న్యూఢిల్లీ, జనవరి 30: నిర్ధేశిత కాలంలో గనులను అభివృద్ధి చేయలేకపోయిన హిందాల్కో, జెఎస్‌పిఎల్, టాటా స్టీల్ వంటి ప్రైవేటు సంస్థలకు కేటాయించిన 61 బొగ్గు క్షేత్రాల విషయంపై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) గురువారం చర్చ జరపలేదు. న్యూఢిల్లీలో సిసిఇఎ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ విషయాన్ని విలేఖర్లకు తెలియజేశారు. సమయాభావం వల్లనే ఈ అంశం చర్చకు రాలేదని మరో మంత్రి తెలిపారు. ఉత్పత్తి ప్రారంభించలేకపోయినందుకు నోటీసులు జారీచేసిన ఈ బొగ్గు క్షేత్రాల విషయమై ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తన మార్గదర్శకాలను సవరించాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. స్క్రీనింగ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలకు కేటాయించిన ఈ 61 బొగ్గు క్షేత్రాల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రామాణికాలను ప్రతిపాదించాలని సిసిఇఎ ఈ నెల 13వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మూడు వారాల్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అన్ని పక్షాలకు బొగ్గు గనుల శాఖ నోటీసులు జారీ చేయాలని కూడా సిసిఇఎ సూచించింది. ఈ విషయంపై ఇంటర్ మినిస్టీరియల్ గ్రూపు (ఐఎంజి) నుంచి వచ్చే సమాధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని తాము సిఫారసులు చేస్తామని, ఈ సిఫారసులపై సంబంధిత విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని అప్పట్లో సిసిఇఎ స్పష్టం చేసింది.
నిర్ధేశిత కాలంలో గనులను అభివృద్ధి చేయలేకపోయిన హిందాల్కో,
english title:
private firms
Date:
Friday, January 31, 2014