నేడు ఢిల్లీ వెళ్లనున్న కెసిఆర్, సీమాంధ్ర టిడిపి నేతలు
* 3న కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టిజెఏసి నేతల పర్యటన
=========================
హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభ ప్రక్రియ ముగియడంతో, ఇక అన్ని పార్టీలు హస్తిన బాట పడుతున్నాయి. శాసనసభలో రాష్ట్ర తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చల సారాంశం, సవరణ ప్రతిపాదనలు ఈ నెల 3న రాష్టప్రతి కార్యాలయానికి వెళ్లనుండటంతో, ఆ తర్వాతనే ఢిల్లీకి వెళ్లి రాష్టప్రతిని కలవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. అలాగే ఈ నెల 3న ఢిల్లీ వెళ్లి అక్కడి అన్ని పార్టీలను కలిసి పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాలని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) నిర్ణయించింది. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, సీమాంధ్ర టిడిపి నేతలు మాత్రం శుక్రవారమే ఢిల్లీకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఇక విభజన బిల్లు ఢిల్లీకి చేరనుండటంతో అక్కడికి వెళ్లి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని సీమాంధ్ర టిడిపి నేతలు నిర్ణయించారు. సీమాంధ్ర టిడిపి నేతలు గురువారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో వ్యూహాన్ని ఖరారు చేసినట్టు వారు తెలిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కాంగ్రెసు సీనియర్ నాయకుడు జానారెడ్డి నేతృత్వంలో తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి, పార్లమెంట్‌లో బిల్లును త్వరతగతిన పెట్టడానికి పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి అడ్డంకి కాకుండా ఢిల్లీలో పార్టీ పెద్దలతో, అలాగే న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించాలని జానారెడ్డి చాంబర్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. శాసనసభలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడానికి తెలంగాణ మంత్రులంతా సమిష్టిగా ఢిల్లీ వెళ్తే బాగుంటుందని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేసిన సూచనతో ఇతర మంత్రులు ఏకీభవించారు. అయితే బిల్లు ఢిల్లీకి చేరడానికి ఇంకా మూడు, నాలుగు రోజుల వ్యవధి పడుతుందని, అది ఢిల్లీకి వెళ్లే సమయానికి వెళ్తే బాగుంటుందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభ
english title:
dilli
Date:
Friday, January 31, 2014