Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అంతటా అప్రమత్తం

$
0
0

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో నిఘాను పెంచుతున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైళ్ళల్లో బయలుదేరి వెళ్ళేందుకు వీలుగా రేయింబవళ్ళు స్టేషన్‌లో పోలీసలు పహారా కాయనున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు(జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్ఫీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి విశాఖ రైల్వేస్టేషన్, జ్ఞానాపురం స్టేషన్, ప్రధాన రైల్వే రిజర్వేషన్ కాంప్లెక్స్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కానుంది. ఇప్పటికే వంద మంది ప్రభుత్వ రైల్వే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు నగర పోలీసులు, ఆర్పీఎఫ్ బృందాలు రైల్వేస్టేషన్‌ను కంటికి రెప్పలా కాస్తున్నాయి. వీరితో పాటు ప్రత్యేక బలగాలు స్టేషన్ బయట బందోబస్తు నిర్వహిస్తున్నాయి. అలాగే రామ్మూర్తిపంతులుపేట, మర్రిపాలెం మార్షలింగ్‌యార్డు, సింహాచలం స్టేషన్, దువ్వాడ రైల్వేస్టేషన్, నార్త్ క్యాబిన్ తదితర ముఖ్యమైన రైల్వే ప్రదేశాల్లో బలగాలు మోహరించనున్నాయి. జిఆర్‌పి డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ పార్థసారథి ఎప్పటికప్పుడు స్టేషన్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

నాటుసారాపై నారీమణుల ఉద్యమం
కొయ్యూరు, ఫిబ్రవరి 18: ఇంటిని, వంటిని గుల్ల చేస్తున్న నాటుసారాను నిషేధించే దిశగా నారీ మణులు నడుంబిగించారు. పంచాయతీ పరిధి గ్రామాలన్నింటా ఉన్న నారీమణులంతా ఒక్కటై సారా భూతాన్ని గ్రామాల నుండి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. మండలంలోని కొమ్మిక పంచాయతీ పరిధిలో 14 గ్రామాల మహిళలు నాటుసారా వలన కలిగే అనర్థాలను స్వయంగా అనుభవించి విసుగెత్తి నాటుసారాను గ్రామాల్లో నిషేధించాలని తీర్మానించుకున్నారు. దీంతో పంచాయతీ పరిధి గ్రామాల మహిళలందరూ స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. పంచాయతీ పరిధి గ్రామాల్లో నాటుసారా ఏరులై పారడమే కాకుండా తయారీ చిన్న పరిశ్రమ మాదిరిగా మారింది. దీంతో విసుగు చెందిన మహిళలు తమ భర్తలు, పిల్లలను తమ కాపురాలను కాపాడుకునేందుకు వీలుగా సారాను నిషేధించాలని ఒక్కటై తీర్మానించుకున్నారు. ఇందుకు పంచాయతీ వాసులంతా అంగీకరించడంతో నాటుసారా తయారీ సామాగ్రిని స్వాధీన పర్చుకుని గ్రామాల్లో ఎవరు నాటు సారా తయారు చేసే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తప్పవని తీర్మానించుకుని సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా మణులంతా ఒక్కటయ్యారు. ఇందుకు గాను ప్రత్యేకంగా 30 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వీరి ఆలోచనలు ఫలించి ఉద్యమం విజయవంతమైతే మరిన్ని గ్రామాలకు కొమ్మిక మహిళలంతా ఆదర్శం కాగలరు.
విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్?
రైల్వేబోర్డు కసరత్తు
అందుబాటులోకి వందల ఎకరాలు * కొత్త జోన్‌లో నాలుగు డివిజన్లు!
విశాఖపట్నం, ఫిబ్రవరి 18: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌కు అవసరమైన చర్యలు వేగవంతమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే రైల్వేబోర్డు కసరత్తు మొదలుపెట్టింది. మంగళవారం మూజువాణి ఓటుతో ప్రత్యేక రాష్ట్ర విభజన నిర్ణయంతో ఇప్పుడు అందరి దృష్టి రైల్వేజోన్‌పైనే పడింది. అదీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సీమాంధ్ర ప్రజానికం ఆగ్రహాన్ని తగ్గించవచ్చనే భావనతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అందువలనే ఇప్పటికే రైల్వేజోన్ అంశంపై రైల్వేబోర్డు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాల్తేరు, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌గా ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
భూములకు లోటు లేదు
ప్రత్యేక రైల్వేజోన్‌కు అవసరమైన భూములు విశాఖలో ఉండటంతో దీని గురించి రైల్వేబోర్డు ప్రత్యేకించి శ్రమపడనవసరంలేదు. అవసరమైనంత స్థలం ఉంది. రాష్ట్రంలో మరే రైల్వే డివిజన్లలోను ఇంత పెద్దమొత్తంలో రైల్వేభూములు లేవు. అది ఒక్క విశాఖలోనే ఉండటం జోన్ ఏర్పాటుకు మరింత బలాన్నిస్తోంది. అయితే కబ్జాకు గురైన రైల్వేభూములను స్వాధీనం చేసుకోవలసి ఉంది. ఇప్పటికే రైల్వేస్టేషన్ సమీపానున్న సేవానగర్‌లో కబ్జాలను వాల్తేరు డివిజన్ అధికారులు వ్యూహాత్మకంగా తొలగించగలిగారు. జివిఎంసి సహకారంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఏడాదిన్నర కిందట దాదాపు ఆరెకరాల్లో ఆక్రమణలను తొలగించి ప్రాథమిక విజయాన్ని సాధించిన రైల్వే ఈ స్థలాన్ని స్వాధీనపరచుకుంది. అలాగే మరికొన్ని చోట్ల పరులపాలైన రైల్వేభూముల కబ్జాలపై దృష్టి పెట్టింది. ఇవికాకుండా కొనే్నళ్ళుగా వాల్తేరు డివిజన్ పర్యవేక్షణలో ఉన్న వందలాది ఎకరాల్లో కొంతమేర కేటాయించినా ప్రత్యేక రైల్వేజోన్ కోసం అవసరమైన ప్రధాన కార్యాలయాలు, పలు విభాగాలు, చీఫ్ ఇంజనీర్ కార్యాలయం, జిఎం కార్యాలయం, ఉన్నతాధికారులు, అధికారుల క్వార్టర్స్, రైల్వే ఉద్యోగుల క్వార్టర్లను సులభంగా నిర్మించవచ్చు. విశాఖలో తాటిచెట్లపాలెం, బిఎన్‌ఐటిఎన్ కాలనీ, రైల్వేన్యూకాలనీ, సేవానగర్, పుచ్చలదిబ్బకాలనీ, వెర్లెస్‌కాలనీల్లో ఎక్కువభాగం ఖాళీగానే ఉంది. ఈ రైల్వే ప్రాదేశాలను అభివృద్ధి చేసినా సరిపోతుందని గతంలో డివిజన్ అధికారులు రైల్వేబోర్డుకు ప్రతిపాదించినట్టు తెలిసింది.
నాలుగు డివిజన్లతో ప్రత్యేక జోన్
విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పడితే ఇందులోకి నాలుగు డివిజన్లు రానున్నాయి. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, గుంతకల్, విజయవాడ, నాందేడు, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. ఇందులో నాందేడు, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు పూర్తిగా తెలంగాణ పరిధిలోనే ఉన్నందున వీటిని తప్పిస్తే మిగిలేవి మూడు డివిజనే్ల. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను వాల్తేరు డివిజన్‌తో కలిపి నాలుగు డివిజన్లతో ప్రత్యేక రైల్వేజోన్‌గా ఏర్పాటు చేయాలనేది రైల్వేబోర్డు నిర్ణయం. ఈ దిశగానే కసరత్తు జరుగుతోంది.
జోన్ వస్తే పదివేల కోట్లు
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పడితే కచ్చితంగా పది వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చి తీరుతుంది. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న నాలుగు డివిజన్ల నుంచి వేల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని రాబట్టగలుగుతోంది. భారతీయ రైల్వేకు ఆర్థిక వెన్నుముకగా నిలుస్తున్న ఒక్క వాల్తేరు డివిజన్‌కే ప్రతి ఏడాది నాలుగు వేల కోట్లకు పైగా సరకు రవాణా ద్వారా ఆదాయం వస్తోంది. ఇది కాకుండా ప్రయాణికులు, పార్శిళ్ళ ద్వారా మరో రూ.1500 కోట్ల వరకు వస్తోంది. ఈ విధంగా వేలాది కోట్ల మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న వాల్తేరు డివిజన్‌తో పాటు, జోన్ ఏర్పడితే ఆశించిన స్థాయిలోనే ఆదాయం వస్తుంది.
నిధులకు కొదవలేదు
జోన్ నిర్మాణానికి అవసరమైన నిధులకు కొదవలేదు. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి రైల్వేబడ్జెట్ 19వేల కోట్ల మేర కేటాయించింది. అలాగే ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలోకి వచ్చే వాల్తేరు డివిజన్‌కు ప్రతి ఏడాది నాలుగు వేల కోట్లకు పైగానే వస్తోంది. జోన్ ఆవిర్భవించి పదకొండేళ్లు గడిచినా ఈ నిధుల్లో కనీసం 20 శాతం కూడా డివిజన్ల అభివృద్ధికి ఖర్చు చేయడం లేదు. అందువల్ల ఇప్పుడు కొత్త జోన్ నిర్మాణానికి అవసరమైనన్ని నిధులు పుష్కలంగా ఉన్నాయని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులు
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 18: మండలంలోని సంపతిపురం గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలావున్నాయి. సంపతిపురం గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలోని మంగళవారం విద్యార్థిని విద్యార్థులు మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. ముందుగా ఒక విద్యార్థి భోజనం చేయగానే వాంతులు కావడంతో మిగతా విద్యార్థులు కూడా అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు హుటాహుటిన కశింకోట ప్రాధమిక వైద్యాలయానికి తరలించారు. అక్కడ వీరికి ప్రధమ చికిత్స అందించడంతో విద్యార్థులు కోలుకున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న అనకాపల్లి డిప్యూటీ తహశీల్దార్ సందర్శించి విద్యార్థులను పరామర్సించారు. పాఠశాల ఉపాధ్యాయులు, వంటల నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో విద్యార్థులు తహశీల్దార్‌కు భోజనంలో పురుగులు ఉన్నట్లుగా చెప్పారు. దీంతో ఆయన విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

జి.మాడుగుల మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన
జి.మాడుగుల, ఫిబ్రవరి 18: మండలంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ రీమెలి గ్రామ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రహదారులతోనే మన్యం అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. రహదారుల నిర్మాణం వలన అత్యవసర సేవలతో పాటు నిత్యావసర పనులకు సైతం సౌకర్యంగా ఉంటుందన్నారు. రహదారుల వలన గ్రామాల మద్య సత్సంబంధాలు బలపడతాయని ఆయన చెప్పారు. పాడేరు నుండి జి.మాడుగుల, వంజరి మీదుగా చింతపల్లి మండలం తాజంగి వరకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. పాడేరు చింతపల్లి ప్రధాన రహదారిని విస్తరించేందుకు 44 కోట్లు విధులయ్యాయన్నారు. జి.కె.వీధిలో మహిళా డిగ్రీ కళాశాల, జి.మాడుగులలో రెసిడెన్షియల్ ఐ.టి.ఐ. మంజూరైందన్నారు. అనంతరం మండలంలోని పర్యాటక ప్రాంతమైన కొత్తపల్లి జలపాతాన్ని ఆయన సందర్శించారు. కొత్తపల్లి జలపాతాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, శాసస సభ్యుని నిధుల నుంచి పది లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్, మూడు లక్షల రూపాయలతో బస్ షెల్టర్ నిర్మాణానికి పనులను ప్రారంభించారు. పర్యాటక ప్రాంతంలో సహజత్వాన్ని కోల్పోకుండా చూడాలని, కొత్తపల్లి జలపాతంలో అభివృద్ధి కోసం వసూలు చేస్తున్న రుసుమును తీసుకోవద్దని, జలపాతం అభివృద్ధికి సంబంధించి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. జి.మాడుగుల, లంబసింగి, చింతపల్లిలోని పర్యాటక ప్రాంతాల్లో 25 కాటేజీల వంతున నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో బంగారుతల్లి పథకం ద్వారా అర్హులైన వంతాల శాంతి, వంతాల స్వామి, వంతాల మంగమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి.ఎ. పి.ఒ. వినయ్‌చంద్, ఆర్డీఓ రాజ్యకుమారి, పి.ఆర్. ఎస్.సి. రవీంద్ర, డి.డి. మల్లికార్జునరెడ్డి, ఇ.ఇ. మురళీకృష్ణ, డి.ఇ. రణదేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో జరిగే పరిణామాలను దృష్టిలో
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>