
హృదయ వేదన వనంలో
పొత్తూరి సుబ్బారావు
ప్రతులకు: 9-13-154
అలకాపురి, రోడ్ నెం.3
హైదరాబాద్- 500 035
ఫోన్: 040- 20060181
విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు,
సాహితీ కిరణం
కార్యాలయంలో.
వేటకెళ్లిన సింహం వేటాడే తిరిగి వస్తుంది. అలాగే కవిత్వం రాస్తున్నాను అనుకునే కవి ఎప్పటికైనా కవిగా నిరూపించుకుంటాడు. అలసత్వం, ఆవేదన, ఆందోళన లాంటివన్నీ మనసును కుదిపేసినపుడు కలిగే భావాల్ని కవిత్వంగా మలచినా వాటికి బాహ్య సౌందర్యమో లేక అంతఃసౌందర్యమో కొరవడుతుంటుంది. ఆ కొరత లేకుండా మలవపడ్డ కవితలు పొత్తూరి సుబ్బారావు ‘హృదయవేదన వనంలో’. సంవేదన, సంఘర్షణ లేకుండా కవితలు ఎలావస్తాయనే అర్థం మనకు గోచరిస్తుంది. అమ్మ గురించి, నాన్న గురించి ఒకే మూసలో కొట్టుకుపోతున్న రోజుల్లో ఫాదర్స్‌డే సందర్భంగా వీరి కలంనుండి ‘రుతురాగాల మాధుర్యం’అనే సరికొత్త పదాల పర్వం గోచరిస్తుంది. గమనించండి ‘‘ఒడిలోన చేర్చుకుని/ శిశువును ముద్దాడి లాలించే/ మాతృమూర్తి ముగ్ధసౌందర్యాన్ని చూసి/ ముగ్ధుడైన ఆ తండ్రి ముఖంలో/ ప్రకృతి అందించిన వసంత శోభ తాండవిస్తుంది కదా?’’ తండ్రి వదనంలోకి ఆనందాన్ని వసంత కాలపు శోభతో పోల్చడం ఎంతో బావుంది. బడిలోకి చేరేటపుడు గ్రీష్మ రుతువు, కౌమార దశలో వర్షరుతువు, వృద్ధాప్యం దశలో రాలిపోయే శిశిర రుతువులన్నీ ఒక తండ్రికి తన బిడ్డలపై కలిగే మనస్థితిని వర్ణించిన తీరు సరికొత్తగా ఉంది.
పొత్తూరి సుబ్బారావుగారి కవితాశైలి, సృజనాత్మకత, వస్తువు, అభివ్యక్తీకరించే విధానం అన్నీ కొత్త దనాన్ని సంతరించుకున్నాయి. ప్రతి వ్యక్తి కీర్తిమకుటాలను సరిచేసుకోవాలని పడే తాపత్య్రయాలను ఈ కవి ఎంతో గమనించారనే అనిపిస్తుంది. అనిపించడమే కాదు వాస్తవికత లేని ఆ మకుటాలు దేనికి పనికివస్తాయనే అనుకున్నారు అనిపిస్తుంది వీరి కవిత ‘సకల కళానిలయాలు’ను చదువుతుంటే. ‘‘ఆలయప్రాంగణంలోకి అడుగిడగానే/ అగుపించే అద్భుత శిల్పరూపాలు/ ఆ శిల్పికళానైపుణ్యానికి/ అద్దంపట్టినా అతని పేరుమాత్రం ఎక్కడా అగుపించదు. అది ఆలయమందలి దేవునికి/ తలవంచడమో! ఏమయితేనేం? శిల్పకళ రాజ్యమేలుతున్నది’’ అనడంలో ఎంతో సంస్కారం కనిపిస్తుంది. అందరం దేవాలయాలకు వెళతాం. అక్కడున్న శిల్పాలకు వ్యతిరేకంగానో, సానుకూలంగానో ప్రతిస్పందిస్తుంటాం. కానీ వాటి వెనుక వున్న శిల్పి ఎవరు అని ఆలోచించేవారు వందలో ఒకరు కూడా ఉండరు. అలా ఉన్నారంటే వారు కవి అనాలి. ఆ కవితత్వం పొత్తూరు సుబ్బారావులో ఉందనే కచ్చితంగా చెప్పాలి.
ఇలా ఈ గ్రంథంలోని 48 కవితల్లో తీసుకున్న వస్తువు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మానవతా వాకిలి, ఒక్క పరాజయం చాలు, రేపటి చరిత్ర, నవచైతన్యం లాంటి కవితలు మనల్ని నిలదీసి ప్రశ్నించే దిశగా ప్రయాణిస్తాయి. ఈ హృదయవేదన వనంలో అన్నీ మంచి కవితలే పూచాయి. ఇక ఆ పువ్వుల మకరందాన్ని అందరూ ఆస్వాదించాలని కోరుకుందాం!!