పాడేరు, ఫిబ్రవరి 2: రాష్ట్ర విభజన కంటే తనకు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలం పూలబంద, 12వ మైలు కూడలి, బిరిమిశాల, వనుగుపల్లి, వంతాడపల్లి, డి.సోలములు, వై.సోలములు, ఇ.కొత్తూరు గ్రామాలలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శాసనసభలో తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించానని చెప్పారు. శాసనసభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుతో పాటు అనేక మంది ముఖ్యులు ఉన్నప్పటికీ విభజనపై తన అభిప్రాయాన్ని తేటతెల్లం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. విభజన అంశాన్ని తమ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని, అయితే తనకు విభజన కంటే గిరిజన ప్రాంత అభివృద్ధి ప్రధానమని చెప్పారు. శాసనసభలో చేసిన ప్రసంగంలో గిరిజన ప్రాంతంలోని సమస్యలను సైతం సభ ముందుకు తీసుకువచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. గిరిజన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తాను అయిదేళ్ళుగా పనిచేసినట్టు చెప్పారు. తనను విమర్శించే వారికి తాను చేసిన అభివృద్ధితోనే సమాధానం చెబుతానని ఆయన చెప్పారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు
english title:
v
Date:
Monday, February 3, 2014