
ముంబయి, జనవరి 30: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఆర్థిక ఉద్దీపన చర్యలను మరింత తగ్గిస్తుందన్న బెరుకు సెన్‌సెక్స్‌కు మరోమారు ఆశనిపాతమైంది. గురువారం, 149 పాయింట్లు పతనం చెంది రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్చేంజీ నిఫ్టీ సైతం 46 పాయింట్లు (0.76 శాతం) క్షీణించి 6,073.70 పాయింట్ల వద్ద ముగిసింది. బాండ్ల కొనుగోళ్లను 10 బిలియన్ డాలర్ల మేరకు తగ్గిస్తున్నట్లు బుధవారం, ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనిర్ణయం ఎమర్జింగ్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ మార్కెట్లనుంచి మూలధన నిధులు తరలిపోతాయన్న భయాలతో దేశీయ మార్కెట్లలోషేర్లు కుప్పకూలాయి. ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా ఇదే బాటలో పయనించాయి. మరోపక్క అంతర్జాతీయంగా ఈక్విటీ డెరివేటివ్‌ల అమ్మకాలు కూడా బలహీనంగా ఉండటం కూడా మదుపుదార్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒక దశలో 20,343.78 పాయింట్లకు క్షీణించిన బెంచ్‌మార్క్ సెన్‌సెక్స్ సూచీ తర్వాత స్వల్పంగా కోలుకొని 149.05 పాయింట్లు(0.72శాతం) క్షీణత నమోదుచేసుకొని 20,498.25 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి 23న 21,373.66 పాయింట్ల వద్ద నమోదైన సెన్‌సెక్స్ సూచీ కేవలం గత ఐదురోజుల్లోనే 875 పాయింట్లు పతనం చెందింది. మొత్తం 12 రంగాల సూచీల్లో, బ్యాంకింగ్, స్థిరాస్తి, లోహ, ఆయిల్ అండ్ గ్యాస్, సహా 10 రంగాల సూచీలు దిగువకు పయనించాయి. మన్నిక గల వినియోగవస్తురంగం, అటోరంగం షేర్లు మాత్రమే లాభాలను నమోదుచేసుకున్నాయి. 30 షేర్ల సూచీలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిల్, ఎస్‌బిఐ సహా 19 షేర్ల సూచీలు క్షీణించాయి. లాభాలను చవిచూసిన 11 సూచీల్లో టాటామోటార్స్, భారతి ఎయిర్‌టెల్‌లు ముందున్నాయి. మొత్తం బిఎస్‌ఇ స్టాకుల్లో 1,714 స్టాకులు క్షీణించగా,866 స్టాకులు వృద్ధిని నమోదుచేసుకున్నాయి.