న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ముస్లింలపై నిజమైన ప్రేమ ఉంటే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు తెంచుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ సలహా ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో ముస్లింలను ప్రోత్సహించేందుకు గుజరాత్‌లో మూడు రోజుల సదస్సును మోడీ ప్రారంభించడంపై స్పందిస్తూ ఆయన శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఆకట్టుకునేందుకు మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని సిబల్ కొట్టిపారేశారు. ఎన్నికల వేళ బిజెపి వ్యూహం వెనుక ఎన్ని కుట్రలున్నాయో త్వరలోనే అందరికీ అవగతమవుతుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ ఉద్ధరించాలంటే ముందుగా బిజెపి తన విధానాలను మార్చుకోవాలని, ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని మోడీ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, సంజౌతా ఎక్స్‌ప్రెస్ ఘటనతో పాటు పలు పేలుళ్ల కేసులో నిందితుడైన స్వామి అసీమానంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను సిబల్ ప్రస్తావిస్తూ, బిజెపి బహుముఖంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం మేరకే విధ్వంసాలు జరిగాయని స్వామి అసీమానంద్ పేర్కొన్నారని సిబల్ గుర్తు చేశారు.
కేజ్రీ, ప్రశాంత్ భూషణ్‌లకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ కుమారుడు అమిత్ సిబల్ వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ప్రశాంత్ భూషణ్‌తో పాటు మరో ఇద్దరికి సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాగా, పరువునష్టం కేసును రద్దు చేయాలంటూ ‘ఆప్’ నాయకులు దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు గతంలోనే తిరస్కరించింది. అయితే, ఆ కేసు నుంచి తమను తప్పించాలని కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు చేసుకున్న అభ్యర్థనను పరిశీలించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. గత జూలైలో అమిత్ సిబల్ ఢిల్లీలోని ఓ కోర్టులో కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ తదితరులపై పరువునష్టం కేసు వేశారు. తన తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని తాను కొన్ని టెలికం కంపెనీల తరఫున పనిచేస్తున్నానంటూ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ ఆరోపించడంపై అమిత్ సిబల్ కేసు దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తమను మినహాయించాలని కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు జనవరి 16న త్రోసిపుచ్చింది. విచారణ జరుగుతున్న న్యాయస్థానంలోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమిత్ సిబల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పరువునష్టం కేసు విచారణ దశలో ఉండగా నిందితులను మినహాయించాలనడం న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన తన వాదన వినిపించారు. దీంతో స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లకు నోటీసులు జారీ చేసింది.