హైదరాబాద్, ఫిబ్రవరి 19: మహానగరాభివృద్ధి, పౌర సేవల నిర్వహణ కీలక బాధ్యతలు చేపడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రానున్న ఆర్థిక సంవత్సరం (2014-15)కు సంబంధించి రూపొందించిన బడ్జెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ప్రతి ఏటా బడ్జెట్‌లో సవరణలు కౌన్సిల్, స్థారుూ సంఘంలో సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత సాధ్యమయ్యేవి. కానీ ఈ సంవత్సరం మార్పులు ఏకపక్షంగా జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ. 3850 కోట్లతో అధికారులు రూపకల్పన చేసిన బడ్జెట్ గతంలో పలుసార్లు స్థారుూ సంఘం సమావేశంలో మేయర్ ప్రవేశపెట్టగా, స్థారుూ సంఘంలోని కాంగ్రెస్ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినా, బుధవారం నిర్వహించిన స్థారుూ సంఘంలో సభ్యుల అభిప్రాయాల మేరకు భారీగా మార్పులు చేసినట్లు మేయర్ వెల్లడించారు. ఈ క్రమంలో సభ్యుల అభిప్రాయాల మేరకు మార్పులు చేర్పులు చేసేందుకు ఈ నెల 24వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించిన మేయర్ ఉన్నట్టుండి ముందుగానే స్థారుూ సంఘం సమావేశం నిర్వహించిన భారీగా మార్పులు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆకస్మికంగా మార్పులు చేయటం ఎన్నికల స్టంటేనంటూ మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు మినహా ఇతర పార్టీల కార్పొరేటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తాయిలాలను ప్రకటించటంపైనే మజ్లిస్ మేయర్ ఎక్కువగా దృష్టి సారించారని బిజెపి పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే ప్రతి ఏటా వేల కోట్లలో బడ్జెట్‌ను రూపొందించి, అందులో కేటాయింపులకు సంబంధించి కేవలం ముప్పై నుంచి ముప్పై అయిదు శాతం మాత్రమే పనులు జరుగుతుండగా, ఈ సారి ఉన్న బడ్జెట్‌ను మరో రూ. 749 కోట్లకు పెంచినా, ఫలితం ఏ ముంటుందన్న వాదన విన్పిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం 2013-14లో కూడా రూ. 2269 కోట్ల ఏడు లక్షలతో బడ్జెట్‌ను రూపొందించారు. ఈసారి నగరంలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు రోడ్ల మరమ్మతులు, రోడ్ల విస్తరణ పనులతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించి కేటాయింపులు జరిపినందుకే బడ్జెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. రూ. 850 కోట్లను వసూలు చేయాలన్న టార్గెట్ కమిషనర్ పంపిన ప్రతిపాదనలో ఉండగా, స్థారుూ సంఘం నిర్ణయం ప్రకారం ఈ వసూళ్లను రూ. 1250 కోట్లకు పెంచటం, అలాగే ట్రేడ్ లైసెన్సుల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా రూ. 60 కోట్లుండగా, దీన్ని వంద కోట్లకు సవరించారు. అలాగే అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగం నుంచి కార్పొరేషన్‌కు రూ. 30 కోట్ల ఆదాయం వస్తుండగా, దాన్ని అదనంగా రూ. 60 కోట్లను పెంచుతూ లక్ష్యాన్ని రూ. 90 కోట్లకు పెంచటంతో ఈసారి బడ్జెట్ రూపురేఖలు భారీగా మారాయి.
తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగ, విద్యార్థుల పాత్ర కీలకం
హయత్‌నగర్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉపాధ్యాయ, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభను హయత్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపిడిఓ జ్యోతి, కుత్బుల్లాపూర్ ఎంపిడిఓ అరుణ, తహశీల్దార్ మధుమోహన్, ఎటిఓ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగ, విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జెఎసి నేతలు సదానందంగౌడ్, జంగయ్య, రమేష్, ఆర్‌ఐ సుదర్శన్, రవీంద్రసాగర్, బుచ్చయ్య పాల్గొన్నారు.
చిరకాల స్వప్నం నెరవేర్చిన సోనియా
తార్నాక: తెలంగాణ అమరవీరుల త్యాగాలు ఫలించాయని వారి ఆశయాలు సిద్ధించాయని పిసిసి ఉపాధ్యక్షుడు పిట్లక్రిష్ణ పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్‌రాజ్ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. కాగా అడ్డగుట్ట నుంచి చిలకలగూడ, వారాసిగూడ, తార్నాక, లాలాపేట్ మీదుగా సాగిన ర్యాలీలో పిట్ల కృష్ణ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
‘పన్ను’ల కోసమే మమ్మల్ని విలీనం చేశారా?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 19: మా నుంచి అధిక మొత్తంలో ఆస్తిపన్ను వసూలు చేసుకునేందుకే మమ్మిల్ని గ్రేటర్‌లో విలీనం చేశారా? అంటూ శివారు తెలుగుదేశం కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శివార్లలోని డివిజన్‌లో వౌలిక వసతులను మెరుగపరిచేందుకు రూ. 300 కోట్లను కేటాయించిన అధికారులు ప్రస్తుతం శివార్లలో శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో పన్ను వసూళ్ల ఆశతోనే కేటాయించారే తప్ప, శివార్ల అభివృద్ధిపై చిత్తశుద్ధితో కాదని కొట్టిపారేశారు. టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కార్పొరేటర్లు సపన్నదేవ్, అశోక్‌గౌడ్, రవీందర్ ముదిరాజ్, భార్గవి, నరేందర్ ముదిరాజ్, సయ్యద్ బాబు, శ్రీనివాస్‌రెడ్డి, జితేంద్రనాథ్, కొప్పుల లత, సుమలతారెడ్డి, కృష్ణాగౌడ్‌లు బుధవారం ప్రధాన కార్యాలయంలో మేయర్ మాజీద్ హుస్సేన్ అధ్యక్షతన స్థారుూ సంఘం సమావేశం జరిగే సమయానికి చేరుకున్నారు. మేయర్ ఛాంబర్ ముందు కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శివార్లలో యుద్దప్రాతిపదికన తాగునీటికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు శివార్లను అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు ఎందుకు వాటిని అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇపుడు కేవలం ఎక్కువ మొత్తంలో ఆస్తిపన్ను వసూలు చేసుకోవచ్చుననే రూ. 300 కోట్లను కేటాయించారని ఆరోపించారు. ఇప్పటికీ ఆస్తిపన్ను చెల్లిస్తున్న గ్రేటర్ డివిజన్ల వాసులు వౌలిక వసతులను మెరుగుపర్చిన తర్వాత ఎందుకు అదనంగా 30శాతం ఆస్తిపన్నును చెల్లించాలని ప్రశ్నిస్తూ స్థారుూ సంఘం సమావేశానికి వెళ్తున్న స్పెషల్ కమిషనర్, ఇతర అధికారులను అడ్డుకున్నారు. దీంతో మేయర్ జోక్యం చేసుకుని సర్థిచెప్పడంతో కార్పొరేటర్లు శాంతించి ధర్నా విరమించగా, స్థారుూ సంఘం యదావిధిగా కొనసాగింది.
విజయకేతనం ఎగురవేస్తాం
తార్నాక, ఫిబ్రవరి 19: సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉందనిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం గోషామహల్ నియోజకవర్గంలోని మహేశ్వరీభవన్‌లో నిర్వహించిన నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేయడమే తమ లక్ష్యమని అన్నారు. నాయకులు కార్యకర్తలు సమిష్టిగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి గోషామహల్ నియోజకవర్గం కంచుకోట అందుకే పూర్వవైభవానికి కార్యకర్తలు నిజాయితీగా ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీకోసం పనిచేయాలని హితవుపలికారు. కార్యకర్తలను వారి స్పందన గురించి మాట్లాడించినప్పుడు వారు తమకు సరైన నాయకత్వం లేదని, ముందు తమకు ఇన్‌చార్జ్‌ను నియమించాలని, డివిజన్ అధ్యక్షులు పనిచేసే వారిని నియమించాలని తలసానిని కోరారు. నగర అధికార ప్రతనిధి ఎం. ఆనంద్‌కుమార్‌గౌడ్, ప్రచార కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌ధూత్ కార్యకర్తలను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశారు.
గోషామహల్ నేతలపై తలసాని ఆగ్రహం
గోషామహల్ నియోజకవర్గంలోని చాలా మంది నేతలు సింగల్‌గా కార్యక్రమానికి తరలిరావడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
ఆయా డివిజన్ అధ్యక్షులను పిలిచి ఎంతమంది కార్యకర్తలు తమతో వచ్చారని ప్రశ్నించి వివరాలు తెలుసుకుని విస్తుపోయారు. డివిజన్ అధ్యక్షుని స్థాయి నుంచి నగర కమిటీలో కీలక నేతలుగా ఉంటున్న వారుసైతం సింగిల్‌గా రావడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నగర కమిటీలో ఉన్న నేతల పదవులు కూడా మార్చనున్నట్లు ప్రకటించి సంచనలం సృష్టించారు.
23న గోషామహల్ కొత్త కమిటీల నియామకం
గోషామహల్‌లోని అన్ని డివిజన్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు తిరిగి ఈ ఆదివారం 23న నగరం నుంచి ఏర్పాటు చేసిన పదిమంది పరిశీలకుల ఆధ్వర్యంలో కొత్తగా డివిజన్ అధ్యక్షులను నియమించడంతోపాటు గోషామహల్ నియోజకవర్గంలో పట్టు సాధించడానికి తలసాని యత్నాలు ముమ్మరం చేశారు. పరిశీలకులుగా ఎం.ఎన్.శ్రీనివాస్, సింగిరెడ్డిశ్రీనివాస్, గుర్రం పవన్‌కుమార్ గౌడ్, సాయిబాబ, తొలుపునూరి క్రిష్ణాగౌడ్, షాబాజ్‌అహమ్మద్‌ఖాన్, శ్రీపతిసతీష్, సుంకరిరవీందర్, సుధాకర్‌గుప్తను నియమించారు.