విశాఖపట్నం, ఫిబ్రవరి 2: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అసెంబ్లీ తీర్మానాన్ని కాదని రాష్టప్రతి బిల్లును పార్లమెంట్‌కు పంపరని ఆదివారం ఇక్కడ అభిప్రాయపడ్డారు. ఈ సంప్రదాయాన్ని రాష్టప్రతి గౌరవిస్తారన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ బిల్లును సిఫార్సు చేస్తే అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. దేశ చరిత్రలో అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ప్రతిపాదించిన సంఘటనలు జరగలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ సంప్రదాయాన్ని కాదని ముందుకెళ్తే తాము న్యాయపరంగా పోరాటం చేసైనా విభజనను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంశం, అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా జరిగిన తీర్మానంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని అన్నారు. ఈ అంశంపై న్యాయసూత్రాలు, చట్టాలపై విశేష అవగాహన కలిగిన సీనియర్ న్యాయమూర్తులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించడాన్ని గుర్తు చేశారు. న్యాయపరంగా ఉన్న అవకాశాలను తాము వినియోగించుకుంటామని తెలిపారు.
బీచ్ రోడ్డులో కోతకు ఆందోళన వద్ద
విశాఖ బీచ్‌రోడ్డు కోతకు గురికావడంపై ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ తీరంలో కెరటాల ఉద్ధృతికి బీచ్‌రోడ్డు కోతకు గురవడం పట్ల సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై సముద్రరంగంపై అవగాహన ఉన్న పలు సంస్థలు, ఈరంగంలో సాంకేతి పరిజ్ఞానం ఉన్న నిపుణులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కోతను నివారించేందుకు గల అన్ని అంశాలపై చర్చించి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
బిజెపి పునరాలోచనలో పడింది..
రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా పునరాలోచనలో పడిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తప్పుల తడకగా ఉన్న బిల్లును ఆమోదించలేక తిరస్కరించామని చెప్పారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్న సంకల్పంతో బిల్లును తిరస్కరించామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కూడా బిల్లు ఓడిపోతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమైక్య నినాదాన్ని వినిపించే పరిస్థితి వస్తోందని గంటా చెప్పారు.
మంత్రి గంటా స్పష్టీకరణ
english title:
v
Date:
Monday, February 3, 2014