హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్ర విభజన బిల్లు ఎక్కడుంటే అక్కడే లొల్లి జరుగుతోంది. 45 రోజుల పాటు హైదరాబాద్‌లో కేంద్రీకృతం అయి ఉన్న ఆందోళన ఇప్పుడు ఢిల్లీకి మారింది. రాష్టప్రతి 2013 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లుపై 45 రోజుల పాటు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శాసనససభ, శాసనమండలి సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలా లేదా అన్న అంశంపై తలెత్తిన వివాదం సోమవారం ఈ బిల్లుపై నివేదికలను హైదరాబాద్ నుండి ఢిల్లీకి పంపించే వరకు హైదరాబాద్‌లోనూ, జిల్లాల్లోనూ కొనసాగింది. ఈ బిల్లును శాసనసభలో, శాసన మండలిలో డిసెంబర్ 16న ప్రతిపాదించిన తర్వాత తలెత్తిన వివాదం అనేక రూపాల్లో కొనసాగింది. చట్టసభల్లో ప్రతిరోజూ ఘర్షణలు జరిగాయి. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీమాంధ్ర, తెలంగాణ గ్రూపులుగా విడిపోయి పరస్పర విమర్శలకు పాల్పడ్డారు. మొత్తం మీద అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ బిల్లుపై ఏదో రకంగా చర్చ పూర్తయింది. కొంతమంది బిల్లును సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను నివేదికల రూపంలో సోమవారం ఢిల్లీ పంపించిన తర్వాత హైదరాబాద్‌లో నెలకొని ఉన్న టెన్షన్ ఢిల్లీకి బదిలీ అయింది. ఇప్పటికే రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరారు. ముఖ్యమంత్రి మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌రావు, వట్టి వసంతకుమార్ కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. మరికొంత మంది సీమాంధ్ర మంత్రులు కూడా ఢిల్లీ వెళుతున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్ నుండి రాష్టప్రతి భవన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ఈ యాత్రలో ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనాలని నిర్ణయించుకోవడం వల్ల సీమాంధ్ర ప్రతినిధులు ఢిల్లీ వెళుతున్నారు. మంగళవారం ఢిల్లీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జిఓఎం) సమావేశం జరుగుతుండటంతో వత్తిడి తీసుకురావాలన్నదే సీమాంధ్ర నేతల ఉద్దేశమని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన మంత్రులు డి. శ్రీధర్‌బాబు, డాక్టర్ జె. గీతారెడ్డి, డి.కె. అరుణ, సునీతా లక్ష్మారెడ్డి కూడా ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో సహా మరికొంత మంది తెలంగాణ మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలిసింది. రాష్ట్రం నుండి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీ చేరడంతో అక్కడి ఆంధ్రాభవన్‌లో వసతి లేకపోవడం వల్ల చాలామంది ప్రజాప్రతినిధులు ‘సామ్రాట్’ హోటల్‌లో మకాం పెట్టినట్టు తెలిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎలాగైనా నిర్వీర్యం చేయాలని సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా ఈ బిల్లు అమల్లోకి వచ్చేలా చూడాలని తెలంగాణా ప్రజాప్రతినిధులు ఎవరి మార్గంలో వారు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఢిల్లీ బాట
english title:
lolli
Date:
Tuesday, February 4, 2014