అనంతపురం, ఫిబ్రవరి 2 : ‘యాభై ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కువ భాగం ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ప్రధానులుగా ఉన్నా ప్రజలకు ఒరిగేందేమీ లేదు. గత పది సంవత్సరాల కాంగ్రెస్ పాలన మొత్తం కుంభకోణాల మయమయింది. అందుకే దేశ ప్రజలంతా మార్పును కోరుకుంటూ మోడీ వైపు చూస్తున్నారు.’ అని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనంతపురం ఆర్ట్సు కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘మోడీ ఫర్ పిఎం’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, వారసత్వ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని, యుపిఏ అనుసరించిన విధానాల వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసక బారిందన్నారు. తాయిలాలతో ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని, వాటిని నమ్మి మోసపోయే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు బిజెపికి పట్టం కట్టారన్నారు. ఎమర్జెన్సీ తరువాత కూడా ఆ పార్టీ ఇంతటి పరాభవాన్ని చవి చూడలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారన్నారు. నగదు బదిలీ ప్రవేశపెట్టిన 154 నియోజకవర్గాలకు 130 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. దేశంలో అస్థిరత అన్నింటికంటే ప్రమాదకరమన్నారు. అందుకే సుస్థిర పాలన, నమ్మకమైన నాయకత్వం కోరుతున్న దేశంలో అంతటా ఒకే చర్చ, ఒకే పేరు వినపడుతోందన్నారు. అదే మోడీ పేరు అని హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. మూడవ ఫ్రంట్ అన్నది ఎండమావి లాంటిదన్నారు. అది మూణ్ణాళ్ల ముచ్చటని గతంలో జరిగిన సంఘటనలు రుజువు చేశాయన్నారు. కమ్యూనిస్టులను నమ్ముకుంటే కొంప మునుగుతుందన్నారు. కమ్యూనిజం నిన్నటిది.. నేడు లేదు.. రేపు రాదు అని జోస్యం చెప్పారు.
రాష్ట్రాన్ని విభజించడమంటే హద్దులు గీయడం కాదని, అన్ని ప్రాంతాల ప్రయోజనాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా ప్రజలను విభజించి వారిమధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతోందన్నారు. దేశం పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ తోనే చర్చలు జరుపుతున్నామన్నారు. తెలుగువాళ్లమైన మన మధ్య చర్చలు జరుపుకుని సమస్యలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. విభజన ద్వారా సీమాంధ్రుల ప్రయోజనాలకు నష్టం కలిగితే ఊరుకునేది లేదని, దీనిపై కేంద్రాన్ని ముందుకు వెళ్లనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రాంతానికి బిజినెస్ స్కూల్, సీమకు ఉద్యానవన యూనివర్శిటీ, కడపకు స్టీల్ కర్మాగారం, సీమలోని ఎస్‌కె, ఎస్వీ యూనివర్శిటీలలో ఒక దానికి సెంట్రల్ యూనివర్శిటీ హోదా కల్పిస్తామన్నారు. ఇక సీమాంధ్రకు ఎయిమ్స్, గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమ రీజియన్ డెవలప్‌మెంట్ స్పెషల్ ప్యాకేజీ, ట్యాక్స్ హాలిడే లాంటి వాటితోపాటు వెలుగోడు, తెలుగుగంగ, హెచ్‌యన్‌యస్‌యస్, గాలేరునగరి తదితర ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కేంద్రం చూడాలన్నారు. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలన్నారు. రాయలసీమలో ఐటి తోపాటు ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాదు నుండి ఎవరినీ బయటకు వెళ్లమనే హక్కు ఎవరికీ లేదన్నారు.
టీ అమ్మే వ్యక్తి దేశానికి ప్రధాని కాకూడదా
దేశంలో కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా అధికారానికి దూరం చేద్దామని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలో నమో చాయ్ స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అందరికీ టీ పంపిణీ చేసి విలేఖరులతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు చెందిన, దేశానికి ప్రధాని కావాల్సిన అర్హతలు ఉన్న వ్యక్తిపై కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిందన్నారు. దీనిని దేశ ప్రజలందరికీ తెలియచెప్పడానికే తాము మోడీ ఫర్ పిఎం సభలను నిర్వహిస్తున్నామన్నారు. దేశాన్ని అమ్మే వ్యక్తి పిఎం కావచ్చు కానీ టీ అమ్మే వ్యక్తి దేశానికి ప్రధాని కాకూడదా అని ప్రశ్నించారు.
వెంకయ్యను కలసిన అనంత టిడిపి నేతలు
సీమాంధ్రుల ప్రయోజనాలకు భంగం కలిగించే రాష్ట్ర విభజన బిల్లుపై బిజెపి పునరాలోచన చేయాలని బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు టిడిపి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయనను కలిసిన వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రుల ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ఎలాంటి ఆలోచనలూ లేకుండా అత్యంత దుర్మార్గంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సీమాంధ్ర ప్రయోజనాలతోపాటు ముఖ్యంగా అనంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ దుర్మార్గమైన నిర్ణయానికి మద్దతు ఇవ్వడంపై బిజెపి పునరాలోచించుకోవాలన్నారు. దీనిపై వెంకయ్య సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు చెప్పారు.
అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలం.. మూడో ఫ్రంట్ ఎండమావి సీమాంధ్రకు ఇబ్బంది కలిగితే ఊరుకోం : వెంకయ్యనాయుడు
english title:
d
Date:
Monday, February 3, 2014