
--------------------
సిఎం కిరణ్ స్పీకర్‌కు ఇచ్చిన తీర్మానం
ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి ప్రాతిపాదిక లేకుండా, ఏకాభిప్రాయం లేకుండా రెండు ప్రాంతాల భాష, సంస్కృతి, ఏకత్వానికి భిన్నంగా, ఆర్ధిక, పరిపాలనాపరమైన మనుగడ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి ఉద్దేశించిన ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయరాదని గౌరవ భారత దేశ రాష్టప్రతిగారిని కోరుతూ సభ తీర్మానించింది. ఈ బిల్లు స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించింది.
--------------------
హైదరాబాద్, జనవరి 30: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించడం ద్వారా గురువారం నాడు శాసనసభ తెలంగాణ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం ఉదయం మూడోసారి 11.35కు తిరిగి సమావేశమైన తర్వాత సిఎం నోటీసును సభాపతి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు రాష్టప్రతి పంపిన విభజన బిల్లుపై చర్చ ముగిసిందని ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తత నడుమే సభాపతి సిఎం తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టి స్పీకర్‌ను తీర్మానం చదవకుండా చేసేందుకు విఫలయత్నం చేశారు. బిల్లును తిరస్కరించాలన్న సిఎం తీర్మానానికి మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాంతో రాష్ట్ర శాసనసభ తెలంగాణ బిల్లును తిరస్కరించినట్టయింది. బిల్లును తిరస్కరించాలని వచ్చిన 10 అనధికార తీర్మానాలను కూడా ఆమోదించినట్లుగా భావించాలన్నారు. వెంటనే స్పీకర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా ఐదు నిమిషాల వ్యవధిలో ముగిసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సభ నుండి బయటకు వచ్చారు. విభజనపై 23 పనిదినాల్లో 56 గంటలకు పైగా చర్చ జరిగిందని, పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా 9072 ప్రతిపాదనలు వచ్చాయని, 86 మంది సభ్యులు మాట్లాడారని స్పీకర్ తెలిపారు. మొత్తం రికార్డులను రాష్టప్రతికి సమర్పిస్తామని స్పీకర్ వ్లెడించారు. సభ వాయిదా పడిన సమయంలో సిఎం తీర్మానానికి మద్దతు తెలుపుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సభాపతికి లేఖలు సమర్పించారు. గత రెండు రోజులు మాదిరే సభ్యుల ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో గురువారం నాడు శాసనసభ అట్టుడికిపోయింది. శాసనసభ ప్రారంభానికి ముందే అన్ని పార్టీల సభ్యులు స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు చిట్టచివరి రోజు కావడంతో శాసనసభకు అన్ని పార్టీల సభ్యులు హాజరయ్యారు. అన్ని పార్టీల సభ్యులు తమ తమ పార్టీ కండువాలతో సభలో నిండుగా కనిపించారు. ‘జై తెలంగాణ’ అంటూ తెలంగాణ ప్రాంత సభ్యులు నినాదాలు చేయగా, ‘జై సమైక్యాంధ్ర’ అంటూ మిగిలిన సభ్యులు నినాదాలు చేశారు. ఉభయ పక్షాల నినాదాలతో శాసనసభ గురువారం దద్దరిల్లిపోయింది. ఉదయం 9 గంటలకు సభ సమావేశమైన వెంటనే సభ్యులు నేరుగా పోడియంలోకి దూసుకువెళ్లారు. తొలుత సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఒక బారికేడ్ మాదిరి నిల్చోగా, తెలంగాణ ఎమ్మెల్యేలు వారిపైకి దూసుకువెళ్లారు. గత రెండు రోజులకు భిన్నంగా మంత్రులు మాత్రం తమ స్థానాల్లో కూర్చుని ఉండిపోయారు. శాసనసభ మందిరంలో ఎన్నడూ లేని విధంగా 30 మందికి పైగా భద్రతా సిబ్బందిని స్పీకర్ పోడియం చుట్టూ నిలబెట్టారు. పదే పదే సీనియర్ పోలీసు అధికారులు సభలోని అధికారుల ద్వారం వద్దకు వచ్చి స్పీకర్ భద్రతా సిబ్బందికి సూచనలు అందించారు. స్పీకర్ సభలోకి రాగానే వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. చర్చలో పాల్గొనేందుకు చిట్ట చివరి రోజు కావడంతో సభ్యులకు ఇది ఆఖరి అవకాశమని, చర్చలో పాల్గొనాలని స్పీకర్ చెప్పారు. అయితే సభ్యులు సహకరించకపోవడంతో సభ ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే వాయిదా పడింది.
మహాత్ముడికి నివాళి
తిరిగి సభ 11 గంటలకు సమావేశం కాగానే జాతిపిత బలిదానం చేసిన రోజు సందర్భంగా మహాత్ముడికి నివాళులు అర్పించింది. శాసనసభ్యులు అంతా సభలో నిల్చుని వౌనం పాటిస్తూ, నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు నివాళి అర్పించిన తర్వాత సభ 11.03కు స్పీకర్ వాయిదా వేశారు. తిరిగి సభ 11.35కు సమావేశం అయింది.
దూసుకువెళ్లిన హరీష్
తెలంగాణ మంత్రులు తమ స్థానాల్లో నిల్చుని నినాదాలు చేయగా, చీఫ్ విప్, విప్‌లు మాత్రం పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపి సమైక్య నినాదాలు చేయగా, టిడిపిలో సీమాంధ్ర వర్గం సమైక్య నినాదాలు చేసింది. టిఆర్‌ఎస్, టిటిడిపి, కాంగ్రెస్ సభ్యులు తెలంగాణ నినాదాలు చేశారు. సభ నిర్వహణకు సహకరించాలని, చర్చలో పాల్గొని సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పదే పదే సూచించారు. ఒక దశలో స్పీకర్ పోడియం వద్ద బారికేడ్‌లా నిల్చున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలపైకి హరీష్‌రావు, సమ్మయ్య, వినయ్‌భాస్కర్‌లు దూసుకువెళ్లారు. శాసనసభ మందిరంలోని కార్యదర్శి టేబుల్‌పైకి ఎక్కే ప్రయత్నంలో హరీష్‌రావు కింద పడిపోయారు. కొంత మంది ముందుకు దూసుకువెళ్తే మరికొంత మంది వారిని వెనక్కు లాగడంతో అసెంబ్లీలో ఒక దశలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళం ఏర్పడింది. ఒక పక్క ఈ గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్ శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.