రాజమండ్రి/కాకినాడ ఫిబ్రవరి 5: సమైక్యాంధ్రను కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపులో భాగంగా గురువారం నుండి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఎన్‌జిఓలు నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. తొలి విడత 66రోజుల పాటు సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు మలివిడత సమైక్య ఉద్యమానికి కాలుదువ్వుతున్నారు. అయితే ఈసారి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనటం లేదు. మున్సిపల్ ఉద్యోగులు తొలి రెండు రోజులూ పెన్‌డౌన్ ఆందోళన కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టి, 8న విజయవాడలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. మళ్లీ నిరవధిక సమ్మె చేపటాల్సి వస్తుందన్న అంశంపై మున్సిపల్ ఉద్యోగులు సిద్ధంగా లేకపోవటంతో, మున్సిపల్ ఉద్యోగుల సంఘాలన్నింటితో చర్చించిన తరువాత భవిష్యత్ ఉద్యమకార్యాచరణను రూపొందించాలని మున్సిపల్ ఉద్యోగుల జెఏసి నాయకులు భావిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే తొలి రెండు రోజులూ పెన్‌డౌన్ సమ్మె చేపట్టినప్పటికీ, 8న జరగనున్న సమావేశంలో నిరవధిక సమ్మెకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్‌జిఓలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు నిలిపివేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది జెఏసి నిర్ణయించింది.
జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన సుమారు 10వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని, గత ఉద్యమం మాదిరిగానే ప్రతి రోజు ర్యాలీలు, ధర్నాలతో సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృతంగా సాగిస్తామని జిల్లా ఎన్‌జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, ప్రధాన కార్యదర్శి పితాని త్రినాథరావు చెప్పారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని, సమైక్య ఉద్యమం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనటం ద్వారా సమైక్యాంధ్రను కాపాడుకోవాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు కిషోర్ పిలుపునిచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులంతా ఎన్‌జిఓల సమ్మెకు సంఘీభావం తెలుపుతారని, సమైక్య ఉద్యమంలో తాము కూడా చేయి కలపాల్సిన పరిస్థితి ఉత్పన్నమయినపుడు, ప్రత్యక్ష పోరాటానికి దిగాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు.
జిల్లాలోని అన్ని సబ్‌కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన శిబిరాలను ఏర్పాటుచేసి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్‌జిఓ సంఘం జిల్లా కార్యదర్శి త్రినాథరావు చెప్పారు.
ఎన్‌జిఓల నిరవధిక సమ్మె, పార్లమెంటులో టి బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో చెలరేగనున్న సమైక్య ఆందోళనల్లో భాగంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజమండ్రి, కాకినాడతో పాటు అన్ని పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కొనసాగుతున్న పికెట్లను మరింత అప్రమత్తం చేసారు.
కాగా కాకినాడలోని జిల్లా ఎన్‌జిఓ కార్యాలయంలో సమైక్య సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆశీర్వాదం, త్రినాధరావుతో పాటు జిల్లా కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఎస్‌వి సుబ్బారావులు మాట్లాడుతూ సమైక్యాంధ్రను కోరుతూ చేస్తున్న ఈ సమ్మెలో156 ఉద్యోగ సంఘాలు పాల్గొని తమ పూర్తి మద్దతును ప్రకటిస్తారన్నారు. మరో రెండు రోజుల తరువాత డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సమ్మెలో అత్యవసర సర్వీసులు కూడా నిలుపుదల చేస్తామని ఎన్నికల విధులకు కూడా అధికారులు దూరంగా ఉంటారన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి ఆర్టీసీ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని చెప్పారు. ఈ వారంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి చర్చ వచ్చే అవకాశముందని చర్చ జరిగే రోజుల్లో విద్యుత్ కోత విధించి తమ నిరసనను తెలుపుతామని చెప్పారు. ఈ సమ్మెకు ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, దుకాణదారులు పూర్తి సహకారాలు అందించాలని కోరారు.
10న అమలాపురంలో
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ
-అశోక్ బాబు రాక
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఫిబ్రవరి 5: ఈనెల 10న అమలాపురం హైస్కూల్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కోనసీమ జెఎసి సమావేశం పిలుపునిచ్చింది. బుధవారం స్థానిక కాటన్ గెస్ట్‌హౌస్‌లో కోనసీమ జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సమైక్యాంధ్ర ఉద్యమ రాష్ట్ర నాయకులు అశోక్‌బాబు, చలసాని శ్రీనివాస్, పి కుమార్ యాదవ్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పి సత్యనారాయణ, పి చంద్రశేఖరరెడ్డి, అడారి కిషోర్‌కుమార్ తదితరులు హాజరవుతారని తహసీల్దార్ నక్కా చిట్టిబాబు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అనూహ్య పరిణామాలకు ఈ సభ వేదిక కానుందని కన్వీనర్ బండారు రామ్మోహనరావు తెలిపారు. జిల్లా ఉద్యోగ జెఎసి నాయకులు బూరిగ ఆశీర్వాదం, పితాని త్రినాధరావుల నాయకత్వంలో ఈ సభ జరుగుతుందని వారు తెలిపారు. ఈ సభకు విశేషమైన ప్రచారం కల్పిస్తూ ప్రచార సాధనాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, సభ ఏర్పాట్లలో అన్ని రాజకీయ పార్టీలకు భాగస్వామ్యం కల్పిస్తూ జిల్లా నాయకులు మాట్లాడే అవకాశం కల్పించాలని, అశోక్‌బాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యే ఈ సభకు కోనసీమ వ్యాప్తంగా జనసమీకరణ జరిపించి విజయవంతం చేయాలని తీర్మానించారు. కోనసీమ జెఎసి నాయకులు ములపర్తి సత్యనారాయణ, కె సత్తిబాబు, మంత్రిప్రగడ వేణుగోపాల్, ఇళ్ల భక్తవత్సలం, ఎస్‌ఎస్ పళ్లంరాజు, టి రాజేష్, ఆత్కూరి శరభరాజు, ఎఎస్‌డి ప్రసాదరావు, నాతి శ్రీనివాసరావు, కె బాబు, అడబాల రాజా, రేవు ఈశ్వరరావు, దంగేటి సుగుణ, దైవకృప, రాజేశ్వరి, మధుర నరసింహమూర్తి, కుడుపూడి త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.