విశాఖపట్నం, ఫిబ్రవరి 18: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా రాష్ట్ర బంద్‌కు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. విభజనపై అనుసరించిన వైఖరికిపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పిలునిచ్చాయి. సమైక్య ఉద్యమంలో భాగంగా గతంలో కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు పిలుపునిచ్చినప్పటికీ బంద్ పూర్తిస్థాయిలో జరగలేదు. అయితే రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర పడటంతో ఈసారి బంద్ పూర్తిస్థాయిలో జరుగుతుందని భావిస్తున్నారు. అందులోను రెండు ప్రధాన రాజకీయ పార్టీలు బంద్‌కు సన్నాహాలు చేయడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతుందని భావిస్తున్నారు.
సీమాంధ్ర మంత్రుల సిగ్గుమాలిన చర్య
* వీరి పదవీకాంక్షవల్లే రాష్ట్రం విడిపోయింది
* కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కయ్యాయి
* నిరసనలు,ప్రదర్శనలతో హోరెత్తిన నగరం
విశాఖపట్నం (జగదాంబ), ఫిబ్రవరి 18: రాష్ట్ర విభజన జరిగిపోయింది. సీమాంధ్ర మంత్రుల పదవీకాంక్షకు రాష్ట్రాన్ని బలిదానం చేశారు. అందరి ఆశలను, ఆశయాలను పక్కనపెట్టి ప్రజల్ని మోసం చేశారంటూ సమైక్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందన్న విషయం తెలుసుకున్న ఉద్యోగులు, న్యాయవాద, వైద్య, విద్యార్థి జెఎసిలు, విపక్ష రాజకీయ పార్టీలు మంగళవారం నగరంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్, ఆశీల్‌మెట్ట, ఆంధ్రాయూనివర్శిటీ, కంచరపాలెం ప్రాంతాల్లో రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాలు చేపట్టాయి. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరుకు నిరసనగా న్యాయవాద జెఎసి ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తును నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీకి చెందిన ఫెక్లీలను చించి వాటికి నిప్పంటించారు. రెండు పార్టీలు కుమ్మక్కై ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చారని ఆరోపించారు. ఈసందర్భంగా న్యాయవాద జెఎసి ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు ఘోరంగా విఫలమయ్యాయరని ఆరోపించారు. విభజన విషయంలో కేంద్రం మొండిగా ముందుకెళ్తున్నప్పటికీ మంత్రులు పదవులకు రాజీనామా చేయకుండా అధిష్టానం వద్ద మోకరిల్లారని ఆరోపించారు. ఈసందర్భంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వైద్య ఉద్యోగుల జెఎసి మోకాళ్ల ప్రదర్శన
రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైద్య ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జెఎసి ప్రతినిధి డాక్టర్ ఆశోక్ కుమార్,శ్యాంబాబ్జీ తదితరులు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ప్రక్రియను పూర్తిగా అప్రజాస్వామిక రీతిలో చేశారని ఆరోపించారు. విభజన విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. అంతకు ముందు కెజిహెచ్ ఇన్‌గేట్ వద్ద నిరసన ప్రదర్శన జరిపి, మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చక్రవర్తి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో
విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నేపధ్యంలో విద్యార్థి జెఎసి ఎయు ఇన్‌గేట్ వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ నుంచి తెలుగు మాట్లాడే వారికి కలిపి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందన్నారు. అయితే యుపిఎ మరోసారి అధికారంలోకి రావడంతో పాటు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు పచ్చని రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చారని ఆరోపించారు. ఈసందర్భంగా వాల్తేరు రహదారిపై బైఠాయించారు. సిరిపురం జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కేంద్రం తీరుకు నిరసనగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను విద్యార్థి జెఎసి నాయకులు దగ్ధం చేశారు.
తెదేపా ఆధ్వర్యంలో నిరసన
అప్రజాస్వామిక రీతిలో రాష్ట్ర విభజనకు పాల్పడిన కాంగ్రెస్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నగర శాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గాలమ్మ గుడి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లును ఆమోదింపచేసుకుందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విలువలకు ఏమాత్రం విలువనీయకుండా, ఎంపిలను బహిష్కరించి అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించారని ఆరోపించారు. ఈసందర్భంగా సోనియాగాంధీ, సీమాంధ్ర కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.
మానవునిలోని చైతన్యమే భగవంతుడు
ఆరిలోవ, ఫిబ్రవరి 18: మానవునిలోని చైతన్యమే భగవంతుడని సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖశర్మ తెలిపారు. సాహిత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థ సౌందర్యలహరి, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమి సంయుక్తంగా వారంరోజుల పాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక ప్రవచనాల్లో భాగంగా నాలుగవరోజు మంగళవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో బ్రహ్మాండ పురాణాంతర్గత లలితా చరిత్ర శ్రీలలితోపాఖ్యానంపై షణ్ముఖశర్మ ప్రవచించారు. సర్వాలంకార శోభిత, చైతన్య స్వరూపిణి అయిన లలితాంబిక భండాసురుడనే రాక్షసుని జయించిన విధానాన్ని సవివరంగా వివరించారు. లలితాంబిక పైకి పంపిన సైన్యాధ్యక్షుడు కుటిలాక్షుని అమ్మవారి అంకుశం నుండి ఉద్భవించిన సంపత్కరి అమ్మవారు ఎలా జయించింది వివరించారు. లలితా అమ్మవారి నుండి పుట్టిన అశ్వారూఢాదేవి కురుండుడు అనే రాక్షసుని సంహరించిన విషయాన్ని సవివరంగా వివరించారు. అర్థకామాలకు ధర్మమనే నియంత్రణ లేక రాక్షసత్వం ప్రబలుతుందని ఆయన తెలిపారు. ఇంద్రియ నిగ్రహం ఉన్న వారు దేనినైనా సాధించగలుగుతారని తెలిపారు. మానవునిలోని ఆత్మశక్తి లలితా అమ్మవారిని వివరించారు. అధికసంఖ్యలో హాజరైన ఆహుతులు ఆద్యంతం షణ్ముఖశర్మ ప్రవచనాన్ని ఆసక్తిగా ఉన్నారు.
లక్ష్మీనారాయణేష్ఠితో అష్టైశ్వర్యాలు
సింహాచలం, ఫిబ్రవరి 18: లక్ష్మీనారాయణేష్ఠితో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని త్రిదండి అహోబిలం రామానుజజియ్యర్ స్వామి అన్నారు. సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అష్టోత్తర శతకుండాత్మక సుదర్శన నారసింహ యజ్ఞంలో భాగంగా మంగళవారం లక్ష్మీనారాయణేష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజజియ్యర్ మాట్లాడుతూ లక్ష్మీనారాయణుల వైభవాన్ని వివరించారు. భార్య, భర్త బంధాన్ని పెనవేస్తూ లక్ష్మీనారాయణుల విశిష్ఠతను జియ్యర్‌స్వామి పలు ఉపమానాలతో తన ఉపన్యాసం చేశారు. లక్ష్మీనారాయణులు పూజించబడ్డ ప్రాంతమంతా మంగళకరంగా వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశేష హోమాలు, పూర్ణాహుతి, వేదస్వస్తి నిర్వహించారు. దేవాలయ ప్రధానార్చక పురోహితుడు సీతారామాచార్యులు, ఇన్‌ఛార్జ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి.రాజగోపాల్ సారధ్యంలో వైదిక పరివారం ఆగమ శాస్త్రానుసారం యజ్ఞం నిర్వహించారు. లక్ష్మీనారాయణేష్ఠిలో పాల్గొన్న ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
అంగన్‌వాడీల రాస్తారోకో
* గంటపాటు స్తంభించిన ట్రాఫిక్
విశాలాక్షినగర్, ఫిబ్రవరి 18: అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమంతో నగరంలో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం సరస్వతీ పార్కు నుంచి అంగన్‌వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. డాబాగార్డెన్స్ వరకూ ర్యాలీ సాగడంతో గంటపాటు వాహనాలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్తంభించింది. తొలుత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పోలీసులు సంయమనం పాటించారు. మానవహారంగా ఏర్పడిన అంగన్‌వాడీలు డిమాండ్లు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి పి.మణి మాట్లాడుతూ భావితరాలకు ఉపయోగపడే బాలబాలికలను తయారు చేస్తూ పౌష్ఠికాహారం అందిస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలే మహరాణులు అంటూ ప్రచారం చేస్తూ అంగన్‌వాడీలపై వివక్షత చూపుతోందని ఆరోపించారు. అంగన్‌వాడీ టీచర్లు తమ పంచాయతీలో బూత్‌లెవెల్ ఆఫీసర్ల నుంచి ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యోగులకు కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని, ఇందిరాక్రాంతి పథం జోక్యాన్ని నివారించాలని, పెన్షన్ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో అర్బన్ ప్రాజెక్టు నాయకులు ఆర్.ఈశ్వరమ్మ, ఎ.నూకరత్నం, వై.విజయక్ష్మి, ఆర్.శోభారాణి, పి.అరుణ, డి.సూర్యకుమారి, వై.తులసి, ఎంవి.రత్నావతి, ఆయాలు బి.లక్ష్మి, శాంతికుమారి, అప్పలకొండ తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
బాలాసోర్-హటియా రైల్వేస్టేషన్ల మధ్య మరమ్మతులు
* 50 గంటలపాటు పవర్ బ్లాక్
* పలు రైళ్ళు రద్దు
* మరికొన్ని దారి మళ్ళింపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 18: ఖుర్దా డివిజన్ పరిధిలో బాలాసోర్-హటియాల మధ్య ఈనెల 22 నుంచి దాదాపు 50 గంటలపాటు మరమ్మతులు చేపడుతున్నందున ఈ మార్గంలో నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను రద్దు చేస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ యల్వెందర్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చంత్రగాఛీ-తిరుపతి (22855) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 23న రద్దు చేశారు. తిరుపతి-చంత్రగాఛీ (22856) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 24న తిరుపతి నుంచి బయలుదేరదు.
పలు రైళ్ళు దారి మళ్ళింపు
న్యూ జల్‌పాయ్‌గురి-చెన్నై (22612) ఎక్స్‌ప్రెస్ ఈనెల 21వ తేదీన న్యూజల్‌పాయ్‌గురిలో బయలుదేరాలి. అయితే మరమ్మతుల కారణంగా దీనిని ఆద్రా, నాగ్‌పూర్, బాలహర్హహల మీదుగా నడుపుతారు. గౌహతి-చెన్నై (15630) ఎక్స్‌ప్రెస్ గౌహతిలో ఈ నెల 21న గౌహతిలో బయలుదేరాల్సి ఉండగా, దీనిని అసన్‌సోల్, టాటా, ఝార్సగుడ, టిట్లాఘర్, హాల్దియాల మీదుగా నడపాలని నిర్ణయించారు. అలాగే హాల్దియా-చెన్నై (22614) హాల్దియాలో ఈ నెల 22న బయలుదేరుతుంది. ఇది ఖరగ్‌పూర్, ఝార్సగుడ, టిట్లాగర్, విజయనగరం స్టేషన్ల మీదుగా నడుస్తుంది. దిబ్రుఘర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15902) దిబ్రుఘర్ మీదుగా ఖరగ్‌పూర్, ఝార్స్‌గుడ, టిట్లాఘర్, విజయనగరం మీదుగా నడవనుంది. బెంగుళూరు-గౌహతి (12509) బెంగుళూరులో ఈ నెల 20, 21 తేదీల్లో బయలుదేరాలి. అయితే ఇది బాల్హరాష్, నాగపూర్, ఝార్సగుడ, ఖరగ్‌పూర్‌ల మీదుగా నడుస్తుంది. త్రివేండ్రం సెంట్రల్-షాలిమర్ ఎక్స్‌ప్రెస్ (16323) త్రివేండ్రం నుంచి ఈ నెల 20వ తేదీన బయలుదేరాల్సి ఉండగా, ఇది కటక్, అంగుల్, సంబల్‌పూర్, ఝార్సగుడ, ఖరగ్‌పూర్‌ల మీదుగా నడుస్తుందని, ఈ అసౌకర్యాన్ని ప్రయాణికులు గమనించి తమతో సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.