అహ్మదాబాద్, ఫిబ్రవరి 7: కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర పడిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముస్లిం వాణిజ్య ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాల్గొనడం ద్వారా వారికి చేరువ కావడానికి ప్రయత్నించారు. అన్ని వర్గాలను ఒకటిగా చేయడం ద్వారా, సమాన అవకాశాలు ఉండే అభివృద్ధి విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి చెందడానికి ప్రజలకు భద్రత, సమానత్వం, సుఖశాంతులు అవసరమని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి అయిన మోడీ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు అధికారాన్ని కోరుకుంటాయని, బిజెపి కూడా అలాగే అధికారాన్ని కోరుకుంటోందని, అయితే తేడా ఏమిటంటే తమ పార్టీ ప్రజలకు సాధికారికత కల్పించడం ద్వారా అధికారంలోకి రావాలని కోరుకుంటోందని ఆయన చెప్పారు.
‘ఉమ్మత్ బిజినెస్’ పేరిట మూడు రోజుల పాటు జరిగే ఈ వాణిజ్య ప్రదర్శనను తొలిసారిగా అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ఒడ్డున ఏర్పాటు చేసారు. ముస్లిం వాణిజ్య వేత్తలు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దాదాపు 50 మంది ప్రదర్శకులు తమ ఉత్పత్తులను ప్రదర్శించే స్టాళ్లను ఏర్పాటు చేసారు. ఆటోమొబైల్ రంగం మొదలుకొని ఐటి, రియల్టీ లాంటి వివిధ రంగాలకు చెందినవారు ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని చెప్పిన మోడీ గుజరాతీయుల రక్తంలోనే పారిశ్రామిక సంస్కృతి దాగి ఉందన్నారు. ఏ మతానికి చెందిన వాడన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేటి పోటీ ప్రపంచంలో తమ సత్తాను చాటడానికి పోటీ పడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించగలమని, అందరికీ సమాన అవకాశాలు ఉండే అభివృద్ధి విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని మోడీ చెప్పారు. గుజరాత్ అభివృద్ధికి భద్రత, సమానత్వం, అభివృద్ధి, కార్యకలాపాలు అనేవి నాలుగు ప్రధానమైన అంశాలని ఆయన అంటూ, ప్రభుత్వం, సామాజిక పరమైన అన్ని పథకాలలోను ఈ నాలుగు అంశాలకు కట్టుబడి ఉండడం వల్లనే కులాలు, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా క్షేమంగా, భద్రంగా ఉండేలా చూడగలుగుతున్నామని చెప్పుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముస్లిం మహిళలు కఃడా పాలు పంచుకోవలసిన అవసరం ఉందని మోడీ అన్నారు.
ముస్లిం యువకులలో ఎంతో నైపుణ్యం దాగి ఉందని, వారు రాష్ట్రంలో నైపుణ్యంతో సంబంధం ఉన్న అనేక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ముస్లిం యువకులు గొ2ప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్న రంగాలను గుర్తించి, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకోవడానికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు సాధికారికత కల్పించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. వేలాది మంది పేద ముస్లింలకు ఉపాధి కల్పిస్తున్న గాలి పటాల పరిశ్రమ కొనే్నళ్ల క్రితం కేవలం 30-35 కోట్ల రూపాయలు ఉండగా, ఇప్పుడది 700-800 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. దశాబ్దాలుగా వ్యాపారుల రాష్ట్రంగానే గుర్తింపు కలిగిన రాష్ట్రం ఇప్పుడు ఉత్పత్తులకు కేంద్రంగా మారుతోందన్నారు. గుజరాత్ దేశంలోనే పత్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ముందువరసలో ఉందని ఆయన అంటూ, పొలంనుంచి దారం తయారీ, ఫ్యాషన్ రగం, విదేశాలకు ఎగుమతుల దాకా అన్ని దశలలోను మరింతగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన పాత్ర పోషించే ముస్లిం వ్యాపారవేత్తలు ఈ రంగంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో పోటీ పడవచ్చని ఆయన చెప్పారు. అభివృద్ధి పథంలో మనం ఎంతగా ముందుకెళ్తే అంతగా అందరికీ మంచిదని కూడా ఆయన అన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న కొత్త నినాదాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు.
గుజరాత్‌లో జరిగిన ఓ సదస్సులో రాష్టమ్రుఖ్యమంత్రి నరేంద్ర మోడీ, పర్సోలీ మోటార్స్ సిఇఒ తల్హ సరేష్‌వాలా