రాహుల్, కిరణ్మయి ఇద్దరూ ఎం.బి.బి.ఎస్. పాసయ్యారు.
పెద్దల ఇష్టప్రకారం పెళ్ళిచేసుకున్నారు. నెల తిరక్కుండానే
గొడవపడి విడిపోయారు. అసమర్థుడైన భర్తతో కాపురం
చేయలేనని కిరణ్మయి అంటోంది. అహంకారి పెళ్ళాం
నాకొద్దంటున్నాడు రాహుల్. ఇరువైపుల తల్లిదండ్రులు,
బంధువులు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు.
కొందరు మధ్యవర్తుల జోక్యంతో గొడవలు మాని చట్టప్రకారం
విడాకులు తీసుకోడానికి నిర్ణయించుకున్నారు. ఏడాది
తరువాత కోర్టులో కేసువేయడానికి వేచి ఉన్నారు.
ఆధునిక సమాజంలో దాంపత్య సమస్యలు
పెరిగిపోతున్నాయి. పెళ్ళయిన స్వల్పకాలంలోనే
విడిపోడానికి సిద్ధపడుతున్న వారి సంఖ్య
అధికమవుతున్నది. దంపతుల మధ్య మనస్పర్థలు,
అభిప్రాయ భేదాలు తలెత్తినపుడు అసలు కారణాలకంటే
ఊహలు, కల్పితాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి.
సాధారణంగా దాంపత్య కలహాలు తలెత్తినపుడు
అమ్మాయినే ఎక్కువమంది తప్పుపడుతారు. చదువు,
ఉద్యోగం ఉందన్న అహంకారంతో అలా ప్రవర్తిస్తున్నదని
భాష్యం చెపుతారు. అబ్బాయిలో లోపాలు ఉన్నా పెద్దగా
పట్టించుకోరు. భర్త ఎలాంటి వాడైనా భార్య సర్దుకుని
కాపురం చేయాలని హితవు పలుకుతారు. అమ్మాయి తన
సమస్యలు చెప్పడానికి ప్రయత్నిస్తే కాలమహిమ అంటూ
చెవులు కొరుక్కుంటారు. అంతే తప్ప అసలు సమస్య
ఏమిటో? ఎక్కడ ఉందో? తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం
చేయరు.
అవగాహన అవసరం...
దాంపత్య సమస్యల్లో మానసిక లోపాలే ప్రధానపాత్ర
పోషిస్తున్నాయని పలు సర్వేల ద్వారా వెల్లడయ్యింది.
వ్యక్తిత్వ, ప్రవర్తనా లోపాలు, గుణదోషాలు భార్యాభర్తల
మధ్య కలహాలకు దారితీస్తాయి. అహంకార స్వభావం,
వ్యసనాలు ఎడబాటుకు తెరలేపుతాయి. అవగాహన లోపం,
సర్దుకోలేని తత్వం వివాదాలకు కారణమవుతాయి. ఆశలు,
అలవాట్లు, అభిప్రాయాలలోని తేడాలు మనుషులను
దూరం చేస్తాయి. సిగ్గు, బిడియం, ఈర్ష్య, ద్వేషం, కోపం,
ఆవేశం లాంటి మనుషుల మధ్య దూరం పెంచుతాయి.
ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల్లోను ఇలాంటి లోపాలు
ఉంటాయి. ప్రతివారూ ఎదుటివారి లోపాలు ఎత్తిచూపి
నిందిస్తారు తప్ప తమ దోషాలను దిద్దుకోరు. తల్లిదండ్రులు,
బంధువులు సైతం తమవైపు తప్పులను సరిదిద్దే ప్రయత్నం
మాని ఎదుటివారి వైఖరిని తప్పుపడుతుంటారు.
అలాగే, చాలామందిలో పైకి కనిపించని మానసిక
రుగ్మతలు ఉంటాయి. అవి జీవన భాగస్వామి బాధలు,
వేదనలకు మూలమవుతాయి. భర్త నపుంసకుడైతే ఆ
బాధను పైకి చెప్పుకోలేని వారే అధికంగా ఉంటారు. ఒకవేళ
ఎవరైనా చెప్పే ప్రయత్నంచేస్తే సర్దుకోమని, అనుకూలంగా
మార్చుకోమని సలహాలిస్తారు. భర్తతో సుఖం లేక
అసంతృప్తితో రగిలిపోయేవారిలో పలు రుగ్మతలు తలెత్తే
ప్రమాదం ఉంది. శారీరక సుఖాలు పొందలేని వారిలో
చాలామంది డిప్రెషన్‌కు గురవుతుంటారు. కొందరిలో
హిస్టీరియా, ఇతర మనో నాడీరుగ్మతలు తలెత్తుతుంటాయి.
ఇంకొంతమంది మనసు మళ్ళించుకోడానికి గుడులు,
గోపురాలు, పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు
లాంటి వాటిని అలవర్చుకుంటారు. అయితే ప్రతి భార్య
మనోవేదనను అనుభవిస్తుంటుంది. కొంతమందిలో
అనుమానపు రుగ్మత ఉంటుంది. వీరు జీవిత భాగస్వామి
శీలం, గుణంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ
సమస్య తీవ్రంగా ఉన్న వారి వేదన శోభనం రాత్రినుంచే
ప్రారంభమవుతుంది. పెళ్ళికి పూర్వం ప్రేమలు,
పరిచయాలు, తిరుగుళ్ళను గూర్చి ఆరా తీయడం
ప్రారంభిస్తారు. దీంతో మనసు వికలమై ఘర్షణలు
ప్రారంభమవుతాయి. భర్తలో శాడిజం గుణం ఉంటే భార్య
బతుకు హింసాపూరితం అవుతుంది. కొందరిలో డిప్రెషన్,
మరికొందరిలో ఉన్మాద లక్షణాలు ఉంటాయి. ఈ
రుగ్మతలవల్ల భాగస్వామికి నిరంతరం సమస్యలు
ఎదురవుతుంటాయి. స్కిజోప్రెనియా, అబ్సెసివ్ కంపల్సివ్
డిజార్డెర్ ఉన్న వారివల్ల పలు ఇబ్బందులు
కలుగుతుంటాయి. దీనికితోడు హార్మోన్ల సమస్యలు
దాంపత్య జీవితానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి.
మానసిక సమస్యలతోపాటు పలు శారీరక రుగ్మతలు
దంపతులను బాధిస్తుంటాయి. స్థూలకాయం, గురక,
నిద్రలో నడవడం, రక్తపోటు, మధుమేహం, మైగ్రెయిన్
ఇతర సమస్యలు దంపతుల మధ్య గొడవలకు
కారణమవుతుంటాయి. అలాగే ఆహారపు అలవాట్లు,
విలువల్లో తేడాలు చిన్న చిన్న కలహాలకు దారితీస్తాయి.
ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు,
ఏకాభిప్రాయం లోపిస్తుంటాయి.
ఆ అసంతృప్తిదే అగ్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా జరిపిన పలు అధ్యయనాలలో దాంపత్య
సమస్యలకు పలు కారణాలు వెలుగుచూశాయి. ఇందులో
శృంగార పరమైన ‘అసంతృప్తి’దే అగ్రస్థానమని
వెల్లడయ్యింది. డబ్బు సంపాదన, వ్యాపార, ఉద్యోగ
విషయాలపైబడి దాంపత్య జీవితాన్ని విస్మరిస్తున్న వారి
సంఖ్య పెరిగిపోతున్నది. శృంగార లేమికి నపుంసకత్వం
ప్రధాన కారణంగా భావిస్తారు. అయితే సామర్థ్యం ఉండీ
పలు కారణాలవల్ల సుఖాన్ని అందించలేకపోతున్నవారే
ఇప్పుడు అధికంగా ఉన్నారు. ఉద్యోగాలవల్ల ఎడబాటు,
వృత్తి, ఉద్యోగ ఒత్తిళ్ళు, వ్యసనాలు, వివాహేతర బంధాలు
దంపతుల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తున్నాయి. దీనివల్ల
భార్యాభర్తలు శారీరక సుఖాలకు దూరమై పలు
సమస్యలు, రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు.
అందుకే దంపతులు తమ శృంగార జీవితం
మెరుగుపరచుకోవాలంటున్నారు మానసిక నిపుణులు.
పలు రుగ్మతలనుంచి బైటపడటానికి ఆరోగ్యాన్ని
మెరుగుపరచుకోడానికి ‘సెక్స్ థెరపీ’ మంచిదంటున్నారు.
శృంగారపరమైన సంతృప్తి అందించే జీవిత భాగస్వామిలో
ఇతర లోపాలు ఉన్నా పట్టించుకోరు.
శృంగార జీవితాన్ని క్రమబద్ధంగా నిర్వహించే వారిలో
ఒత్తిళ్ళు, డిప్రెషన్ తగ్గిపోతుంది. నిద్ర లేమి, తలనొప్పి, కీళ్ళ
నొప్పి, ఇతర శారీరక సమస్యలకు శృంగారమే
దివ్యౌషధమంటున్నారు. శృంగార జీవితం సాఫీగా
ఉన్నవారికి ఆయురారోగ్యాలు వృద్ధిచెందుతాయి. గుండె,
ఊపిరితిత్తులు, హార్మోన్ల పని విధానం మెరుగుపడుతుంది.
వాకింగ్, జాగింగ్, ఈత, యోగ లాంటి వ్యాయామాలకంటే
శృంగారంవల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సంతృప్తికర
శృంగారానుభూతులు స్వంతం చేసుకునే దంపతుల మధ్య
ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
ఇంకా పలు ప్రయోజనాలున్నందున శృంగారానికి తగిన
సమయం కేటాయించాలని సైకాలజిస్టులు అంటున్నారు.
కనీసం వారానికి మూడురోజులైనా శారీరకంగా కలవాలని
సూచిస్తున్నారు. ఉద్యోగాలవల్ల దూరప్రదేశాలలో ఉన్నవారు
వారాంతపు సెలవులు, ఇతర రోజుల్లో అవకాశం
దొరికినపుడు ‘సుఖ’పడేందుకు ప్రయత్నించాలి.
సర్వపాపాలు గంగలో మునిగితే కొట్టుకుపోయినట్లు అన్ని
సమస్యలు శారీరక సుఖాలవల్ల సమసిపోతాయని
గుర్తించాలి.
ఆత్మీయత ముఖ్యం
దంపతుల మధ్య అవగాహన ముఖ్యం. అహంకారం,
ఆత్మగౌరవం లాంటి మాటలు వీడి ఆత్మీయత, అనురాగం
పెంపొందించుకోవాలి. సహనం, సర్దుబాట్లు స్వంతం
చేసుకోవాలి. రోజు కొంత సమయం ఏకాంతంగా గడపాలి.
కలసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, సరస
శృంగారాలకు సమయం వెచ్చించడం చేయాలి.
మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడుప్రశాంతంగా
చర్చించి పరిష్కరించుకోవాలి. జీవితాంతం ఒకరికొకరై,
మనసున మనసై సాగిపోవాలి. కొడుకు, కోడలు మధ్య
సమస్యలు తలెత్తినపుడు పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించాలి.
అసలు సమస్య కనుక్కుని పరిష్కరం సూచించాలి. తమ
అభిప్రాయాలు రుద్దడం ఎంతమాత్రం మంచిది కాదు.
ఎవరికివారు పరిష్కరించుకోలేనప్పుడు సైకాలజిసుల్ట సేవలు
పొందడం మంచిది.