
కారణం లేకుండా రాష్ట్ర విభజనా?
బిల్లు తిరస్కరణ ప్రజాభిప్రాయం మేరకే
దాన్ని కేంద్రం గౌరవించాలి
తెలంగాణ కావాలో వద్దో ఎన్నికల్లో జనమే చెబుతారు
కేంద్రం తప్పుచేసింది.. అందుకే పోరాటం
రాష్టప్రతిపై నమ్మకం ఉంది: కిరణ్
హైదరాబాద్, జనవరి 30: రాష్ట్రాన్ని ఎలాగైనా కలిపి ఉంచేందుకు చివరి వరకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో బిల్లు తిరస్కరణ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనేందుకు ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు తిరస్కరణ ప్రజాభిప్రాయం మేరకు జరిగిందేనని తేల్చి చెప్పారు. గురువారం పలు జాతీయ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరోసారి గళం విప్పారు. ప్రజాభిప్రాయం మేరకు జరిగిన ఈ తిరస్కరణ ప్రక్రియను కేంద్రం కూడా గౌరవించాలని స్పష్టంచేశారు. అంతేతప్ప కారణం లేకుండా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఎలా! అని ప్రశ్నించారు. సభ అభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన జరగదని, ఇప్పటివరకు దేశంలో ఎక్కడా బిల్లును వ్యతిరేకించిన తరువాత విభజనలు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగితే తాను రాజకీయాలనుంచే తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. విభజన అంశంపై కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకుందని, అందుకే తాను పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. అసలు ప్రజలు కూడా తెలంగాణ కావాలా! వద్దా! అన్న అంశంపై లోక్‌సభ ఎన్నికల్లో తమ తీర్పు చెబుతారని ప్రకటించారు. పార్లమెంట్, శాసనసభలు స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలని, అందుకే శాసనసభ తీర్మానాన్ని పార్లమెంట్ గౌరవించాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. విభజన అంశంపై పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో చర్చించామని, వారంతా కూడా రాష్ట్రం ఒకటిగా ఉండాలనే కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రజలకు కూడా ఇదే భావంతో ఉండడం వల్ల కేంద్రం కూడా వారి అభిప్రాయాలను గౌరవించాలన్నారు. గతం కన్నా ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఈ పరిస్థితుల్లో విభజన జరగడం వల్ల సమస్యలు మళ్లీ ప్రారంభమవుతాయన్నారు.
రాష్ట్రాన్ని కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయని, విభజన ఉండదన్న నమ్మకం కలుగుతోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ తీర్మానానికి విలువ ఉందన్నారు. ‘మనం నియంతృత్వంలో లేము. ఈ తీర్మానాన్ని కాదనలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు. ఘనమైన చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కొత్త పార్టీ అంశంపై స్పందిస్తూ తాను కేవలం ప్రజల సంక్షేమం, రాష్ట్రం ఒకటిగా ఉండాలన్న కోణంలోనే ఆలోచిస్తున్నానని, ఇతరత్రా ఎలాంటి ఆలోచనలు లేవని తేల్చిచెప్పారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం జరిగిన తరువాత ఇక రాష్టప్రతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్టప్రతిపై కాంగ్రెస్ వాసనలు ఉంటాయన్న దానిపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని, అయితే ఆయన అన్ని కోణాల్లో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం తనకు ఉందని స్పష్టంచేశారు. తాను ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ అసలు కేంద్ర ప్రభుత్వమే తెలంగాణకు ప్రతినిధిగా వ్యవహరిస్తోందన్నారు. తనకు రాజకీయంగా కోరికలు లేవని, కేవలం సమైక్య రాష్ట్రం, ప్రజల సమస్యలపైనే ఆలోచిస్తున్నానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ వాదిగానే ఉన్న తాను చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర పార్టీ కూడా గుర్తిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్ కార్యాచరణకోసం ఒకటి రెండు రోజుల్లో అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతానని, అనంతరం ఢిల్లీకి కూడా వెళ్తానని స్పష్టంచేశారు.
----------
నేరుగా రాష్టప్రతి వద్దకు..!
హైదరాబాద్, జనవరి 30: టి.బిల్లును అసెంబ్లీలో ఓడించిన అనంతరం ఇక నేరుగా ఢిల్లీకి వెళ్లేందుకు సిఎం కిరణ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. పలువురు ఎంపీలు, మంత్రులతో క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన భేటీలో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి, సీమాంధ్రకు చెందిన ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లి రాష్టప్రతిని కలవాలని నిర్ణయించారు. శాసనసభలో తీర్మానం జరిగిన నేపథ్యంలో విభజన ప్రక్రియను ఆపివేయాలని రాష్టప్రతిని కోరాలని నిర్ణయించారు. శాసనసభ తీర్మానాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్టప్రతిని కలిసిన రోజుగానీ, ఆ మరునాడుగానీ ఢిల్లీలో వౌనదీక్ష చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. త్వరలో నిర్వహించాల్సిన సీమాంధ్ర కాంగ్రెస్ సమావేశంపై కూడా సిఎం చర్చించారు.