న్యూఢిల్లీ, జనవరి 30: నెలవారీ బాండ్ల కొనుగోళ్లను మరింతగా కుదించాలని అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయం భారత మార్కెట్లపై దుష్ప్రభావం చూపబోదని కేంద్ర ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు దోహదపడే అన్ని చర్యలను ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చేపడతాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘ఫెడరల్ రిజర్వు నిర్ణయాల పట్ల అటు ప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంకు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు దేశంలోని ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడతాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. నెలవారీ బాండ్ల కొనుగోళ్లను మరో 10 బిలియన్ డాలర్ల మేరకు కుదించుకోవాలని అమెరికా ఫెడరల్ రిజర్వు బుధవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. తనఖా కింద ఉన్న సెక్యూరిటీలు, దీర్ఘకాలిక ట్రెజరీ సెక్యూరిటీల ద్వారా ఇంతకుముందు నెలకు 75 బిలియన్ డాలర్ల బాండ్లను కొనుగోలు చేసిన అమెరికా ఇక మీదట ఈ కొనుగోళ్లను 65 బిలియన్ డాలర్లకు పరిమితం చేసుకోవాలని ఫెడరల్ రిజర్వు తాజాగా నిర్ణయించింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం ఊహించినదే గనుక ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదని, భారత మార్కెట్లపై ఇది దుష్ప్రభావం చూపబోదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 65 బిలియన్ డాలర్లు చిన్నమొత్తమేమీ కాదని, ప్రపంచ మార్కెట్లలో ఇది పెద్ద మొత్తంలో లిక్విడిటీకి దారితీయవచ్చని ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే, ఫెడరల్ రిజర్వు చేసిన ప్రకటన మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. బాంబే స్టాక్ ఎక్సేంజిలో గురువారం ఆరంభం సెనె్సక్స్ ఏకంగా 225 పాయింట్లు పతనమవగా, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 62.75 రూపాయలకు చేరుకుంది. అయతే ఫెడ్ రిజర్వు నిర్ణయం వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక వ్యవస్థ సన్నద్ధంగా ఉందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ప్రభుత్వం, ఆర్‌బిఐ అప్రమత్తం : ఆర్థిక శాఖ భరోసా
english title:
finance dept
Date:
Friday, January 31, 2014