న్యూఢిల్లీ, జనవరి 30: వంటగ్యాస్ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. నగదు బదిలీ పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి ఆధార్ లింక్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. అలాగే వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ల కోటాను ఏడాదికి ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న తొమ్మిదినుంచి 12 సిలిండర్లకు పెంచింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ విలేఖరులకు ప్రకటిస్తూ, వంటగ్యాస్ సిలిండర్ల కోటాను పెంచడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా 5 వేల కోట్ల రూపాయల సబ్సిడీ భారం పడుతుందని చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు 9 సిలిండర్లకు అదనంగా కుటుంబానికి ఒక సిలిండరు అదనంగా లభిస్తుందని, ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి 12 సిలిండర్లు సబ్సిడీ ధరలకు పొందవచ్చన్నారు. అలాగే వినియోగదారులు వంటగ్యాస్‌ను మార్కెట్ ధరలకు కొనుగోలు చేయడానికి వీలుగా వంటగ్యాస్‌పై చెల్లించే సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా జమ చేసే పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీ సమస్యలను పరిశీలించేంతవరకు ఆధార్‌తో ముడిపడిన ఎల్‌పిజి సబ్సిడీ బదిలీ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
సబ్సిడీ సిలిండర్లు 12కు పెంపు * కేంద్రం నిర్ణయం
english title:
12 cylinders
Date:
Friday, January 31, 2014