హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రజాసమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఫేస్ టు ఫేస్ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించనున్నట్లు గ్రేటర్ అధికారులు తెలిపారు. గ్రేటర్ మేయర్ మహ్మద్ మాజీద్ హుస్సేన్ అధ్యక్షతన గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం నాలుగు నుంచి అయిదు గంటల మధ్య జరగనున్న ఈ కార్యక్రమంలో నగర వాసులు ఫోన్‌లో తమ సమస్యలను తెలియజేసుకోవచ్చునని కూడా తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, వాటర్ బోర్డు, ఆర్టీసి, విద్యుత్, ట్రాఫిక్ ఇతరాత్ర విభాగాల అధికారులు పాల్గొననున్న ఈ కార్యక్రమంలో సమస్యలను విన్నవించుకోవాలనుకునే వారు ఫోన్లు 23221978, 23222018,23261330లను సాయంత్రం నాలుగు నుంచి అయిదు గంటల మధ్య సంప్రదించవచ్చునని కూడా తెలిపారు.
అక్రమంగా చిన్నారుల తరలింపు
-- బీహార్ వాలా అరెస్ట్ --
హైదరాబాద్, ఏప్రిల్ 6: బీహార్ నుంచి చిన్నారులను అక్రమంగా తరలిస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ కాంతారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీహార్‌లోని సర్వర్ జిల్లాకు చెందిన మున్నా(23) దర్జీ వృత్తి చేసుకునేవాడు. ఈజీ మనీ కోసం కొంతకాలంగా అక్కడ నుంచి పేద కుటుంబాలకు చెందిన చిన్నారులను ఇక్కడకు తరలిస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తరలించిన ఇద్దరు బాలలు వారు పనిచేస్తున్న దగ్గరినుంచి పారిపోయి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది సాయంతో రైల్వే పోలీసులకు జరిగింది వివరించారు. దీంతో పోలీసులు మున్నాను అరెస్టు చేసి రిమాండుకు తరలించి బాలలకు వెట్టి నుంచి విముక్తి కలిగించారు. రైల్వే అడిషనల్ డిజి వి.ఎస్.కౌముది ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఎక్కడపడితే అక్కడ నోపార్కింగ్ బోర్డులు * వాహనాలు తీయాలంటేనే బేజార్
ఇరుకు రోడ్లపై ప్రయాణం నరకమే...!
హైదరాబాద్, ఏప్రిల్ 6: కాంక్రీట్ ఎడారిగా మారిపోతున్న గ్రేటర్ నగరంలో తమ వాహనాలతో రోడ్లపైకి వెళ్ళాలంటే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. విద్యుత్‌శాఖ పనులు, జలమండలి, బల్దియా పనులు... ఇలా వివిధ రకాలుగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ఇటీవల తవ్వకాలు ఎక్కువయ్యాయి. సౌకర్యాల కల్పన విషయంలో తవ్వుతున్నారు బాగానే ఉంది కానీ, ఆ తరువాత రోడ్లను అలాగే వదిలేయడం వల్ల కంకరతేలి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా నోపార్కింగు బోర్డులు పెడుతూ అక్కడ వాహనాలు నిలిపినవారి నుంచి పోలీసులు చలానాలు వసూలు చేస్తుండడం వివాదాలకు దారితీస్తోంది. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్, ప్యారడైజ్ సర్కిల్, బేగంపేట వైపు వెళ్ళే మినిస్టర్స్‌రోడ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి తదితర ప్రధాన కూడళ్ళలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. బేగంపేట రహదారిలో పోలీసులు సబ్‌వేను ఏర్పాటు చేసి ఉదయం వేళల్లో వాహనదారులను ప్రత్యామ్నాయమార్గంలో పంజాగుట్టవైపు తరలిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు దూరాభారం పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ ఆర్పీరోడ్, రాణిగంజ్ ప్రాంతాల్లో రోడ్లు చిన్నవిగా ఉండడం, నోపార్కింగు బోర్డులు కనిపించడం వల్ల షాపింగ్ చేసేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం చూపి ఆ తరువాత నోపార్కింగ్ బోర్డులు పెడితే వాహనదారులకు కూడా అనువుగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.