
అత్యుత్తమమైన జీవితం
నవల
జిమ్ స్టోవాల్
అనువాదం:
ఆర్ . శాంత సుందరి
ప్రచురణ:
మంజుల పబ్లిషింగ్ హౌస్
వెల :150 రూపాయలు
ప్రాప్తి స్థానం: అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద
మీరు ఒక బిలియన్ డాలర్లని పోగొట్టుకుంటే వాటిని తిరిగి సంపాదించేందుకు ఏం చేస్తారు. జేసన్ స్టీవెన్స్ అత్యుత్తమ కానుకను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు... అంటూ అత్యుత్తమమైన జీవితం నవల కవర్ పేజీ మీద కనిపించే అక్షరాలు పుస్తకంలోకి ఆసక్తిగా పరిగెత్తిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే పుస్తకాలు ఇంగ్లీష్‌లో లెక్కలేనన్ని వచ్చాయి. అవి ప్రపంచంలో అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి.
వ్యక్తిత్వ వికాసం అంశాన్ని పీల్చి పిప్పి చేశాం ఇంకా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. చెప్పిన అంశాలనే కొత్త కోణంలో చెబుతున్నామని ఇటీవలే ఒకప్పటి పాపులర్ నవలా రచయిత, తరువాత వ్యక్తిత్వ వికాస తెలుగు పుస్తకాల్లో నంబర్ వన్‌గా నిలిచిన రచయిత పేర్కొన్నారు.
జిమ్ స్టోవాల్ట్ రచించిన ఆంగ్ల పుస్తకం ద అల్టిమేట్ లైఫ్ తెలుగు అనువాదం అత్యుత్తమమైన జీవితం
ఇంగ్లీష్‌లో బాగా పాపులర్ అయిన ఈ రచనను అర్ శాంత సుందరి తెలుగులో అనువాదం చేశారు. విషయం ఆసక్తికరంగానే ఉంది. మంచి విషయాలు, మనసుపై తీవ్రమైన ప్రభావం చూపాల్సిన అంశాలను నేరుగా చెప్పడం కన్నా కథలుగా చెప్పడం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. ఈ రచనలో సైతం అదే విధంగా ఉత్కంఠ కలిగించే విధంగా జీవితంలో అత్యున్నతమైన అంశాలను నవలలో వివరించారు. జీవితంలో పని, డబ్బు, స్నేహితలు, చదువు, జీవితంలో సమస్యలు, కుటుంబం, జీవితంలో నవ్వు, కలలు, ఇవ్వటంలో ఉండే సంతోషం, కృతజ్ఞత చూపడం, జీవితంలో ప్రేమ అంతిమంగా అత్యుత్తమ జీవితం కోసం అనుసరించాల్సిన మార్గాలను నవగా తీర్చిదిద్దారు. అంశం ఆసక్తికరంగా ఉన్నా, మనిషి ఉత్తమ జీవితం గడిపేందుకు ఉపయోగపడే విధంగా ఉన్నా అనువాదం విషయంలో కొంత అసంతృప్తి తప్పదు.
‘దొరక్కుండా పోవడానికీ, దొరక్కుండా ఉండేందుకు ప్రయత్నించడానికీ బోలెడంత తేడా ఉంది’ అనువాదం అయినా బాగుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం అనువాదం మింగుడు పడని విధంగా ఉంది.
‘‘కౌన్సిలర్, మీ అతినాటకీయతనీ, ఊహాగానాలనీ అనుభవం లేని నటులు వేసే నాటకాల కోసం, లేదా హావ భావాలతో విషయాలని కనిపెట్టటమనే అటల కోసం దాచి ఉంచుకోండి, ఈ కోర్టులో మాత్రం మనం వాస్తవాలనీ, చట్టాన్నీ మాత్రమే అనుసరిద్దాం’’ అంటుంది ఒక పాత్ర మరో పాత్రతో. ఎవరైనా ఇలా మాట్లాడుకుంటారా?
మక్కీకి మక్కీ అనువాదం చేయాలని నిర్ణయం తీసుకుప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి కానీ సహజంగా ఇలా మాట్లాడుకుంటారా?
అనువాదం విషయంలో రచయిత కొంత స్వేచ్ఛ తీసుకుని ఉంటే బాగుండేది. ఇది అనువాద రచన అని పదే పదే గుర్తు చేసే విధంగా ఉంటే చదివే వారికి ఇబ్బందిగా ఉంటుంది. చదవడంలో బ్రేకులు పడుతుంటాయి.