తిరుపతి, ఫిబ్రవరి 5: రాష్ట్రం ముక్కలు కావడంపై తెలుగువారు జీర్ణించుకోలేరని, ఢిల్లీ పెద్దలను చరిత్ర క్షమించదని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన వౌన దీక్షలకు మద్దతుగా బుధవారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్, డిసిసి అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం రెండు ముక్కలు చేయడాన్ని ప్రతి తెలుగువారు వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశ ఆంతరంగిక భద్రతకు ముప్పు వాటిల్లే విభజన బిల్లును పార్లమెంటులో పెట్టకుండా విరమించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధానం ఆంధ్రప్రదేశ్‌పై ఢిల్లీ పెద్దలు తీసుకోవడం దారుణమన్నారు. దేశంలో 19 విభజన డిమాండ్లు ఉంటే కేవలం ఎపినే ముక్కలు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సిఎం దీక్షలకు దేశంలో అన్ని పార్టీల నుండి మద్దతు వస్తోందన్నారు. సమైక్యవాది నవీన్‌కుమార్‌రెడ్డి సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోతో ఉన్న టి షర్టులను ప్రదర్శిస్తూ దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్‌మాట్లాడుతూ సింహంతో వేట - సిఎం కిరణ్‌తో ఆట వద్దు అంటూ నినాదాలు చేయించారు. కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తున్న సిఎం కిరణ్ నేతృత్వంలో సమైక్య రాష్ట్రం సాధ్యమన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వెంటనే నిలిపివేయాలన్నారు. విభజన వాదులు జగన్‌తో, కెసిఆర్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 60 ఏళ్లు కలిసి ఉన్న తెలుగువారిని విడదీసే హక్కు చిదంబరం, షిండే, దిగ్విజయ్, సోనియాలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ సమైక్య ముసుగులో ఉన్న విభజన వాది అని విమర్శించారు. నాగభూషణం, పులుగోరు మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడుతున్న జగన్ వెంటనే సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తే నిజమైన సమైక్యవాదిగా నమ్ముతామన్నారు. ఢిల్లీలో వౌనదీక్ష చేస్తున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకునే సత్తా ఎవ్వరికి లేదన్నారు. సిఎం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో తెలుగుజాతి యావత్తు ఆయనకు అండగా నిలిచిందన్నారు. ఈ దీక్షలకు ఆర్‌టిసి జెఎసి నేతలు ఆవుల ప్రభాకర్, చల్లా చంద్రయ్య, న్యాయవాదుల సంఘం నేత రమణ మద్దతుపలికారు. సమైక్య నినాదాలతో, సిఎంకు మద్దతు నినాదాలతో అండగా నిలుస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు భువన్‌కుమార్‌రెడ్డి, భాస్కర్, ఎస్‌కుమార్, గుండూర్లు వెంకటరమణ, లతారెడ్డి, గీత, లతాదేవి, కవి, చిన్న, కేశవ, రమణ, రమేష్, గోపాలకృష్ణ, రాజగోపాల్, ప్రసాద్, అక్కినపల్లి లక్ష్మయ్య, ప్రసాద్, సప్తగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
* అది దేశ అంతరంగిక భద్రతకు ముప్పు * సిఎం సమైక్య సింహం అంటూ టీ షర్ట్‌లతో వినూత్న ప్రదర్శన * ఢిల్లీలో సిఎం వౌన దీక్షలకు మద్దతుగా తిరుపతిలో సమైక్య దీక్షలు
english title:
r
Date:
Thursday, February 6, 2014