హైదరాబాద్, ఫిబ్రవరి 19: మహానగర పాలక సంస్థ తాజాగా ప్రకటించిన బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుంది. గతంలో ఎన్నడూ ఎన్నడూ లేని విధంగా ఈసారి సేవా కార్యక్రమాలకు ఎక్కువ కేటాయింపులు జరపటం ఎన్నికల బడ్జెట్ అనేందుకు నిదర్శనం. ఓటర్లను ప్రభావితం చేసేలా బడ్జెట్‌లో మార్పులు చేశారన్న విమర్శ ఉంది. నాలుగేళ్లుగా గ్రేటర్‌లో పాలక మండలి కొనసాగుతున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మినరల్ వాటర్ ఫ్లాంట్లు, రూ. 5కే ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వినూత్న పథకాలను ప్రకటించారు. కానీ రోజురోజుకి పట్టణీకరణ పెరుగుతున్నా, నిలువనీడ లేని వారికి గూడు కల్పించే హౌజింగ్ స్కీంకు ఈ సారి బడ్జెట్‌లో మొండి చేయి చూపారు. అంతేగాక, గ్రేటర్ పరిధిలోని ఔత్సాహిక క్రీడకారుల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ప్రోత్సాహాన్నిందించేందుకు స్పోర్ట్స్ ఫెల్లోషిప్ అనే ప్రత్యేక పథకాన్ని కూడా బడ్జెట్‌లో తాజాగా చేసిన సవరణలో పొందుపర్చారు. జిల్లా స్థాయిలో ప్రతిభను కనబర్చి, రాష్ట్ర స్థాయిలో పాల్గొనలనుకునే ఔత్సాహిక క్రీడాకారుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం అయిదు వందల మందిని గుర్తించి వారికి సహాయన్నందించేందుకు రూ. 5 కోట్లను కొత్తసవరణ బడ్జెట్‌లో కేటాయించారు. దీంతో పాటు అలాగే గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో స్వచ్చమైన, మినరల్ వాటర్‌ను నామమాత్రం ధరకే అందించేందుకు రూ. 8.5 కోట్లను కేటాయించారు. వీటితో రూ. 5 లక్షల వ్యయంతో ఒక్కో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రేటర్‌లో ఉద్యోగం చేసుకునే దంపతుల వెసులుబాటు కోసం వారి పిల్లను చూసుకునేంకు వెయ్యి డే కేర్ సెంటర్లను నెలకొల్పేందుకు రూ. 50 కోట్లను కేటాయించారు. ఈ సెంటర్లు డివిజన్‌లో ఒకటి ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు మేయర్ వివరించారు. దీనికి తోడు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కూడా పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను జరుపుకునేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి తరపున రూ. 36 కోట్లతో 24 ఫంక్షన్ హాళ్లను అందుబాటులో తేవాలన్న ప్రతిపాదనను పొందుపర్చారు. ఫంక్షన్‌లకు కావల్సిన సామాగ్రిని మొత్తం గ్రేటరే సమకూర్చి , వీటి నిర్వహణ బాధ్యతలను స్థానిక స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకే అప్పగించనున్నట్లు, తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించనట్టవుతుందని వివరించారు. ఒక్కో ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. కోటిన్నరతో ఈ ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు, ఇవి గాకా, ఒక్కో నియోజకవర్గంలో మినీ స్పోర్ట్స్ స్టేడియంలను నిర్మించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు మేయర్, కమిషనర్‌లు వివరించారు.
అయిదు రూపాయలకే భోజనం
మహానగరంలో నివసించే ప్రతి ఒక్కరు రోజుకి కనీసం రెండుసార్లయినా కడుపు నిండా భోజనం చేయాలన్న సంకల్పంతో గ్రేటర్‌లో ఆహార భద్రత పథకాన్ని పరోక్షంగా అమలు చేసేందుకు అధికారులు నడుం భిగించారు. ప్రస్తుతం నగరంలోని పలు కూలీల అడ్డాల్లో, జంక్షన్లలో భోజనం రూ. 15 నుంచి రూ. 20వరకు అందుబాటులో ఉన్న విషయాన్ని తాము గుర్తించినట్లు, అదే పరిశుభ్రమైన, పౌష్టికమైన శాఖాహర భోజనాన్ని పౌరులకు రూ. 5కే అందుబాటులో తెచ్చేందుకు బల్దియా బడ్జెట్‌లో ఫుడ్ స్కీంను ప్రవేశపెట్టి, రూ. 11 కోట్లను కూడా కేటాయించింది. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి నగరంలో 50 కేంద్రాలను ఏర్పాటు చేసి, పేరుగాంచిన క్యాటరింగ్‌లతో భోజనం తయారు చేసి రూ. 5లకే విక్రయించనున్నట్లు తెలిపారు. ఒక్కోక్కరికి ఈ భోజనానికి రూ. 20 ఖర్చవుతుండగా, వినియోగదారుడు రూ. 5 చెల్లిస్తే మిగిలిన సొమ్మును బల్దియానే సబ్సిడీగా చెల్లించనుంది. తొలుత రోజుకి 300 మందికి, ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రతిరోజుకు ఒక్కో సెంటర్ ద్వారా 15వేల మందికి ఈ భోజనాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
* హౌసింగ్ కేటాయింపుల ప్రస్తావనేదీ? * అదనంగా ఫుడ్, మినరల్ వాటర్ స్కీంలు, డే కేర్ సెంటర్లు * నిరుపేదలకు అన్ని హంగులున్న ఫంక్షన్ హాళ్లు * క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
english title:
y
Date:
Thursday, February 20, 2014