శ్రీకాకుళం, ఫిబ్రవరి 2: అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరుకే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. జిల్లాలోని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. 2009 ఎన్నికల నోటిఫికేషన్ కూడా మార్చి మొదటి వారంలోనే విడుదలైనట్టు గుర్తుచేశారు. ఇదే తరహాలో ఈ నోటిఫికేషన్ కూడా విడుదలైన ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదన్నారు. అయితే, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్ జారీ చేయాల్సివుందని, తక్షణమే కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా యంత్రాంగాన్ని ఉంచేందుకే అన్నీ చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలవారీగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసామన్నారు. రాష్ట్ర విభజన బిల్లుతో సంబంధం లేకుండా 294 అసెంబ్లీ, 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. జనవరి 31 నాటికి రాష్ట్రంలో 6 కోట్ల 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. అయితే, 72 లక్షల మంది ఓటర్లు తాజాగా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టు వివరించారు. ఇందులో 36 లక్షల మంది యువకులు ఉన్నారని తెలిపారు.
21 వరకు సీమాంధ్ర న్యాయవాదుల ఆందోళన
విజయవాడ, ఫిబ్రవరి 2: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజన బిల్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందకుండా అన్ని పార్టీలను హెచ్చరించేందుకు న్యాయవాదులు తమ ఆందోళనను పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 3వ తేదీ నుంచి న్యాయవాదులు విధులకు హాజరు కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా 190 రోజులుగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తూ ఉద్యమిస్తున్న విషయం విధితమే. దీంతో సీమాంధ్రలోని వివిధ న్యాయస్థానాల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో నిలిచిపోతున్నాయి. అనేక కేసుల్లో బెయిల్ కూడా రాక వేలాదిమంది జైళ్లలో మగ్గుతున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా 3వ తేదీ నుంచి విధులకు హాజరుకావాలని న్యాయవాదులు గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే టి. బిల్లును శాసనసభ, శాసనమండలి వెనక్కి పంపటంతో ఈ బిల్లు చివరి ఘట్టానికి చేరుకున్నందున తమ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సీమాంధ్ర న్యాయవాద జెఎసి కన్వీనర్ మట్టా జయకర్ తెలిపారు.