విజయనగరం, ఫిబ్రవరి 3: మరో రెండు నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగబోతుండడంతో ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల హడావుడి ఊపందుకుంది. పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో నువ్వా? నేనా అన్న చందంగా పోటీపడిన పార్టీలు సాధారణ ఎన్నికల్లో కూడా తమదే పైచేయి కావాలని పోటీపడుతున్నాయి. సాధారణ ఎన్నికలు కావడంతో ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు టిడిపికి కలిసి వస్తాయని భావిస్తూ, ఈ దఫా తమదే అధికారం అన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తొంది. అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాధించిన అభివృద్ధి కన్నా చివరి రెండు నెలల్లో శంకుస్థాపనల జోరుతో ప్రజల్లో ముద్ర వేసుకునేందుకు కాంగ్రెస్ పోటీపడుతోంది. ఇప్పటికే వీటిలో మూడోవంతు పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. అందువల్లనే ఎన్నికల షెడ్యూలు ఖరారు కాకముందే కాంగ్రెస్ పార్టీ పట్టణాల్లో అభివృద్ధి పనులతో జోరందుకుంది. పట్టణంలో ఇప్పటికే 30 రోజుల శంకుస్థాపనలు, వంద శంకుస్థాపనల పేరుతో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీలు గుప్పిస్తుంది. ఆ పార్టీ నేతలు ఇళ్ళపట్టాలు, పక్కా గృహాల నిర్మాణంపై దృష్టిసారించాయి. అంతేగాకుండా ప్రజల ముందుకు వచ్చి అడిగిన సమస్యలను పరిష్కరించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వర్గవిభేదాలను విడనాడి కలసికట్టుగా పనిచేయాలని టిడిపి అధిష్ఠానం సూచించడంతో చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఆయుధాలుగా వాడనున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను తగ్గింపులో వైఫల్యాన్ని, తాగునీటి సమస్యను ప్రధాన అస్త్రంగా ఉపయోగించాలని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టేందుకు వివిధ సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ విధంగా ఎక్కడ సమస్య ఉందంటే ముందు అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఈ విధంగా రాబోయే ఎన్నికల్లో ముందస్తు ప్రచారానికి ఉభయపార్టీలు సిద్దమయ్యాయి.
ఎన్నికలొస్తున్నాయ్.. జనంలోకి వెళ్లండి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 3: ‘ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. జనంలోకి వెళ్లండి... ఇళ్లల్లో కూర్చొవద్దు... టిడిపి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించండి...కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పండి’ అంటూ... టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం అశోక్‌బంగ్లాలో నిర్వహించిన టిడిపి విజయనగరం నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారని మీరు కూడా గ్రామాల్లోకి వెళ్లి పార్టీ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు గురించి విమర్శించారు. పట్టణంలో సమైక్యవాదులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. దేశ సరిహద్దులో కూడా ఇక్కడ వాడినన్ని టియర్‌గ్యాస్‌లు వాడిన సందర్భాలు లేవన్నారు. పట్టణంలో కర్ఫ్యూ సమయంలో 200 టియర్‌గ్యాస్‌లు వాడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. తెలుగుజాతిని ముక్కలు చేస్తే తెలుగుజాతి క్షమించదన్నారు. ఓట్లు అంతకన్నా రావని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో సమైక్యాంధ్ర అంటూ మరో పార్టీ పుట్టబోతుందని జోస్యం చెప్పారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు డి.జగదీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామాల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న, సమైక్యంగా ఉంచాలన్న అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన జగన్ నాటకాన్ని ప్రజలు గమనించారన్నారు. రాజన్న రాజ్యం అంటే అవినీతి రాజ్యమని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ నేత అశోక్‌గజపతిరాజు నేతృత్వంలో అందరు కలసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి రెట్టింపు చేశారని, ఆ తరువాత ఇపుడు ఒక్క యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయడం లేదని విమర్శించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పడకేసిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు త్రినాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పి.కనకమహాలక్ష్మి, మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకరరావు, కనకల మురళీమోహన్, ఎస్‌ఎన్‌ఎం రాజు, బలివాడ అప్పారావు, విజ్జపు ప్రసాద్, పైడిరాజు, మన్యాల కృష్ణ, బి.శ్రీనివాసరావు, కె.వి.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
మీ-సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం
గజపతినగరం, ఫిబ్రవరి 3 : నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం జాతీయ రహదారి వద్ద గల ఒక ప్రైవేటు భవనంలోని మీసేవా కేంద్రంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. కేంద్రం మూసివేసిన తరువాత కేంద్రంలో నుండి భవనంలోకి పొగలు వ్యాపించడంతో పక్కనే గల వారు అగ్ని ప్రమాద సమాచారాన్ని కేంద్రం యజమాని వై.సూర్యారావుకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు ల్యాప్ టాప్‌లు, రెండు ప్రింటర్లు, ఐ రిష్ వెబ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ రికార్డర్ తదితర పరికరాలు కాలిపోయాయి. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అగ్ని మాపక యంత్రం చేరుకునే సరికే పరిసరాల్లోని వారు మంటలు ఆర్పివేశారు.
.....
english title:
r
Date:
Tuesday, February 4, 2014