర్చించి రాష్టప్రతి అనుమతితో పార్లమెంటులో ప్రతిపాదిస్తుందని ఆయన తెలియచేశారు. చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయాలను, సభ్యులు చేసిన సవరణలు హేతుబద్ధంగా ఉంటే బిల్లులో పొందుపర్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలన్న హైకమాండ్ నిర్ణయంపె తిరుగుబాటు చేసే తీరులో వ్యవహరించి చివరకు బిల్లును ఓడించి పంపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా చర్య తీసుకునే ప్రశే్న లేదని ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి ఒక ప్రాంతీయ నాయకుని తరహాలో వ్యవహరించటం విడ్డూరంగా ఉందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు కూడా సాధ్యపడదని స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన విభజన అంశంపై స్వేచ్చగా మాట్లాడే అవకాశాన్ని ప్రతి ఒక్కరికీ కల్పించాలని హైకమాండ్ నిర్ణయించినందున ఎవరిపై ఎలాంటి చర్యలూ ఉండబోవని అన్యాపదేశంగా అంగీకరించారు. రెండు ప్రాంతాల్లో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం సద్దుమణగాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ అన్నారు. బిల్లును విధానసభ తిరస్కరించి పంపే దిశలో ముఖ్యమంత్రి ఇలాగే వ్యవహరిస్తారని ముందునుంచే ఊహించామని దిగ్విజయ్ అంగీకరించారు. తెలంగాణ బిల్లును ఓడించి వెనక్కి పంపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ముద్ర పడినందున రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా? ప్రభుత్వం ఏన్నికల వరకూ కొనసాగుతుందా? అని ప్రశ్నించగా ప్రభుత్వ సుస్ధిరతకు ఎలాంటి భయం లేదని దిగ్విజయ్ చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియచేసిన తరువాతే కాంగ్రెస్ విభజనపై తుది నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ మాట తప్పాయని దిగ్విజయ్ ఆరోపించారు. బిల్లు తిరిగొచ్చిన తరువాత తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్న వారు తప్పుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.