Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అసలు వైద్యం

$
0
0

ఆంధ్రభూమి కథల పోటీలో ఎంపికైన రచన
---------------------
‘‘దిగులు పడకోయ్ భుజంగం! ఈ రోజుల్లో షుగర్ ఎవరికి లేదు చెప్పు! నాకొచ్చే పదిహేనేళ్లైంది. జాగ్రత్తగా మందులు వాడుకుంటూ- అప్పుడప్పుడు క్రమం తప్పకుండా టెస్ట్‌లు చేయించుకుంటూ ఉంటే షుగరేం చేస్తుందోయ్? డైట్ కంట్రోల్‌లో ఉండు! డాక్టరు అన్నీ చెప్పే ఉంటారు కదా!’’ అనునయంగా అన్నాడు సహాద్యోగి వెంకటాచలం.
తలూపాడు భుజంగం. ‘‘ఎవరు చెప్పినా ఇదే మరి!’’-
‘‘మాయదారి దరిద్రపు షుగర్ జబ్బు నలభయ్యోపడిలోనే వచ్చి చచ్చింది కదా! ఏదో వృద్ధాప్యంలో వస్తే ఎలాగోలా అఘోరించేవాణ్ణి’’ వైరాగ్య భావన ముఖంలో స్పష్టంగా కన్పిస్తోంది భుజంగం ముఖంలో.
మొన్నీమధ్యనే జ్వరమొచ్చి హాస్పిటల్‌కు పోతే, యధాప్రకారం యాధాశక్తిన పరీక్షలన్నీ వ్రాసారు భుజంగానికి. ఆ పరీక్షల్లో తేలింది బ్లడ్‌షుగర్. ఇంకేముంది పాతాళానికి జారిపడిపోయినట్లుగా ఫీలయ్యాడు.
నలభైకే ఎనభై వచ్చి పడినట్లుగా బాధపడిపోసాగాడు.
మాటిమాటికి పరీక్షలు! ఇష్టంగా తినే స్వీట్లు మానేశాడు. ఎవరైనా తింటూంటే చూసి ఆనందించడమే మిగిలింది. కడుపు నిండా తృప్తిగా తినే తిండికి ఇక చెల్లు చీటీ!
దీనికి తోడు ఉచిత సలహాలు దుంపతెంచసాగాయి. వ్యాయామం తప్పనిసరి అన్నారు. సరే! ఎలాగో ఐదింటికే లేవటం, కాస్తంత ఊరి బైటదాకా వెళ్లిరావడం మొదలైంది. పొద్దునే్న లేవడం ప్రాణాంతకంగానే ఉన్నా ప్రాణాలమీది తీపి గుండెల్లో తన్నడంవల్ల తప్పనిసరైంది.
ఆమధ్య తెల్లారుఝామునే్న లేచి నడుస్తుంటే వీధిలోని కుక్కలు వెంటపడ్డాయి. వెంటపడటమేమిటి? ఓ మాయదారి కుక్క పట్టి పీకినంత పనిచేసింది. అందుకనే ఇకనుండి వాకింగ్‌కు వెళ్ళేటప్పుడు ఓ స్టిక్ ఉంచుకోమని భార్యామణి మంగ సలహా ఇవ్వడంతో ‘వల్లె’యని కర్ర పుచ్చుకుని నడవడం మొదలుపెట్టాడు. కొంత ఆత్మరక్షణగానే ఉన్నది ఇపుడు. ‘‘ఔరా! కర్ర చేతికి వచ్చింది!’’. ‘మంగ’ కాస్త తిండి పుష్టిగల మనిషి. పొద్దుకూకులు ఏదో ఒకటి నముల్తూనో, మింగుతూనో ఉండాల్సిందే. ఇన్నాళ్ళూ భుజంగానికి ఏమనిపించలేదు కానీ- ఈ మాయదారి రోగం వచ్చి, నోరు కట్టేసుకోవాల్సినప్పటినుండి- మంగ ఏమైనా తింటూంటే- ‘‘ఎందుకు పొద్దుగూకులు ఏదో ఒకటి నమలటం, రోగాలు తెచ్చుకోవటం! నోటికి విశ్రాంతి ఇయ్యవా?’’ విసుక్కోవడం మొదలెట్టాడు. అటు చూడటమే కంటకప్రాయంగా తోచసాగింది.
‘‘రోగం నీకు గానీ నాకా?’’ అనే్లదు కానీ- శృతిమించితే మంగ ఎపుడన్నా అలా వాత పెడుతుందేమోనన్న భయమూ లేకపోలేదు భుజంగానికి.
ఆహారపు కోతలతో చిక్కి సగమయ్యాడు భుజంగం.
‘‘దాన్ని గురించే ఆలోచించకోయ్ భుజంగం!’’ తోటివారు- స్నేహితులు- వాకింగ్ అసోసియేషన్ సభ్యులు ఎందరు ఎన్ని విధాల ధైర్యం చెప్తున్నా- భుజంగానికి అదే ఆలోచన!
ఈ జబ్బు గురించి రకరకాల వ్యాఖ్యానాలు వింటున్నాడు.
దినపత్రికల్లో ఆరోగ్య పేజీలు- టీవీల్లో నిపుణుల సలహాలు! ఏదీ వదలటంలేదు. ఇదొక్క సారొస్తే పోదు- నియంత్రణే మన చేతుల్లో ఉంది. రకరకాల ఉచిత సలహాలు! దీర్ఘకాలిక జబ్బులకు అందరూ డాక్టర్లే అన్నట్టుగా సలహాలు!!
***
జిహ్వ చాపల్యాన్ని అణచుకోవడం కష్టతరమైందే కాబట్టి- భుజంగానికి షుగర్ హెచ్చుతగ్గులు కాన్రావడం మొదలైంది. ‘‘ఇదుగో భుజంగం- నేను మొన్న ‘కేరళ మూలికల వైద్యం’ తీసుకున్నానోయ్. పోస్టు ద్వారా తెప్పించుకో.. నెలకు మూడు వేలు. ‘‘బాగా పనిచేసింది. ఇపుడు హాయిగా స్వీటు కూడా తింటున్నానే్నను. రోజుకు రెండుసార్లు కడుపునిండా అన్నం తింటున్నా’’ ఓ పరిచితుని సలహా.
తెప్పించాడు భుజంగం. వాడే విధానం దాన్లోనే ఉంది. కడుపంతా అదొక రకంగా నులిపెట్టసాగింది, మొదటి రోజు వాడగానే.
పైగా ఇది వాడుతూ మీ మందులు మీరు కంటిన్యూ చెయ్యవచ్చునన్న సలహా కూడా ఇవ్వబడింది.
ఊహూ... ఏం ప్రయోజనం కనబళ్ళేదు. మందు పొడి మధ్యలోనే ఆపేశాడు, ఈ కడుపులో తిప్పడం బాధవల్ల కాదని.
‘‘ఇదుగో.. మిత్రమా.. నేను మొన్న ‘నల్లమలకొండ వెళ్ళొచ్చాను. అక్కడ బి.పి, షుగర్‌లకు ఇదుగో.. ఈ చెక్క ఇచ్చారు. రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి పొద్దునే్న పరగడుపునే్న ఓ నాలుగు స్పూన్లు తాగు. కాస్త చేదుగా ఉంటుంది. నలభై ఒక్క రోజులు వాడి చూడు! ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందంటూ మరొక మిత్రుడు దివ్యమైన ఔషధం అంటూ అందించాడు.
‘‘ఇదేదో బాగానే ఉండేట్టుంది! రాత్రంతా ఓ చిన్న గినె్నలో ఈ చెక్క ముక్కను నీళ్ళల్లో ఉంచాడు. పొద్దునే్న తీసి- కళ్ళు గట్టిగా మూసుకొని- మంగ ఎందుకీ ప్రయోగాలంటూ వారిస్తున్నా- గుటుక్కున మింగేశాడు. అంతే! మరి కాసేపటికి కళ్ళు, ఒళ్ళు తిరగడం- కాళ్ళల్లో శక్తి క్షీణించడం జరిగిపోయింది.
మంగ ఈ స్థితిని గమనించి కాసింత పంచదార తెచ్చి భర్త నోట్లో పోసింది. కాసేపటికి తేరుకున్నాడు భుజంగం. మంగ నాలుగు చీవాట్లు పెట్టింది.
బిక్కమొహమేశాడు భుజంగం. ఆ సాయంత్రం మిత్రుణ్ణి అడిగాడు. జరిగిన ఉదంతాన్ని వివరించాడు.
‘‘అరెరె! మిత్రమా! నీకిచ్చిన చెక్క మొత్తాన్ని నీళ్ళల్లో పెట్టావా? దాన్ని విరిచి ఒక్క చిన్న భాగాన్ని మాత్రమే నీళ్ళల్లో మునిగేట్టు ఉంచాలి. ఇది చెప్పటం మరిచాను. మరేం ఫర్వాలేదు. రేపట్నించి ఈ రకంగా వాడు’’ అన్నాడు.
‘‘ఇదిక వాడానో మంగ కర్ర పుచ్చుకోవడం ఖాయం’’. ఈ రస వైద్యం వికటించడంతో తిరిగి ఇంగ్లీషు వైద్యమే శరణ్యమని భావించి వాడటం తిరిగి మొదలెట్టాడు. ఇన్ని రకాల మూలికా వైద్యాలు చేయించుకుంటున్నా ఇంగ్లీషు వైద్యం ఆపింది లేదు పెద్దగా.
ఆమధ్య ‘వాకింగ్ ఫ్రెండ్’ ఇచ్చిన సలహా బాగా నచ్చింది.
‘‘చూడు మిస్టర్ భుజంగం! అన్ని జబ్బులకు మూలం మనం తినే ఆహారం! దాన్ని కంట్రోల్ చెయ్యి. కూరగాయలు తిను అల్పాహారానికి బదులుగా- ఆకుకూరలు- జొన్న రొట్టెలు తిను! అందరికీ తెల్సిందేగా?’’ అన్నాడు.
ఇది నచ్చింది భుజంగానికి. మొదట్నుంచి డాక్టర్లు చెప్తున్నా అంతగా పట్టించుకోలేదు.
‘‘జొన్నన్నము - జొన్నాంబలి
జొన్న పిసరు- జొన్నలె తప్పన్’’ అంటూ శ్రీనాథకవి సార్వభౌముడు పల్నాటివాసుల గురించి ఆనాడు చెప్పాడు. నిజంగా పల్నాటి వాసులందరూ ఎంతటి అదృష్టవంతులో కదా! ఆరోగ్యవంతులో కదా!’’ జొన్న రొట్టెలు తినుకుంటూ గుర్తుచేసుకోసాగాడు భుజంగం.
ప్రతిరోజూ ఆకుకూరలు గిల్లి, శుభ్రం చేసి రుచిగా ఉండేటట్లు, చేసి పెట్టలేక వాపోయేది మంగ.
‘‘ఇక అన్నం ముట్టనుగాక ముట్టను! చూడు నా ప్రాతివత్యం’’ అంటూ నాల్రోజులు అచ్చం రొట్టెలు - ఆకుకూరలు తినేసరికి కడుపునొప్పి- తిప్పటం- వికారం మొదలైన లక్షణాలు కన్పించాయి.
‘‘ఓ యబ్బ! మంగా! ఒక్కపూటైనా అన్నం తినాలోయ్! నిన్న డాక్టరుగారు చెప్పారు. ‘రాత్రిపూట రొట్టె తింటావే’ అంటూ మార్పు చేసాడు మెనూను.
భుజంగం వీధిలో చివర ఉండే నాగిరెడ్డి ఓ రోజున మాటల సందర్భంలో- భుజంగంగారూ! ఎందుకు మీరు ఇంత అవస్థ పడ్తున్నారు?
‘‘నేను చూడండి. ఏ మాత్రం పథ్యం ఉండను. రోజూ ప్రొద్దుట ఒక్క అరగ్లాసు కాకరకాయ రసం తాగుతాను. అంతే! భేషుగ్గా ఉన్నాను. ఈ వయసులోనే నీకెందుకండీ ఇన్ని పథ్యాలు’’ అన్నాడు.
ఈ మాటకు ప్రభావితుడైన భుజంగం రాత్రివేళ జొన్న రొట్టెకు గుడ్‌బై చెప్పి ప్రొద్దుటే కాకరకాయ రసం తాగడం మొదలెట్టాడు. ఓ వారం తాగి, సుష్టుగానే భోజనం చేస్తూ- రెగ్యులర్ మంత్లీ చెకప్ చేయించుకున్నాడు. ఊహూ.. షుగర్ తగ్గలేదు. 200 ఆపై ఉండసాగింది. కాళ్ళ పిక్కల తీపులు- కాస్తంత తల తిరగడం మొదలైంది.
డాక్టరుగారు మందు మోతాదు పెంచి, వ్యాయామం గట్రా అలవాట్లు మామూలుగానే చెప్పి పంపారు.
భుజంగానికో అలవాటుంది. ఏ విషయమైనా పదిమందికి చెప్పుకుంటే గానీ నిద్ర పట్టదు. వాళ్ళు కొత్త, పాత అని లేదు.
ఈ నేపథ్యంలో పక్కింటి పోర్షను వారి తాలూకు బంధువొకాయన ఎనభై ఏళ్ళకు పైగా ఉన్న పెద్దాయన వచ్చాడు. చాలా ఆరోగ్యంగా, ఉషారుగా, ఉల్లాసంగా కన్పిస్తున్నాడు. ఆయన ఆరోగ్య రహస్యం కనుక్కోవాలనుకున్నాడు భుజంగం.
పరిచయాలు, మాటల సందర్భంలో తన గోడును వెళ్ళబోసుకున్నాడు భుజంగం.
పెద్దాయన నవ్వాడు. ‘‘చూడండి! భుజంగంగారూ! మీకో రహస్యం చెప్పనా? జబ్బుకన్నా జబ్బు ఉందని పొద్దస్తమానం దాన్ని గురించే ఆలోచించడం జబ్బులన్నింటిలోకెల్లా పెద్ద జబ్బు.
ఇంకో విషయం చెప్పనా! నాకు షుగరు వ్యాధి వచ్చి నలభై ఏళ్ళు దాటింది. మీకన్నా తక్కువ వయసులోనే వచ్చింది.’’
నోరెళ్ళబెట్టాడు భుజంగం.
‘‘చాలా ఆరోగ్యంగా కన్పిస్తున్నారు మరి! ఏం మందులు వాడుతున్నారు? అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, మూలికావైద్యాలా?’’
‘‘్భజంగారూ! మీ ఆతృత నాకర్థమైంది. ప్రశాంతంగా ఆలోచించండి. ఏదో ఒక్క వైద్యానికి కట్టుబడి ఉండండి. ఎందుకు పాతిక ప్రయోగాలు? అవసరమా? మీరు చేసిన పొరపాట్లు ఏమిటో మీకే అర్థమవుతాయి జాగ్రత్తగా ఆలోచిస్తే.’’
పచ్చికూరలు, ఆకుకూరలు, జొన్నలు, రాగులు, రొట్టెలు ఇవన్నీ ఆరోగ్యప్రదమే. ఇన్నాళ్ళూ ఉన్న ఆహారపు అలవాట్లను ఒక్కసారిగా వదిలేసి పూర్తిగా వీటిపైనే ఆధారపడ్డారు. ఒక్కసారిగా శరీరం సహకరించదు.
నెమ్మది నెమ్మదిగా అలవాటు చెయ్యండి. అది స్థిరంగా ఉండిపోతుంది. మీకు తొందరెక్కువ. ఎవరేది చెబితే అదే పరవౌషధంగా భావించారు. వైద్యుల సలహాలు సరిగా పాటించలేదు. అన్నీ వికటించాయి.
అసలు రహస్యం చెప్పనా! ఓ పద్ధతి ప్రకారం- షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యసూత్రాలు, ఆహారపుటలవాట్లు పాటిస్తే, సాధారణ ఆయుఃకాలం కంటే ఎక్కువ ఆయుఃకాలాన్ని పొందుతారు. పదిమంది సలహాలు- సొంత ఆలోచనలు, వ్యాధుల విషయంలో పనికిరావు. ఏం భయపడకండి!’’
పెద్దాయన మాటలతో వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. కళ్ళు తెరచుకున్నాయి భుజంగానికి.
*
============
దానం శివప్రసాదరావు, ఇంటి నెంబర్: 15-2-132/1
గాయత్రీనగర్, ఫస్ట్ క్రాస్‌రోడ్డు, మాచర్ల-522426,
గుంటూరు జిల్లా, సెల్ : 9441172088

ఈ వారం కథ
english title: 
weekly story
author: 
-దానం శివప్రసాదరావు

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>