
‘‘విడని ముడి’’ (కవిత్వం)
ముకుంద రామారావు
వెల: 60 రూపాయలు
పేజీలు: 117
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
ప్రపంచీకరణ పుణ్యమా అని అన్ని విలువలు నాశనమవుతున్నాయి. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మనుషుల్లో కెరీరిజం ముఖ్యమైపోయింది. చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, కుటుంబాలు అన్నీ వ్యాపారమయమైపోతున్నాయి. స్వార్థం, అవకాశవాదం పెచ్చరిల్లిపోతున్నాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. బంధాలు-అనుబంధాల గురించి మరిచిపోతున్నారు. ఎంతగా మరిచిపోవాలని చూసినా, ఎంత తెంచి వేసుకున్నా మనుషుల మధ్య వుండే ఆ ‘‘విడని ముడి’’ మనల్ని కట్టి పడేస్తుందని ముకుందరామారావు తమ కవిత్వం ద్వారా తెలియజేస్తున్నారు. కవి తన కుటుంబాన్ని అనగా తన అమ్మానాన్నలు, భార్య, పిల్లలు, మనవలు- ఇలా అందరితో వున్న అనుబంధాన్ని, వాళ్ళ ప్రేమానురాగాల్ని కవిత్వం ద్వారా ఆవిష్కరించగలిగారు.
‘‘చెరువులో నీరులా వుండక/ సమస్తం వదిలి/ సముద్రాలు దాటిపోవడమెందుకో’’ అని వందేళ్ళ క్రితమే దక్షిణాఫ్రికాకి వలసపోయి తిరిగి రాలేకపోతున్న పూర్వికులందర్ని తలచుకుని బాధపడతాడు. బంధువులు, కుటుంబీకులు ‘అందరూ అన్నిచోట్లావుంటే/ ఎంత బాగుండు’’నని ఆశిస్తారు. కాని అది ఎలా సంభవం? జీవితం అందర్ని ఎక్కడెక్కడికో విసిరేస్తుంది కదా!’’ దూరమే కదా/ అందర్ని దూరం చేస్తుంద’’ని గుర్తిస్తారు. మన ఇల్లు అనే భావనను కలిగించే తాతలతండ్రుల ‘సొంతిల్లు’, ‘తాతయ్య కళ్ళద్దాలు’ దాచి ఆటపట్టించే మనవడి రియలైజేషన్ కూడా కవిత్వీకరించబడింది. ఒక పురావైభవ ప్రతీకగా మిగిలిపోయిన నాన్నగార్ని ‘‘వాకిట్లో/ వాలుకుర్చీ/ మానాన్న’’ అంటూ వృద్ధులకే రిజర్వు అయిన ఆ వాలుకుర్చీ మా తాతయ్యది. ఇవ్వాళ నాన్నది.‘బహుశా రేపు నాది’ కావచ్చంటారు. ‘‘మా అమ్మ మూడేళ్ళు మంచం మీదుంది/ బతుకుతుందని మేము/ చావాలని ఆమె’’ వృద్ధాప్య సమస్యలు అలాంటివి. ఎనభై ఏళ్ళ సహజీవనం గడిపిన అమ్మానాన్నలు చివరకు వారంరోజుల వ్యవధిలో ఒకరి వెనుక మరొకరు స్వర్గస్తులయితే వాళ్ళను, ‘‘వాళ్ళులేని ఇల్లు’’ను తలచుకుంటూ రాసిన ఎలిజీ మనసును కదిలిస్తుంది. ‘‘పిల్లలందరికీ/ అనేక సందర్భాలలో/ ననుగన్న నా వారి గురించి చెపుతున్నప్పుడు/ వారందరిలో నన్ను చూస్తారో/వారిని నాలో చూసుకుంటారో/ ఒక వెదుకులాట’’ నిజమే. వాళ్ళే వెతుక్కుంటారో వాళ్ళకే వదిలేద్దాం.
‘‘నా చిత్రాన్ని నేనే గీసుకుంటున్నాను/ పూర్వికుల ఛాయలందులో’’ మంచి భవిష్యత్తుకోసం ఎక్కడెక్కడికో వెళ్ళక తప్పదు. వలసలు అనివార్యం. ‘‘అలా పరిగెడుతూనే ఉంటాం/ ఎందర్నో విడిచి అంతంత దూరం/ అలుపుతీరేందుకు ఆగినా అసంతృప్తే/ వెనక్కిలాగుతున్న దిగుళ్ళని దాటుకుంటూ/ మళ్ళీ పరుగు’’ ఇష్టంలేకపోయినా ఈ పరుగుపందాన్ని కొనసాగించాల్సిందే. అందుకే ‘‘ఎన్ని భాషలు తెలిసినా/ హృదయ భాష/ బతుకు భాషతోనే’’అని నిర్వచిస్తారు. కుటుంబంపై ఆకర్షణ, కుటుంబం పట్ల వహించాల్సిన బాధ్యతలు అన్నీ కలిసి మనిషిని ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంపాదన చుట్టూ తిరుగాడేటట్లు చేస్తాయి. తప్పదు. ‘‘బంధనాల వ్యామోహం/ ఉదయాస్తమయాల/ సముద్ర సూర్యుడంత/ అద్భుతం.’’ఒక జీవన సత్యాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు?
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలతోపాటు దాంపత్య జీవితంలో ఆధిక్యతా పోరాటాలు, అభిప్రాయ భేదాలు చోటుచేసుకోవడం మామూలే. వాటిని సున్నితంగా అభివ్యక్తీకరించిన కవి ‘‘కలవనంతవరకే/ కొలవలేనంత దూరం/ నీకూ/ నాకూ’’ అని మధనపడినా, ‘‘కనిపించినా/ కనిపించకపోయినా/ నువ్వులేకపోతే/ నేనూ లేను’’ అని తేల్చేస్తాడు. తల్లిదండ్రుల మధ్య వారధిలా పిల్లలు, భర్త దిగులును పోగొట్టడానికి ప్రయత్నించే భార్య, రోజంతా ఎడతెరిపి లేకుండా భార్య చేసే ఇంటి చాకిరిని గుర్తించిన భర్త నిస్సహాయతను కొన్ని కవితలు తెలియజేస్తాయి. ఆడాళ్ళకు చీరల మీద వున్న వ్యామోహాన్ని చిత్రీకరించిన కవిత వెరయిటీగా వుంది. బాగుంది.
‘‘ఉదయమెప్పుడూ/ కూతురులానే/ అందంగా ఆప్యాయంగా వస్తుంది’’ అలాంటి ప్రేమాస్పదురాలైన కూతురు పెళ్ళయి వెళ్ళిపోతే ‘‘తెలిసి తెలిసి/ సైబేరియన్ పక్షిలా వలసపోయినట్టుంది’’ అని దిగాలు పడిపోతారు. ‘‘అర్ధాంగి కాకముందు/ ఆ అమ్మాయి/ ఒకే ఒక్క ప్రపంచంలో/ స్వేచ్ఛా విహంగం/ ఇప్పుడామె/ రెండు ప్రపంచాలమధ్య లోలకం’’ అని గుర్తిస్తారు. ‘‘మా అబ్బాయికి/ అమ్మాయి పుట్టాక/ నా కూతురు ప్రేమ అర్ధమయింది వాడికి’’ అని మంచి ముక్తాయింపునిచ్చారు.
పిల్లలు మంచి భవిష్యత్తు వెతుక్కుంటూ విదేశాలకు వెళ్ళడం మామూలైపోయింది. ‘‘అమ్మని వదిలి ఉండలేనన్నవాడు/ ఎక్కడికైనా...అయినా/ విడిచి వెళ్తున్నప్పుడు/ నేల మీద వా కన్నీళ్ళు/ ఈ భూమిని వదలనంటుంటే/ ఆకాశంలో ఎగరటానికి/ భారంగా లాక్కెళ్తున్న కాళ్ళు’’ అంటూ కొడుకు మానసిక స్థితిని అక్షరబద్ధం చేశారు. దూరంగా వుండి ఎంత మాట్లాడుకున్నా పుత్రవియోగం ప్రతిక్షణం జ్ఞాపకం వస్తుంది. ‘‘ఇంటికి రాకుండా/ మూడు సంవత్సరాలే అయింది వాడికి/ ఒక వెయ్యి తొంభైఅయిదు రోజులయ్యాయి మాకు’’ అని గుర్తుచేసుకుంటారు. అలాగని అబ్బాయి సెలవుల్లో వచ్చినా ఎంత కాలమున్నా తనివి తీరదు. ‘‘వెళ్ళాలని నీకూ లేదు/ పంపాలని నాకూ లేదు/ వెళ్ళక తప్పదని/తెలియనిది కాదు’’ అంటారు.
‘‘ఏదో తెలియని తనం నుంచి/ ఏదో తెలుస్తున్నతనంలోకి/ ప్రవహిస్తున్న పరిణామం/ నా పద్యంలాటి పసితనం’’ అంటూ మనవలు, మనవరాళ్ళ బాల్యాన్ని, వారి ఆటపాటలను, వారి పేచీలను, ఊరడించడాలను ఇలా ఎన్నింటినో కవిత్వీకరించిన విధానం బాగుంది. ‘‘గుర్తుకొచ్చేదిపుడు/ పిల్లలకంటే/ వారి పిల్లలే’’ అసలుకంటే వడ్డీముద్దు అంటే ఇదే. ఇవ్వాల్టి పిల్లలు మిలినీయం పిల్లలు. ‘‘నా బాల్యాన్ని, యవ్వనాన్ని/ వాళ్ళే ధరించి/ ఒక లఘు చిత్రాన్ని/ నా కళ్ళముందు ప్రదర్శిస్తారు’’ అవేవో ఊహించుకుంటే తాతగారితో పాటు మనమూ ఆనందించగలం.
ఎవరి జీవితాలు వారివైనప్పుడు చెల్లాచెదురయిన మిత్రులు ఎక్కడున్నారో తెలియదు. ‘‘మిత్రమా/ సంజాయిషీలు లేవు/ పేరుకుపోయిన జ్ఞాపకాల పొరల్లో/ నువ్వింకా భద్రంగా ఉన్నందుకే/నాకు ఆనందం’’ ఆత్మీయంగా దగ్గరగా వచ్చిన మిత్రులను ఎప్పటికీ మరిచిపోలేము. ముక్కూమొహం తెలియని వెబ్ స్నేహాల గురించి కూడా మంచి కవిత రాశారు. జీవన తాత్త్వికతను వివరించిన కవితల్లో ‘‘మొదటి స్నానానికి చివరి స్నానానికి మధ్య’’ కవితలో మరణ వైరాగ్యాన్ని చిత్రీకరించిన విధానం ఎప్పటికీ జ్ఞాపకముండి పోతుంది. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆత్మీయుల మధ్య వుండే బంధాలు అనుబంధాల గురించి ఎంత రాసినా ఇంకా చెప్పాలనుకున్నది మిగిలిపోయి వుంటుంది. అందుకే ‘‘రూపుదిద్దుకున్న వాటికంటే/ ఎంత బాధించినా/ బయటకు రాలేకపోయిన/ మంచి పద్యాలెన్నో’’ ఉన్నాయంటారు.
ఇందులోని కవితలన్నీ ఆర్ద్రంగా, ఆత్మీయంగా వుండి మనసుకు హత్తుకుపోతాయి. అనుభవించి, పరవశించి, పలవరించిన భావనలు కాబట్టి ఇవి కవిత హృదయావిష్కరణలుగా మనం గుర్తించగలం. కొన్ని కవితలు వర్ణనాత్మకంగా వుంటే, మరికొన్ని కవితలు దృశ్యాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తాయి. కొన్ని కవితలు సంభాషణాత్మకంగా వుంటే మరికొన్ని కవితలు సంవాద రూపంలో ఉన్నాయి. ముఖ్యంగా కొసమెరుపు కవితలు పాఠకుడ్ని ఆశ్చర్యానందంలో ముంచెత్తుతాయి. ఒక్క పొల్లు పదం లేకుండా, ఒక్క అనవసర వాక్యంలేకుండా ఇంత స్పష్టంగా, ఇంత క్లుప్తంగా రాసిన విధానం అచ్చెరువు కలిగిస్తుంది. ఇవి చదివిన తర్వాత మనం కోల్పోతున్నదేమిటో మనకు తెలిసివస్తుంది. కుటుంబం, కుటుంబ సభ్యుల పట్ల ఉండాల్సిన ప్రేమను, బాధ్యతలను ఈ పుస్తకం గుర్తుకు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.