Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అవమానాలకు ఆత్మహత్యే శరణ్యమా??

$
0
0

కొంతమంది మనని అవమానించినా భరించగలం కాని కొంతమంది అవమానిస్తే తట్టుకోలేం. మరికొందరి విషయంలోనైతే అవమానిస్తారేమో అనే భావనే వారిని కృంగదీస్తుంది.
చిన్న చిన్న కారణాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీయడం మనం రోజూ వార్తలలో చూస్తు న్నాం. అయ్యో అని ఆశ్చర్యపోతూ అందరిలో అధైర్యాన్ని నూరిపోస్తున్నాం. సినీతారల నుండి సామాన్యుల వరకు రైతుల నుండి రాజకీయ నాయకుల వర కు ఆలోచనలేని అదుపు చేయలేని నిర్ణయాలు తీసుకునేలా మానసిక దృఢత్వాన్ని కోల్పోతున్నారు. జియాఖాన్, నఫిసా జోసెఫ్, సిల్క్ స్మిత, ఉదయ్‌కిరణ్ వంటివాళ్ళు మానసిక సమతుల్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నా, దివ్యభారతి ప్రత్యూష, సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి అయినా, వారి ప్రాణార్పణకు ముఖ్య కారణాలు మానవ సంబంధాల మాధు ర్యం కోల్పోవటమే అని అందరికీ తెలుసు. విపి సత్యన్ అనే ఫుట్‌బాల్ ఆటగాడు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నా, ప్రమోద్ మహాజన్‌ని సొంత సోదరుడే హత్య చేసినా ఇలాంటి ఘటనల వెనుక మానవ సంబంధాల విలువలు తగ్గిపోవడం ముఖ్య కారణమే.
డాక్టర్స్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండ్ కెనడా వారు నిర్వహించిన అధ్యయనంలో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకునేవారు అధిక శాతం యువతీ యువకులే అని తేల్చింది. 2010వ సంవత్సరంలో 1,87,000 మంది భారతీయులు ఆత్మహత్యలతో చనిపోగా అందులో 40 శాతం మగవారు, 59 శాతం ఆడవారు కాగా వీరు అందరూ 15 నుండి 29 సంవత్సరాలలోపు వారే అవడం గమనార్హం.
ఇక రైతులు, నిరుద్యోగులు, విద్యావంతులు కూడా ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2004లో బ్రిటీష్ మెడికల్ జర్నల్ ‘లానె్సట్’లో ప్రపంచానికి ‘దక్షిణ భారతదేశం’ ఆత్మహత్యల రాజధాని అని ప్రచురించారు. అందుకు కారణాలు వారు చేసిన సర్వేలు. అత్యుత్తమ విద్యార్థులకు నెలవైన కేరళ వంటి రాష్ట్రంలో కూడా రోజుకు 30 మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడతారని తెలియడమే. ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలలో ప్రతి సంవత్సరం 50వేలమంది ఆత్మహత్యలతో చనిపోతున్నారని పేర్కొంది. ఈ పది సంవత్సరాలలో పై సంఖ్యలు గణనీయంగా పెరగటం సాధ్యమే.
ఎలాంటి సమస్య ఉన్న మనను ఆదుకునేవారు ఉన్నారు, మనని ప్రేమించి మన కోసం బ్రతికేవారు ఉన్నారు అనే భావన చాలు మనిషికి జీవితంపై ఆశలు చిగురింపజేయడానికి. మనిషిని కాకుండా డబ్బుని మాత్రమే కోరుకుంటున్నారనే చిన్న విష బీజం చాలు అతి తక్కువ కాలంలో మహావృక్షమై మనసుని చంపేసి మనిషిని మింగేస్తుంది. మనని మనం ప్రేమించుకుంటూ బ్రతికేయటం అనే పద్ధతి అందరికీ వర్తించదు. అందరూ ఒకే స్వభావం కలిగి ఉండరు.
ఆత్మహత్యలకు లేదా హత్యలకు మూలకారణాలు వెతికినపుడు మనం తరచూ వినేది ‘వత్తిడి’. వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాలలో సమన్వయ లోపంతో ఒత్తిడి, విద్యార్థులలో పరీక్షలూ, మార్కుల భయంతో ఒత్తిడి, లాభనష్టాల ఒత్తిడి, సమాజంలో పరువు - మర్యాద, గౌర వం సంపాదించడంలో వత్తిడి, ప్రేమ పెళ్లి వ్యవహారంలో గెలుపు ఓటమి వత్తిడి. ఇలా చెప్పుకుం టూ పోతే అసలు వత్తిడి సవాళ్లు లేని జీవితం ఎవరికి ఉండదు?? కాని అసలు కారణం నిజంగా ఒత్తిడి అని సరిపెట్టుకోగలమా? ఎంత ఒత్తిడి ఉన్నా మనని ప్రేమించే వారి చిరునవ్వు, ఒక తియ్యని పలకరింపు మనలో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపుతుంది, ఎలాంటి ఒత్తిడిని అయినా దూదిలా తేలికపరుస్తుంది. మన చుట్టూ ఉన్నవారు అలాంటి తియ్యని వ్యక్తులే అయితే అసలు ఏ ఒత్తిడి మనని ఏమీ చేయలేదు. అయితే దురదృష్టశాత్తు ప్రతి మనిషికీ డబ్బు, పేరు ప్రఖ్యతులు ప్రాముఖ్యం అయిపోయి మనసులేని రాతి బొమ్మలుగా మారిపోతున్నారు. అవమానం, ప్రతీకారం అనే పదాలు కూడా సిగ్గుపడేలా మనుషులు ప్రవర్తిస్తున్నారు.
మనం ఒత్తిడిలో ఉన్నాం అనే విషయం విచిత్రంగా మనకే ముందు తెలుస్తుంది. అప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం సినిమాలు, స్నేహితులు, షికారులు ఒత్తిడిని దూరం చేయలేవు. మన కష్టం ఏంటో, దానికి పరిష్కారం ఏంటో, ప్రత్యామ్నాయం ఏంటో మనమే పదాల రూపంలో రాసి చదువుకోవాలి. ప్రతిరోజూ అలా చేయడంవలన ఒత్తిడి తగ్గి నిజాన్ని స్వీకరించే గుణం మెల్లమెల్లగా అలవడుతుంది. అహానికి పోకుండా మనని ఇష్టపడేవారితో స్నేహపూర్వకంగా మాట్లాడడం సంతోషంగా గడపగడం అలవర్చుకోవాలి. అన్నిటికీ మించి అసూయాద్వేషాలకు తావు లేకుండా, ఎదుటివారిని అవమానించడానికి స్వస్తి చెప్పాలి. వృత్తిరీత్యా అందరు కలిసి పనిచేస్తున్నప్పుడు కలిసిమెలిసి జీవితం కొనసాగిస్తున్నప్పుడు, అందరూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎదుటివారు చెప్పింది వినటానికి సమయం కేటాయిస్తే చాలు, మీరు వారి సమస్య తీర్చకున్నా, వారి మనసులోని భారం దిగిపోతుంది, అదే సగం రోగం నయం చేస్తుంది. కాని ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు మరెక్కడికో మోయకుండా ఉండే స్నేహితులని ఎంచుకోండి చాలు. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే మనమే స్వయంగా చెప్పడం చాలా అవసరం. ప్రతిదానికి మధ్యవర్తిని ఉపయోగించడంవలన బంధం మీద నమ్మకంపోయి, స్నేహం విడిపోవడానికే ఎక్కువ ఆస్కారం.
ఇలాంటి చేదు అనుభవాలు రెండు మూడు తగిలితే చాలు, ఎవరికైనా జీవితంమీద విరక్తి కలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో కుటుంబ పాత్ర చాలా ఉంది. ఎలాంటి పరిస్థితులలో అయినా మేమున్నామనే భరోసా అవసరం. స్నేహం ప్రాధాన్యత ఎంతో కుటుంబం ప్రాధాన్యత కూడా అంతే. నేడు ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసూయాద్వేషాలే మనిషిని మృగంగా మార్చేస్తున్నాయి. మన జీవితాల్లో డబ్బు ప్రాధాన్యత తగ్గించి, త్యాగగుణం అలవర్చుకుంటే అసలు సమస్యలు మన చుట్టూ ఉన్నా మనకు తెలియకుండానే మాయం అయిపోతాయి. పోటీతత్త్వం ఉండాలి కాని అది మన ప్రాణం తీసేంతగా మాయ చేయకూడదు.
ఎన్ని గొడవలున్నా రక్తసంబంధీకులు కలిసి ఉంటే ఆ తోడు ఏ స్నేహానికైనా మంచిందే. అందుకే వౌనం వీడండి, వౌనంతో అవతలివారు ఎక్కువగా ఊహించుకోవడం, భయపడడం, ఆలోచనలేని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వాదనకు చర్చకు అవకాశం ఇవ్వద్దు అనుకుంటే అవతలివారి కోసం కొంచెం తగ్గి వారికి ఏం కావాలో అది చేయలేకున్నా నీ కోసం కాబట్టి ఈ మాత్రం చేయగలను అన్నా చాలు, వారు సంతోషిస్తారు. ఆ చిన్న మాటే నమ్మకం అవుతుంది. నా కోసం ఒకరు ఉన్నారు అనే నమ్మకాన్ని పెంచుతుంది. వారికి జీవితంపై ఆశ కలిగిస్తుంది.

ఫీచర్
english title: 
suicide
author: 
-రాణీ సంధ్య

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>