మేడ్చల్, ఏప్రిల్ 6: విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని యుఎఎసి, జెఎన్‌టియుహెచ్ సంచాలకులు డా. ఇ.సాయిబాబరెడ్డి అన్నారు. సిఎంఆర్‌సెట్ కళాశాల పదవ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని, వారు క్రమశిక్షణతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించినపుడే జీవితాశయం నెరవేరుతుందనే సత్యాన్ని గ్రహించాలని అన్నారు. వార్షికోత్సవంలో సినీ హీరోలు నిఖిల్, ఆది పాల్గొని విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరచిన విద్యార్థులకు యాజమాన్యం పురస్కారాలను అందజేసింది. కళాశాల ప్రతినిధులు మల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ జంగారెడ్డి, రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హైటెక్స్‌ను వ్యాపార కేంద్రంగా మార్చిన ప్రభుత్వం
గచ్చిబౌలి, ఏప్రిల్ 6: నిత్యం సభలు సమావేశాలు నిర్వహించుకోవాలని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో హైటెక్స్‌ను తమ హయాంలో నిర్మించామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్స్‌ను విందులు, వివాహ కార్యక్రమాలకు వినియోగిస్తూ వ్యాపార కేంద్రంగా మార్చిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేసారు. విల్లర్ట్ ఫొటో ఎక్స్‌పో 2012ను ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రదర్శన హైటెక్స్‌లో జరగనందుకు విచారం వ్యక్తంచేసారు. రాష్ట్రంలో ఈ రంగంపై ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, వీడియో పరిశ్రమను గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుందని చెప్పారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలవారికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.
ఫొటోగ్రఫీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని విదేశాలకు పరికరాలను ఎగుమతి చేసేస్థాయిలో మనం వున్నామని, ఈ రంగంలో జీవనం సాగించేవారికి తమ ప్రోత్సాహం వుంటుందని బాబు చెప్పారు. ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుందని విల్లర్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ వి.వి.రమణ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ప్రదర్శనను నిర్వహిస్తామని, యుఎస్‌ఏ, ఇటలీ కంపెనీలతోసహా 110 సంస్థలు ఎక్స్‌పోలో పాల్గొన్నాయని రమణ తెలిపారు
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 6: హనుమాన్ జయంతి వేడుకలను నగర శివారు ప్రాంతాల్లో శుక్రవారం భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్‌లోని అభయాంజనేయస్వామి వేడుకలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. ఆంజనేయస్వామికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాయూత్ కన్వీనర్ జి సురేష్‌రెడ్డి, కూన మహాలక్ష్మిట్రస్టు చైర్మన్ కూన శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుమూర్తినగర్, ఎన్టీఆర్‌నగర్, సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లోని ఆభయాంజనేయస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దేశం ఇన్‌చార్జి కెపి వివేక్, కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రావుపాల్గొన్నారు. గాజులరామారం రోడ్డులోని అభయాంజనేయస్వామి, గాజులరామారం, సాయిబాబానగర్, సూరారం, దుండిగల్‌లోని ఆభయాంజనేయస్వామి, మల్లంపేట్‌లోని ఆభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో మాజీ ఎంపిపి కొలను హనుమంత్‌రెడ్డి, నిజాంపేట్‌లోని ఆభయాంజనేయస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో వైఎస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ నాయకుడు కొలను శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. బజరంగ్‌దళ్ వారు చేపట్టిన ర్యాలీనీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ జి సురేష్‌రెడ్డి పాల్గొని జెండా ఎగురవేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
హనుమాన్ జయంతి వేడుకలు
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్‌లలో గల హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలతో, శ్రీరామ, జైహనుమాన్, హరేరామ కీర్తనలతో ఆయాప్రాంతాలు మారుమోగాయి. అంతేకాకుండా పలు చోట్ల యువకులు, హనుమాన్ భక్తులు మోటార్ సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పలు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గల శ్రీ సాలాసర్ హనుమాన్ దేవాలయంలో స్థానిక శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్, కార్పొరేటర్ జగన్, బాలానగర్ ఏసిపి శివరాత్రి యాదగిరి, జీడిమెట్ల సిఐ సంజీవరావు, ఎస్‌ఐలు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.
ఘట్‌కేసర్‌లో
ఘట్‌కేసర్: హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు ఎన్‌ఎఫ్‌సి నగర్, నారపల్లి, అంకుషాపూర్, పోచారం, ఏదులాబాద్ గ్రామాలలోని ఆలయాలు హనుమాన్ చాలిసా పఠనంతో మారు మోగాయి. ఉదయం నుండి భక్తులు బారులుతీరి ప్రత్యేక పూజలు జరిపారు.హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రత్యేక పూజలు జరపటం విశేషం. హనుమాన్ జయంతి సందర్భంగాప్రత్యేక పూజలు జరిపి శ్రీ హనుమాన్ చాలీసాపఠనం జరిపితే సమస్యలను ఎఏదుర్కోవటానికి కావలసిన ధైర్యం, సామాజిక లాభాలతో పాటు వ్యక్తిగత ప్రయోజనాలు సిద్ధిస్తాయని పూజారులు తెలిపారు.
షాబాద్‌లో...
షాబాద్: షాబాద్ మండల పరిధిలో శుక్రవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల బిసి సెల్ కన్వీనర్ లక్డారం ఆంజనేయులు, ఏబివిపి కార్యకర్తలు రాము, కిరణ్, గ్రామ నాయకులు నర్సింలు పాల్గొన్నారు.
మొయినాబాద్‌లో...
మొయినాబాద్: రామ్‌లక్ష్మణ్ జానకీ, జై బోలో హనుమాన్‌కీ, బజరంగబలీకి జై, భారత్‌మాతాకి జై అంటూ శుక్రవారం మండల కేంద్రం మారుమోగిపోయింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్, ఏబివిపి, పిహఎచ్‌పి, బిజెపి మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యాపారుల ఆధ్వర్యంలో చిల్కూరు బాలాజీ దేవాలయం నుంచి మండల కేంద్రంలో గల హనుమాన్ మందర్ వరకు మోటారుసైకిల్‌తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్కూరు నుంచి మొయినాబాద్ వరకు ప్రధాన కూడళ్లతో సహా ర్యాలీ బయలుదేరే మార్గాలన్నీ హనుమాన్ ఫ్లెక్సీలు, తోరణాలు, కాషాయ అలంకరణతో నిండిపోయాయి. చిల్కూరు బాలాజీ దేవాలయం వద్ద గల హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్ ర్యాలీని ప్రారంభించారు. మ.గం 12లకు ప్రారంభమైన శోభాయాత్ర మ.గం.3లకు మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయానికి చేరుకుంది.