
కవీశ్వరా
- పద్యశతకము
డా.అక్కిరాజు
సుందరరామకృష్ణ
వెల: తెలియదు
ప్రతులకు: 1-8-702-1-1 ఆంధ్ర బ్యాంకు సందు
నల్లకుంట, హైదరాబాద్-44.
‘‘కవీశ్వరా’’ అనేది డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ రచించిన పద్యకృతి. ప్రధానంగా ఇది వ్యంగ్యోక్తులతో కూడినది. వర్తమాన సమాజంలోని విభిన్న రంగాలలోని అవినీతిని చూచి కవిగారు విసిగిపోయి సంధించిన అక్షర శరాస్త్రాలివి. వ్యంగ్యం అధిక్షేపం, ధిక్కారం ఇవన్నీ తరతమ భేదాలలో మనకీరచనలో కన్పడుతాయి. ‘‘కవీశ్వరా’’ రచనకు కొంత నేపథ్యం ఉంది. మొదటిది అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులవారి నేటి కాలపుకవిత్వము. ఇది 40వ దశకంలో వచ్చింది. ఆనాటి భావకవిత్వంపై అది తిరుగుబాటు రచన. ఈ అక్కిరాజు ఆ అక్కిరాజు గారి వంశీయుడే. అంటే ఆనాడు కృష్ణశాస్ర్తీవంటి వారిపై అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు చేసిన యుద్ధమే ఈనాటి సాహితీ తృష్ణ శాస్త్రులపై ఈ అక్కిరాజు ప్రకటించిన రణభేరి ఇది. ఇక రెండవ అంశము ఒక రచనా పరిణామము. కవీశ్వరా శతకమునకు దాదాపు ఇరువది సంవత్సరాల నేపథ్యం ఉంది. రంగరంగ కేశవా మాధవా రమణా, అమ్మతోడు, శంకర నారాయణీయము, భీమన్నాద్విశతి వంటి గ్రంథమాల పరిణామక్రమంలోనే ఈ కవీశ్వర శతకం అవతరించింది. ఇక అక్కిరాజు ప్రధానంగా వర్తమాన సాహిత్య సామాజిక కాలుష్యం మీద దృష్టిసారించారు. సమాజంలో అవినీతి ఉంది. సాహిత్యంలో కాలుష్యం ఉంది. అంతా ‘ఇమ్యూన్’ అయిపోయి సర్దుకుపోతున్నారు. అయోగ్యులు అందలమెక్కుతున్నారు. పురస్కారాలను కొనుక్కుంటున్నారు. బద్మాషులూ జాకాల్స్ రొమ్మువిరుచుకొని తిరుగుతుంటే వారికి సామాజిక గౌరవం లభిస్తున్నది. రాజకీయ అవినీతిని మించి సాహిత్య అవినీతి వ్యాపించింది. దీనిని ఈ కవి భరించలేక విధినెదిరించి అక్షర వీధిని పడ్డాడు. తత్ఫలితమే కవీశ్వరా శతకము. ఈయన దృష్టిలో కవియన్నచో దాశరధి కృష్ణమాచార్యులుగారే కవి. తక్కినవారు చెట్టుపేరు చెప్పుకొని కాయలనమ్ముకునేవారు. నాయకుడన్నచో టంగుటూరి ప్రకాశం పంతుగారే నాయకుడు. తక్కినవారు వినాయకులు. ప్రజాస్వామ్యము పేరుతో నేడు దోపిడీ జరుగుతున్నది. (ఈ అక్కిరాజు విప్లవ నాయకుడు అక్కిరాజు రామకృష్ణ బంధువే.) అయినా ఇతనికి ప్రజాస్వామ్యం పట్ల ఇంకా విశ్వాసం చావలేదు. అందుకని తుపాకీ పట్టుకొని అడవి బాట పట్టకుండా కలాన్ని తుపాకీగా మార్చి తిరుగుబాట పట్టినాడు. తిక్కన్న నావాడు తిమ్మర్సు నావాడు అట్టి వంశాల జనియించినట్టి నాకు పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టబోకు ‘‘అని రంగ-రంగ అంటూ హరిదాసువలె దేవునిపైననే వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. ఇందులో పరోక్షంగా తాను షట్‌సహస్రకులీనుడనని చెప్పుకోవటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కవీశ్వరా శతకాన్ని అర్ధంచేసుకోవాలి. రచయితలు, రాజకీయవేత్తలు తమ ఉద్యమాలకు మానిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటారు. అలాగే సాహిత్య కాలుష్య నిర్మూలనోద్యమ సారధిగా నిలిచిన జూనియర్ అక్కిరాజు వారు (సీనియర్ అక్కిరాజు ఉమాకాంతం కాబట్టి ఇలా అనటం సమంజసమే.) తమ కవీశ్వరా పీఠికను మానిఫెస్టోగా మార్చుకున్నారు. ‘‘రాజకీయ నాయకులకన్నా బాగా నిర్వీర్యమై కలుషితమైపోయిన వారు ఈ తరం యువత. ‘‘ప్రస్తుత పరిస్థితులల్లో ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రం ఇస్తే బాగుంటుందని అనిపిస్తున్నది’’. ‘‘బండిలో ఎక్కించినంత మాత్రాన రాళ్లు రత్నాలవుతాయా?’’
(పుట.18 ‘‘కమ్యూనిస్టు నేనంచు కర్మ కర్మనంద ఎకరాలు కొన్నాడు వాసుగాడు’’ ‘‘నారాయణాచార్యులకు రావలసింది మరో ఆచార్య నారాయణాహ్వయులకు వచ్చిందని’’ ఈ కవి తిరగబడ్డాడు. (23వ పుట.) కవి ‘‘దడ-్ఫటాఫట్. వాడంతే. ఏయ్. ఓయ్. కాయ్’’ ఏం సినిమా పేర్లండీ ఇవి (30వ పుట.)
ఇలా సుదీర్ఘమైన పీఠికలో వర్తమాన కవుల దుర్‌వర్తనాన్ని కళా(సినీ) రూపాల నికృష్ట వెకిలి చేష్టలనూ రాజకీయాల రంగు(కు)వేషాలను చూచి ఈ కవి విసిగిబోయి పద్యాన్ని ఆయుధంగా చేసికొని తిరుగుబాటు చేసినట్లు అర్థంచేసుకోవచ్చు.. నిజమే. ఈ పురస్కార క్రయవిక్రయోన్మాదులకు అంజలి- జమున- సావిత్రి- కన్పడక పోవటంలో ఆశ్చర్యం ఏముంది?
‘‘సందర్భోచితంగా డాఫరులు లోఫరులు మాయనాకొడుకులు బక్ర- దొబ్బెడిదేమొ’’ వంటి పదాలు యధేచ్ఛగా వాడారు.
ఆనాటి (తెనాలి) రామకృష్ణ కవి హాస్యకుశులుడని వాడుక ఉంది. కాని పాండురంగ మహాత్మ్యంలో అలాంటి ధోరణి కన్పడదు. ఈ రామకృష్ణకవి మాత్రం అడుగడుగునా అధిక్షేపం చమత్కారం ప్రదర్శించాడు. ‘‘్ధ్యయము నాయకాళికలనిప్పుడు దైవముసాక్షి నాటుసారాయము గ్రోలజేయుటను వ్యాప్తిని సల్పుటే కోట్ల కొద్ది ఆదాయము వృద్ధిచేయుటయె’’(పుట: 78) ‘‘దర్భనుగారవింత్రు మరి తద్దయుభక్తి నమస్కరింత్రు, మాయర్భకాలీ పవిత్ర ధరయందు నటించు పల్కు నేను బలోదుర్భమైన రుూ ఘటనతో తలనిగ్గునవంచుచుంటి ఈ నిర్భయమేమిటో పరమనీచులకీగతి ఓ కవీశ్వరా!’’ (పుట.84) ఇందులో ఢిల్లీ నిర్భయపై జరిగిన అత్యాచారాన్ని సామాజిక స్పృహలో కవిప్రస్తావించారు. ఇందులో జమలాపురం కేశవరావు గాంధీ నెహ్రూ భగత్‌సింగులను కన్న భారతజాతి యేనా ఇది? అని పెక్కుచోట్ల ఆక్రోశించారు. సుందరరామకృష్ణలో ఉద్వేగమున్నది. కాని వర్తమాన సమాజముపై ఈ కవితలు దున్నపోతుమీది వానవలెనే పనిచేయునవి.