
హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ బిల్లు ఎట్టకేలకు రాష్ట్రం దాటి వెళ్లిపోయింది. సోమవారం రెండు విడతలుగా బిల్లు, దానిపై సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, అభిప్రాయాలు, సవరణలు, అపిడవిట్లు, సిడీలను ఢిల్లీకి పంపించారు. సోమవారం తెల్లవారుఝామున మూడు గంటలకు పది బాక్సుల్లో 35 బండిళ్లను ప్రత్యేక వాహనాల్లో, గట్టి బందోబస్తు మధ్య రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. ఈ బిల్లు, ప్రతులతోపాటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రామకృష్ణారావు, మరో ఆరుగురు అధికారులు వెంటవెళ్లారు. తొలుత 6.40 గంటల విమానంలో పదిహేను బండిళ్లు, నలుగురు అధికారులు ఢిల్లీకి చేరుకోగా, తరువాత 9.45 గంటలకు బయలుదేరిన మరో విమానంలో ఇతర బండిళ్లు, ముగ్గురు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. అప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి సచివాలయంలోనే దగ్గరుండి పర్యవేక్షించారు.
ఇలా ఉండగా, రాష్ట్రం నుంచి తెలంగాణ బిల్లు, ఇతర వివరాలు ఢిల్లీకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తన సన్నిహితులతో సమీక్షించారు. బిల్లును అడ్డుకునేందుకు ఢిల్లీలో ప్రయత్నించాలని, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే పరిస్థితులు తలెత్తితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వపరంగా పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు ఆయన సన్నిహిత మంత్రి ఒకరు వెల్లడించారు. అయితే దీనిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఎటువంటి పిటిషన్‌ను దాఖలు చేయవద్దంటూ ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి లేఖ రాయడం విశేషం. రాష్ట్ర విభజనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి పిటిషన్ దాఖలుచేయడం తగదని కూడా ఆయన తన లేఖలో పేర్కొంటున్నారు. (చిత్రం) సోమవారం ఢిల్లీకి చేరిన టి.బిల్లు ప్రతులు