కెపిహెచ్‌బి కాలనీ, ఫిబ్రవరి 6: హైదర్‌నగర్ డివిజన్ హెచ్‌ఎంటి హిల్స్ విద్యుత్ శాఖ కార్యాలయంలో చొరబడి బోర్డులను తొలగించిన విషయంలో రెండు నెలల క్రితం విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులే కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ విద్యుత్ అధికారులను బెదిరిస్తున్న సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గత డిసెంబర్ 23న హెచ్‌ఎంటిహిల్స్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం బోర్డులను తొలగించిన డివిఎస్.రంగవర్మ, శ్రీనివాసులపై కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. ఈ విషయం ఇలా ఉండగానే గత నెల 29వ తేదీన బోర్డులు తొలగించిన వ్యక్తుల కేసు పంచనామా ముగియడంతో విద్యుత్ అధికారులు తిరిగి తమ బోర్డులను ఏర్పాటు చేస్తుండగా మళ్లీ డివిఎస్‌ఆర్.వర్మ, ఆయన అనుచరులు శ్రీనివాసులు కార్యాలయంలో చొరబడి విద్యుత్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో కెపిహెచ్‌బి ఎస్సై శ్రీశైలంనాయక్ విద్యుత్ అధికారి ఏఇ రాజుకు ఫోన్ చేసి స్టేషన్‌కు వచ్చి సిఐ గంగారాంను కలవాలని ఆదేశించారు. దీంతోవిద్యుత్ శాఖ ఏడి లక్ష్మినారాయణ, ఏఇ రాజు స్టేషన్‌కు వెళ్లగా అప్పటికే ఉన్న డివిఎస్‌ఆర్.వర్మ, శ్రీనివాసులు సమక్షంలోనే సిఐ గంగారాం విద్యుత్ కార్యాలయంలో ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయవద్దంటూ హుకుం జారీ చేశారు. ఈ విషయంపై గత 10 రోజులుగా తర్జన, భర్జన పడుతున్న విద్యుత్ అధికారులు ఉన్నతాధికారుల ఒత్తిడితో గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్, డిసిపితో పాటు కూకట్‌పల్లి ఎసిపిలకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై న్యాయం చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
డివిజన్ హెచ్‌ఎంటి హిల్స్ విద్యుత్ శాఖ కార్యాలయంలో
english title:
kanche
Date:
Friday, February 7, 2014