చైనాలోని జింగ్ జియాన్‌లోని హెనన్ ప్రావెన్స్‌లో ఫిబ్రవరి మొదటి వారంలో పుట్టిన చున్‌చున్ అనే పాప బరువు 15 పౌండ్లు. అంటే సుమారు 6.8 కిలోలు! సిజేరియన్ ఆపరేషన్‌తో వేంగ్ యుజ్వాన్ అనే తల్లికి ఈ పాప పుట్టింది. ఆమెకి మొదటి కాన్పులో ఆరేళ్ళ క్రితం పుట్టిన తొలిబిడ్డ బరువు 8.8 పౌండ్లు. అంటే దాదాపు 3.5 కిలోలు. ఇంత బరువుతో పుట్టిన చున్ చున్ ప్రపంచంలోనే అధిక బరువుతో పుట్టిన పాప. హాంగ్‌కాంగ్‌లోని పాపులర్ సినిమా హీరోయిన్ చున్ చున్ పేరునే ఈ పాపకి పెట్టారు.
.............................
ఇలా అన్నారు...
కొధ్ది రోజుల క్రితం న్యూయార్క్ సబ్‌వేలో ఓ యువతికి ప్రసవం అయింది అని తెలిసి అమెరికన్ హాస్య ఏంకర్ డేవిడ్ వెటరన్‌మెన్ ఇలా అన్నాడు.
‘‘సబ్‌వేలో ప్రసవం అవడం చాలా కామన్. ఎందుకంటే సబ్‌వే రద్దీలో చాలా సాధారణంగా గర్భాదానం కూడా జరిగిపోతోంది’’.
..............................................
చిరునవ్వుకి చిరునామా
సుబ్బారావు భార్య అందగత్తె. వారిద్దరూ దుబాయ్‌కి వెళ్ళారు. సుబ్బారావుని భార్యని చూసి ఓ షేక్ ఆమెమీద మనసుపడి సుబ్బారావుని అడిగాడు.
‘‘నీ భార్యని నాకిస్తే నీకు వంద ఒంటెలు ఇస్తాను’’
కొద్ది క్షణాలు ఆలోచించి సుబ్బారావు తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘‘సారీ. నా భార్య అమ్మకానికి లేదు’’.
ఆ షేక్ వెళ్ళాక సుబ్బారావుని అతని భార్య అడిగింది.
‘మీరు నో’ అనడానికి మునుపు కొంతసేపు ఏం ఆలోచించారు?’’
‘‘వంద ఒంటెలని ఇండియాకి ఎలా తీసుకెళ్ళాలా? అని’’
సుబ్బారావు జవాబు చెప్పాడు.
.............................................
దురదృష్టపు దొంగ
కొలంబియాకి చెందిన మనీ జేమ్స్ అనే దొంగ 2008లో క్రిస్టియన్ గార్ట్ అనే అతని ఇంట్లోకి చొరబడి ఓ లేప్‌టాప్‌ని, రెండు డిజిటల్ కెమెరాలని మూట కట్టుకున్నాడు. అయితే క్రిస్టియన్ గార్ట్ కరాటే ఛాంపియన్ అని అతనికి తెలియదు. 12 మందికి కరాటే నేర్పుతున్న క్రిస్టిన్, అతని శిష్యులు అలికిడి విని ఈ దొంగని తేలికగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.