
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును గెల్చుకునే సువర్ణావకాశాన్ని భారత్ చేజార్చుకున్నప్పటికీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం తన బౌలర్లను వెనకేసుకు రావడమే కాకుండా ఒక్క గెలుపు కూడా లేని ఈ పర్యటనలో జట్టు ప్రదర్శన చాలా బాగా ఉందని సమర్థించుకోవడం విశేషం. మంగళవారం రెండో టెస్టు ముగిసిన తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో ధోనీ తమ జట్టు పేలవమైన ప్రదర్శనను సమర్థించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టుకు 680 పరుగులు సమర్పించుకున్న తన బౌలర్లు చక్కగా బౌల్ చేసారంటూ వారిని వెనకేసుకు వచ్చాడు. వన్‌డే మ్యాచ్‌ల ఫలితాలు తనకు నిరాశ కలిగించాయని, పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేక పోయామని ధోనీ అంటూ, టెస్టు మ్యాచ్‌లలో మాత్రం తన ‘యువ జట్టు’ ప్రదర్శన సంతృప్తి కలిగించిందన్నాడు. ‘మొత్తంమీద చాలా మంచి ప్రదర్శన. దక్షిణాఫ్రికా పర్యటననుంచి మేము మెరుగుపడుతూ వస్తున్నాం. మాది చాలా టాలెంట్ ఉన్న జట్టని మేము నిరూపించుకున్నాం’ అని ధోనీ అన్నాడు. టెస్టు సిరీస్‌లో తాము చాలా బాగా రాణించామని ధోనీ అంటూ, ‘ముఖ్యంగా రెండో టెస్టులో మేము అద్భుతంగా పోరాడాం. మేము సరియిన ఏరియాలోనే బౌల్ చేసాం. బౌలర్లకు ఏమాత్రం సహకరించని ఫ్లాట్ వికెట్లపై ఇది చాలా ముఖ్యం అని అన్నాడు. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో మా ఆటతీరు అద్భుతం. అలాగే ఇక్కడ రెండో టెస్టులో మేము టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్‌లో చాలా బాగా బౌల్ చేసాం. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మొదట్లో చక్కగానే రాణించాం. అయితే మెక్‌కల్లమ్, వాట్లింగ్‌లు అద్భుతంగా బ్యాట్ చేసి జట్టును ఆదుకున్నారు. మేము దారుణంగా బౌల్ చేసామని నేను అనుకోవడం లేదు. అయితే మంచి బంతులను వాళ్లు వదిలిపెట్టారని మాత్రమే అనుకుంటున్నాను’ అని ధోనీ అన్నాడు. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయేలా చేసిన తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించలేక పోయినప్పటికీ ధోనీ బౌలర్లను పెద్దగా విమర్శించకపోవడం గమనార్హం. అంతేకాదు, దాదాపు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా బ్యాట్ చేసిన మెక్‌కల్లమ్, వాట్లింగ్‌లను ప్రశంసించాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇదిలా ఉండగా టీమిండియా విదేశీ గడ్డపై వరసగా నాలుగు సిరీస్‌లలో ఓటమి పాలవడాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని, ప్రతి జట్టుకూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుదని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి అన్నాడు. ధోనీ అన్ని ఫార్మాట్‌లలోని అన్ని మ్యాచ్‌లు గెలవాలని ఆశించడం తప్పని, క్రికెట్ అనేది బ్యాట్‌కు, బాల్‌కు మధ్య పోరని ఆయన అన్నాడు.