కడప, ఫిబ్రవరి 5:తెలంగాణ బిల్లు హస్తినకు చేరడడంతో సమైక్యవాణి ఢిల్లీ పెద్దలకు తెలియచేయడంలో భాగంగా ఎపిఎన్జీవో సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి జిల్లాలోని ఎన్జీవోలు సమ్మెబాట పడుతున్న నేపథ్యంలో మరోమారు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో వెళ్ళనున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా గత మూడు మాసాల నుంచి కేంద్ర సాయుధ దళాలు శాంతి భద్రతల నిమిత్తం సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, బందోబస్తు కొనసాగుతున్నది. ప్రస్తుతం మరోమారు ఎన్జీవోల సమ్మెకు దిగడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బ్యాంక్‌లు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్ల ప్రాంగణాలతోపాటు అధికార పార్టీకి చెందిన నేతల నివాసాల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మళ్లీ సమ్మె సమ్మె సైరన్ మోగడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా పలు ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి, పెన్షనర్లకు జీత, భత్యాలు అందక పోవడంతో వారు సైతం మరోమారు అవస్థలు పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎన్జీవోలు పార్లమెంట్‌లో సమావేశాలు పూర్తయ్యేవరకు అంచలంచెలుగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర రాజధాని నుండి ఢిల్లీ వరకు ఉద్యమ సెగలు కక్కిస్తామని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. అవసరం అనుకుంటే అత్యవసర సేవలను కూడా స్తంభింపచేయాలని యోచిస్తున్నారు. వైద్య, ఆరోగ్య, మున్సిపల్, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సమ్మెలో పాల్గొని సహాయ నిరాకరణకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం వనరులు సేకరించే కమర్షియల్, ఇన్‌కమ్‌టాక్స్, వ్యవసాయ చెక్‌పోస్టు, మార్కెట్ యార్డు తదితర శాఖల సిబ్బంది కూడ సమ్మెబాట పడుతుండడంతో మరోమారు ప్రభుత్వ ఆదాయానికి గండిపడనున్నది. వారితో పాటు సమైక్యాంధ్ర జెఎసి, ప్రైవేట్ విద్యా సంస్థలు, వైద్యుల జెఎసీ, సమైక్యాంధ్ర జెఎసీ, విద్యార్థి, కార్మిక, కర్షక జెఎసీలు కూడ మద్దతు ప్రకటించాయి. గత నాలుగు మాసాల క్రితం కంటే గురువారం నుంచి నిరవధికంగా చేపట్టే ఎపిఎన్జీవో ఉద్యమం ఉగ్రరూపం దాల్చనున్నది. మొత్తం మీద ఎపీఎన్జీవోల సమ్మెతో రాజకీయ భవిష్యత్ కోసం అర్రులుచాస్తున్న నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం సమాలోచనలో పడ్డారు.
తెలంగాణ బిల్లు హస్తినకు చేరడడంతో సమైక్యవాణి ఢిల్లీ పెద్దలకు తెలియచేయడంలో భాగంగా ఎపిఎన్జీవో సంఘం
english title:
m
Date:
Thursday, February 6, 2014