
సప్తవర్ణాల హరివిల్లు
సాహిత్య వ్యాసాలు
- అంపశయ్య నవీన్
వెల: రు.300
పుటలు: 369
ప్రముఖ పుస్తక విక్రయశాలలు
వరంగల్‌కు చెందిన దొంగలి మల్లయ్యకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం వచ్చిందట. ఆయన 28 నవలలు, 70 కథలు, 100కు పైగా వ్యాసాలు రాశాట్ట. ఆయన తెలుగు సాహిత్య అధ్యాపకుడు కూడా కాదట. ఆర్థిక శాస్త్రోపన్యాసకుడట. అరే! ఇంత గొప్ప వ్యక్తిఅయితే మనమెన్నడూ వినలేదే అని తలగోక్కోవద్దు. ఆయన గొప్ప నవలాకారునిగా, కథకునిగా శాశ్వత కీర్తి సంపాదించుకున్నాడు. కానీ తన సొంత ఇంటి పేరుతో, తన సొంత పేరుతో రచనను చూసుకోవడంలో మాత్రం విఫలుడయిన వ్యక్తి(పుట 350). వారే శ్రీ అంపశయ్య నవీన్‌గారు. ప్రత్యేక పరిచయం అక్కరలేని తెలుగు నవలాకారుడు. అంపశయ్య, కాలరేఖలు, అంతస్రవంతి, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు, చీకటి రోజులు లాంటి నవలలు, కథానికాసంకలనాలు, వ్యాస సంకలనాలు ప్రకటించారు. నవీన్‌గారి నవలలు, కథలు, ఆంగ్లం, హిందీ, కన్నడాల్లోకి అనువాదమయ్యాయి.
నవీన్‌గారి తాజా రచన సప్తవర్ణాల హరివిల్లు. ఇది వారి సాహిత్య వ్యాసాల, సమీక్షల మూడో సంకలనం. ఇందులో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడ ఉన్నాయి. నవీన్‌గారు చేసిన సమీక్షల్లో కథలు, నవలలు, వ్యాసాలు, యాత్రా రచనలు, కవిత్వం అన్ని ఉన్నాయి. నవీన్ వ్యాసాల్లో, రచనల్లో సారళ్యం, స్పష్టత, ప్రజాస్వామిక దృక్పథం, నిష్పాక్షికత కనిపించడం అభినందనీయమైన అంశం.
నవీన్‌గారు 1962-1964లో ఎం.ఎ. చేశారు. ఆనాటి పరిస్థితులను, విద్యార్థుల మానసికాందోళనలను చాల స్పష్టంగా నవీన్‌గారు వర్ణించారు. విద్యార్థులలో ఉన్న కుడి, ఎడమ భావజాలాలు, సెక్సువల్ రెస్ట్‌లెస్‌నెస్, రకరకాల మనస్తత్వాల మధ్య సహజీవనం, సినిమాలు, హోటళ్లు, సౌకర్యాలు, ఆర్ట్స్ కాలేజీ ఆకర్షణలు నన్ను చదువుకు దూరంచేశాయి. ఎం.ఎ. పాసయినా ఉద్యోగం దొరకదేమోనన్న అనిశ్చితి, టెంపుల్స్ ఆఫ్ లెర్నింగ్‌గా ఉండవల్సిన విశ్వవిద్యాలయాలు ఇంత దిగజారిపోతున్నాయేమిటన్న బాధ. కుల మతతత్వాలు బలపడ్తున్నాయేమిటన్న ఆవేదన, చుట్టుఉన్న విద్యార్థుల్లో కనిపించే కుసంస్కారం (పుట 123) నవీన్‌గారిని వేధించాయట. 1964నాటి స్థితి ఇదయితే 50 ఏళ్ల తర్వాత ఇప్పటికైనా ఈ స్థితి మెరుగుపడిందా? మరింత భ్రష్టుపట్టిందా అన్నది ఎవరికివారు బేరీజు వేసుకోవాల్సింది.
నవీన్‌గారు తన జీవితానుభవాలను, తాను ఎదిగిన తీరును వివరించిన నాలుగయిదు వ్యాసాలు అవశ్యం చదవవలసినవి.
సి.వి.కొండయ్య తాన్‌సేన్ గురించి ‘‘స్వరసంధ్య’’ పేరుతో రాసిన అపూర్వ నవల ప్రస్తావన ఎక్కడా వినలేదు. బాగుంది కందిమళ్ళ ప్రతాపరెడ్డి చేగువేరా; ముకుందరామారావు నోబుల్ బహుమతి కవులు, ఎండ్లూరి సుధాకర్ గోసంగి, శ్రీపాద, జింబో, దాసరి అమరేంద్ర, గోపిని కరుణాకర్ల కథాసంకలనాల సమీక్షలు, విషయాత్మకంగా సాగాయి. రామాచంద్రవౌళి కాళోజి, సదాశివ, జయశంకర్, పేర్వారం జగన్నాథంలతో ఉన్న అనుబంధాన్ని వివరించిన తీరు హృద్యంగా సాగింది.
నవీన్‌గారి సమీక్షల్లో, వ్యాసాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని ఎంత ప్రాసంగికతను విజ్ఞతను కలిగివున్నాయో గమనించవచ్చు. ప్రత్యేక తెలంగాణా అంటే దోపిడీ దొరల మీద పోరాటమే కాని సామాన్య జనంపైన కాదని స్పష్టంగా చెప్పవలసి ఉందంటారు. (పుట.356). వర్తమాన ఆవేశ ప్రవాహంలోపడి ఈ విజ్ఞతను కోల్పోయి ఆ ప్రయోజనకరమైన ద్వేషాసూయలను పెంచుకోరాదు. సామాజిక ప్రయోజనం, సామాజిక స్పృహ పేరుతో వస్తువుకే ప్రాధాన్యమిచ్చి శిల్పవైవిధ్యం, ప్రయోగశీలం, వినూత్నాభివ్యక్తి పట్ల దృష్టిలేకుండా చేశారు. (పుట 341) సామాజికవాదులు తెలుగు సాహిత్యం చాలాకాలం నిరంకుశంగా పాలించారు. మళ్ళీ ఈ సామాజికవాదుల్లో కూడ కులాన్నిబట్టి, ప్రాంతాన్నిబట్టి బోలెడు గ్రూపులున్నాయి. వీళ్ళు ప్రతి రచయితను ‘‘వీడు అస్మదీయుడా, తస్మదీయుడా’’అన్న దృష్టితో చూస్తారే తప్ప వాడి రచనలోని సాహిత్య విలువనుబట్టి చూడరు. దానివల్ల చాల హాని జరిగిందంటారు. (పుట. 345) నవీన్‌గారి ఈ అభిప్రాయంలో వాస్తవం లేదంటారా?
మారుమూల మాండలికాన్ని ఇష్టం వచ్చినట్లు రచనల్లో గుప్పించకుండా అనుభవాన్ని రంగరించి; మానవతా విలువలు పెంచే విధంగా సాహిత్య సృజనంచేయాలని రచయితగా అర్ధశతాబ్దం పూర్తిచేసుకున్న సీనియర్ రచయిత నవీన్‌గారి హిత వచనాలు వినే తీరిక ఓపిక ఎంతమందికుంది నేడు? (పుట 349)
అద్దేపల్లిగారి సిద్ధాంత గ్రంథమయినా, దార్ల వెంకటేశ్వరరావు మాదిగ దృక్పథం అయినా, రామచంద్రవౌళి కవిత్వమైనా, కథావార్షికలయినా సరే ఇలా ఎవరి గ్రంథాన్ని సమీక్షించినా నవీన్‌గారు సమీక్షకు కేటాయించిన పరిమిత స్థలంలో క్లుప్తంగా ప్రధానాంశాల పరిచయం. వివేచనం, అవసరమైనంతమేరకు విభేద అభిప్రాయ వ్యక్తీకరణం, సాధారణీకరణం, తగిన ఉదాహరణలలో సమర్ధనం అనే ఒక క్రమపద్ధతిలో సాగుతాయి. ఎక్కడా ఆవేశం, మాట తూలుడు లేనితనం అందరినీ ఆకట్టుకుంటుంది.