ఏలూరు, ఫిబ్రవరి 5: ఒక్కసారిగా అన్నీ ముప్పిరిగొన్నట్లు పరిస్ధితులు మారిపోయాయి. ఒకపక్క సమైకాంధ్ర ఉద్యమం. మరోవైపు ఎన్నికల సన్నాహం. వీటిమధ్య ఎన్‌జిఓల సమ్మె సైరన్. ఇవన్నీ కలగలిసి పరిణామాలను దాదాపుగా గందరగోళం చేసేశాయి. సమైక్యాంధ్ర అంశం ఇప్పుడు హస్తినకు పాకింది. రాష్ట్ర అసెంబ్లీ టి బిల్లును తిరస్కరించి కేంద్రానికి పంపటం, అక్కడ చకచక పరిణామాలు చోటుచేసుకోవటం తెల్సిందే. అవన్నీ అలాఉంచితే సమైక్యాంధ్ర కోసం ఎపిఎన్‌జిఓలు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎన్‌జిఓలంతా సమ్మెలోకి దిగిపోయారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి మరొ కీలకమైన మలుపు చోటుచేసుకున్నట్లే భావించాలి. అయితే ఇక్కడే అన్నీ సందిగ్ధ అంశాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అధికారిక అంశాల ప్రకారం ఎన్నికల సన్నాహం మొదలుకావాల్సి ఉంది. దానిలో ప్రధానంగా దీర్ఘకాలం పాటు ఒకే స్ధానంలో పనిచేస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగమైన అధికారులను బదిలీ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కసరత్తు ముగిసింది. జిల్లాకు సంబంధించి అటు తహసీల్దార్లను, ఇటు కొత్తగా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసిన ఎంపిడిఓలను భారీస్ధాయిలోనే బదిలీ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఈనెల 10వ తేదీ వరకు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్రకారం చూస్తే మరో నాలుగైదు రోజుల్లో ఈ బదిలీల ప్రక్రియ ముగిసిపోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్దితి చూస్తే అలాంటి అవకాశాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఎన్‌జిఓల సమ్మె నేపధ్యంలో తహసిల్దార్ స్ధాయి అధికారులు కూడా దీనిలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఈ సమ్మె పార్లమెంటులో బిల్లు వ్యవహారం తేలేవరకు సాగుతుందని ఇంతకుముందే ఎన్‌జిఓ నాయకులు ప్రకటించారు. ఆవిధంగా చూస్తే బదిలీలపై ఉన్న నిషేధం సడలించిన గడువులోపు వీరి సమ్మె పూర్తయ్యే అవకాశం లేదు. ఈ పరిస్ధితి ఇలాఉంటే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం బదిలీలు మాత్రం జరగాల్సిందే. అయితే ఒకప్రక్క తహసిల్దారు స్ధాయి అధికారులు కూడా సమ్మెలో కొనసాగుతున్న నేపధ్యంలో వారిని బదిలీ చేయటం ఏవిధంగా సాధ్యమవుతుందన్నది తేలాల్సి ఉంది. అదికూడా నాలుగైదు రోజుల్లోనే పూర్తికావాలి. దీనికితోడు తాజాగా ప్రభుత్వం మరో కొత్త ఆదేశాన్ని విడుదల చేసింది. ఇంతకుముందు ఎన్నికల సమయంలో తహసిల్దార్లను బదిలీ చేసేందుకు సంబంధించి జాబితాను సిసిఎల్‌ఎ అయా జిల్లాలకు పంపేవారు. దాని ఆధారంగా ఎవరు ఏ జిల్లాకు వెళ్లాలన్నది తేలేది. కానీ ఇప్పుడు ఏ జిల్లాకు ఏ తహసిల్దార్‌ను కేటాయించాలన్న అధికారాన్ని జిల్లా కలెక్టరుకు దఖలుపరుస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చినట్లు కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఇంక జిల్లాలోని తహసిల్దార్లను ఏ జిల్లాకు కేటాయించాలన్నది కలెక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ఊహంచని రీతిలో జారీ అయిన ఈ ఉత్తర్వుల పట్ల కలెక్టరేట్ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఈవిధంగా కలెక్టర్లు తహసిల్దార్లను జిల్లాలకు కేటాయించే సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయని, పక్క జిల్లాల్లో ఖాళీలు తెలుసుకోకుండా కేటాయింపులు జరిగితే ఆవిధంగా వెళ్లిన అధికారులు గాలిలో ఉండాల్సి వస్తుంది. అంటే ముందుగానే ఈ అధికారులను ఏ జిల్లాలకు కేటాయించాలో నిర్ణయించుకుని ఆతర్వాత అక్కడి పరిస్ధితులను తెలుసుకుని, అక్కడి జిల్లా అధికారులతో సమన్వయం కుదుర్చుకుని ఆతర్వాతే బదిలీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుకున్న ప్రకారం అక్కడ ఖాళీలు లేకపోతే మళ్లీ జాబితాలను మార్చుకోవటం, మిగిలిన జిల్లాలతో మాట్లాడుకోవటం ఇలాంటి ప్రక్రియ మాత్రం సాగాల్సి ఉంది. ఈ వ్యవహారం అంతా ఈ నాలుగైదు రోజుల్లోనే జరిగిపోవాలంటే ఏవిధంగా ఆచరణ సాధ్యమో తేలాల్సి ఉంది. వీటికి మించి ఈవిధంగా బదిలీకి అర్హులైన అధికారులందరూ సమ్మెలో కొనసాగే నేపధ్యంలో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చి వారికి బదిలీ ఆర్డర్లు ఏవిధంగా ఇస్తారన్నది అర్ధంకాని ప్రశ్న. మొత్తంగా చూస్తే అటు ఎన్నికలు, ఇటు బదిలీలు మధ్యలో సమ్మె ఈ పరిస్ధితితో అంతా గందరగోళంగా కన్పిస్తోంది.
పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టొద్దనే డిమాండుతో సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. అన్ని శాఖల పరిధిలోని ఎన్‌జిఓలు, తహసిల్దార్ స్ధాయి అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారని జిల్లా జెఎసి ఛైర్మన్ ఎల్ విద్యాసాగర్ తెలిపారు. సమ్మెకాలంలో తహసిల్దార్లకు బదిలీ ఉత్తర్వులు ఇస్తే అందుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈనెల 9వ తేదీన జరిగే టెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతల్లో పాల్గొనేది లేదని ఆయన పేర్కొన్నారు.
-సమ్మె
english title:
y
Date:
Thursday, February 6, 2014