హైదరాబాద్, ఏప్రిల్ 6: రామ్‌లక్ష్మణ్ జానకీ, జై బోలో హనుమాన్‌కీ, బజరంగ్‌భళికి జై, భారత్‌మాతాకి జై అంటూ శుక్రవారం నగరమంతా మారుమోగిపోయంది. ప్రజలు హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా హనుమజ్జయంతిని జరుపుకోవడం విశేషం.
కాగా, శ్రీ హనుమజ్జయంతి వేడుకలను ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం ప్రజలు ఘనంగా జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. హనుమజ్జయంతిని పురస్కరించుకుని విహెచ్‌పి నగరంలో నిర్వహించిన విజయయాత్రను ఆయన గౌలీగూడలో ప్రారంభించారు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ తాడ్‌బన్ శ్రీ హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ కొనసాగినానంతరం ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోని మెజార్టీ ప్రజలైన హిందూవులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. హిందూవులకు చెందిన ఓబిసిలో ఉన్న రిజర్వేషన్లను ముస్లింలు, క్రైస్తవులకు నాలుగు శాతం ఇస్తామంటూ రాజకీయ నేతలు మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో నియమించిన రంగనాథ్ మిశ్రా కమిటీ మూడేళ్ల పాటు అధ్యయనం చేసి 2007లో ఇచ్చిన నివేదిక మొత్తం తప్పులతడక అని అన్నారు. రిజర్వేషన్ల పేరిట భారతదేశంలోని రాజకీయనేతలు ముస్లిం, క్రైస్తవులను హిందూవుల నుంచి వేరు చేస్తున్నారన్నారు.
దీనికి హిందూవులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో 90 కోట్ల మంది ఉన్న హిందూవులు, 14 కోట్ల మంది ముస్లిం మైనార్టీలున్నారని, ముస్లిం మైనార్టీల ఓట్లపైనే తాము ఆధారపడి ఉన్నామంటూ రాజకీయ నాయకులు వారిని మభ్య పెడుతున్నారని ప్రవీణ్ తొగాడియా మండిపడ్డారు. దేశంలో ముస్లింలకు హజ్ యాత్ర వెళ్లేందుకు సిబ్సిడీలు ఇస్తున్నారని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పాకిస్తాన్‌లో ఉన్న హిందూవులు కాశీ యాత్రకు వెళ్తామంటే అక్కడి ప్రభుత్వం వారికి సబ్సిడీ ఇస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. బ్రిటన్ యూరప్ దేశాల్లో ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకునే చట్టం ఉందని, భారత దేశంలోని హిందూవులకు ఒకర్ని మాత్రమే పెళ్లి చేసుకునే చట్టం ఉందని, కానీ ముస్లింలు పది మందిని కూడా వివాహమాడి, వంద మంది సంతానాన్ని పొందినా, వారందరి జీవనం మెజార్టీ ప్రజలు చెల్లించే పన్నులతోనే కొనసాగుతుందన్నారు.
అయినా వారు ఏ రకమైన పన్నులు చెల్లించటం లేదని, మైనార్టీల పేరిట వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్నాయన్నారు. దేశంలో నిజమైన హిందూ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. సంగారెడ్డిలో శ్రీ రామ నవమి నాడు జరిగిన సంఘటనలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, హోం మంత్రి, ముఖ్యమంత్రి కూడా పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఓవైసీ కనుసైగల్లో రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందని, సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో కిరణ్‌కుమార్ ప్రభుత్వం లేదన్నారు. హనుమజ్జయంతి నాడు హిందూవులంతా ధర్మ పరిరక్షణ సంకల్పంతో అంతా ముందుకు రావాలని, ఆ ధర్మమే అందర్నీ కాపాడుతుందని ఆయన సూచించారు. పాతబస్తీలో ముస్లింలు వెనకబడి ఉన్నారన్న ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తిగా నిరాధారమైందని తొగాడియా అన్నారు. కార్యక్రమంలో విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షులు రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు.
తాడ్‌బంద్‌లో పోటెత్తిన భక్తులు
కంటోనె్మంట్: హనుమాన్ జయంతి వేడుకలు కంటోనె్మంట్‌లో ఘనంగా, ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే రావటం, ముస్లింల ప్రార్థనలు, వీరహనుమాన్ జయంతి వేడుకలు ఆన్నీ ఒకే రోజు కల్సి రావటంతోప్రజలు ప్రశాంతంగా, ఘనంగా జరుపుకున్నారు. కంటోనె్మంట్‌లో ఉన్న తాడ్‌బంద్ ఆంజనేయ స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీ లాల్ దర్వాజలో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర పురవీధుల గుండా తాడ్‌బంద్‌కు చేరుకుంది. ప్రతిష్ఠాత్మకమైన దేవాలయం కావటంతో నగరప్రజలతో పాటు శివారు ప్రాంత ప్రజలు ఉదయం నుండి బారులుతీరి వీరహనుమాన్‌ని దర్శించుకున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా దేవాలయం నిర్వహకులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. నార్త్ జోన్ డిసిపి శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఊరేగింపు కంటోనె్మంట్ ప్రాంతానికి చేరగానే బాలంరాయిలోహనుమాన్, శ్రీరామచంద్రుని కటౌట్లు ఏర్పాటు చేశారు.
భక్తులకోసం రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నీటి ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. బాలంరాయి చెక్ పోస్టు నుండి ఇంపీరియల్ గార్డెన్ మీదుగా సిఖ్‌విలేజ్ ద్వారా తాడ్‌బంద్ హనుమాన్ దేవాలయానికి శోభా యాత్ర చేరుకుంది. శోభాయాత్రలో సుమారు 5వేల మంది భక్తులు మోటారుసైకిళ్ళపైన ర్యాలీగా వచ్చారు. పాతబస్తీ నుండి శోభాయాత్రకు అడుగడుగునా భారీ భందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులు సాయంత్రం వరకు పోటెత్తారు. ఉదయం నుండి దేవాలయానికి వెళ్లే భక్తులను దారి మళ్ళించారు. సిఖ్‌విలేజ్ నుండి తాడ్‌బంద్ దేవాలయానికి వెళ్లే భక్తులను, వాహనాలను దారి మళ్లించారు. ప్యారడైజ్ నుండి బోయిన్‌పల్లి మార్గం ద్వార దేవాలయానికి వెళ్లే భక్తుల వాహనాలను తాడ్‌బంద్ చౌరస్తా వద్ద నియంత్రించారు. దీనితో ఇరువైపుల నుండి భక్తులు కాలినడకన దర్శనానికి వెళ్ళారు. ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రసాదాల కోసం ప్రత్యే లైన్‌లు ఏర్పాటు చేశారు. బయట షామియానాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎండ తగలకుండా చూశారు. భారీ పోలీసు బందోబస్తు
హనుమాన్ జయంతిని పురస్కరించుకోని పోలీసులు నార్త్‌జోన్ డిసిపి శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో అదనపు డిసిపి నరోత్తమ్ రెడ్డి, ఏసిపిలు, సిఐలు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు