
హైదరాబాద్, జనవరి 30: ‘సంకెళ్లు బద్దలు కాబోతున్నాయి.. పక్షం రోజుల్లోనే తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ముగిసింది.. ఇక అంతా ఢిల్లీ చూసుకుంటుంది..’అని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుతెలిపారు. అసెంబ్లీలో గురువారం రాష్ట్ర పనర్ విభజన బిల్లును తిరస్కరించిన పరిణామాల నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన సభ చిట్టచివరి రోజు, రాష్ట్ర చరిత్రలో ఇవే చివరి సమావేశాలు, అయితే ఏదో జరిగిపోయిందని ఆంధ్రా చానల్స్ అవాకులు, చవాకులు ప్రసారం చేశాయ’ని కెసిఆర్ మండిపడ్డారు. తాను ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించానని, విభజన అంశానికి సంబంధించిన ఢిల్లీ పెద్దలతో మాట్లాడానని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందుతుందో కూడా తనకు తెలుసునని అన్నారు. తాను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళుతున్నానని, మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తానని, తలా తోకా లేని వార్తలు చూసి కంగారు పడవద్దని తెలంగాణ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. సీమాంధ్ర నాయకులంతా రాక్షసుల్లా వ్యవహరించి, వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ‘వీళ్లా మన నేతలు? ఉన్మాదమా? తెలివి తక్కువ తనమా?’ అని ఆయన విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆయన స్థాయికి తగ్గట్టు నడుచుకోలేదని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు తలకాయ ఉందా? అనే అనుమానం కలుగుతోందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. శాసనసభపై రాష్టప్రతికి, పార్లమెంటుకు సైతం అధికారం లేదని చంద్రబాబు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. రాష్టప్రతి తలుచుకుంటే అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఉంటుందని బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. ‘సీమాంధ్రపై కేంద్రానికి ద్వేషం ఎందుకు ఉంటుంది? మీ ప్రాంతానికి ఏం కావాలో చెప్పండని కేంద్రం పదే పదే కోరింది, అయినా ఒక్క నాయకుడు కూడా ఆ విషయం మాట్లాడడం లేద’న్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించి భంగపడ్డారన్నారు. రాష్టప్రతి పంపిన బిల్లుపై చర్చ జరిగిందని, ఎంత మంది మాట్లాడారో కూడా స్పీకర్ ప్రకటించి, ఆ తర్వాతి అంశంగా ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని తీసుకున్నారని కెసిఆర్ వివరించారు. విభజన బిల్లుపై చర్చకు, ముఖ్యమంత్రి తీర్మానానికి సంబంధం లేదని, ఆంధ్రా చానల్స్ మాత్రం విభజన ఆగిపోయిందని, కిరణ్‌ను ‘సీమాంధ్ర సింహం’ అని వార్తలు ప్రసారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాయని విమర్శించారు.
ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ తీర్మానం పంపినా, పంపక పోయినా తెలంగాణ ఏర్పాటు చేయడం సాధ్యమేనని కెసిఆర్ అన్నారు. బిల్లుపై అభిప్రాయాలను చెప్పమని మాత్రమే రాష్టప్రతి కోరాని, బిల్లుపై ఓటింగ్ చేసే అధికారం కానీ, దాన్ని తిప్పి పంపే అధికారం కానీ అసెంబ్లీకి లేదని, అది కేంద్రం పరిధిలో ఉంటుందన్నారు. రాష్ట్రాల విభజనపై కేంద్రానికి అధికారం ఉన్నందున తాము జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్ విభజన కేసులో తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు హడావుడి చేసిన వారు ఏం చేస్తారు? ఏ ముఖం పెట్టుకుంటారు?’ అని ప్రశ్నించారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయంపై మీడియా ఖండించాలే తప్ప అదేదో ఘన కార్యం అన్నట్టుగా కొన్ని చానల్స్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్ర,తెలంగాణ ప్రజల మధ్య శాశ్వతంగా వైషమ్యాలు ఏర్పడేట్టు టీవీ చానల్స్ వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముసుగులు, జెండాలు, పార్టీలు వేరయినా ఆంధ్రా నాయకులంతా ఒకటే అని నిరూపించారని అన్నారు. ముంబయి రాష్ట్రం గుజరాత్, మహారాష్టగ్రా విడిపోయినప్పుడు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని తొలుత బిల్లులో ప్రతిపాదించారని, పార్లమెంటులో చర్చ తరువాత మహారాష్ట్ర రాజధానిగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు. బిల్లులో చివరి వరకూ మార్పులు ఉండవచ్చని, పార్లమెంటు ఆమోదించేదే ఫైనల్ బిల్ అని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన తరువాతే విలీనం అంశంపై మాట్లాడతానని కెసిఆర్ తెలిపారు. ‘తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఎవరు?’ అని విలేఖరులు ప్రశ్నించగా, ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని కెసిఆర్ అన్నారు.