
హైదరాబాద్, ఫిబ్రవరి 19: విద్యుత్ శాఖ అధికారులు బిల్లుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ కరెంటు సరఫరాపై చూపటం లేదు. రోజురోజుకి వేసవి ఎండ పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది ఈ క్రమంలో మున్ముందు ఎండలు మరింత మండిపోయే అవకాశాలుండటంతో ఇప్పటి నుంచే విద్యుత్‌ను ఆదా చేసేందుకు సిపిడిసిఎల్ అధికారులు ఇప్పటికే నగరంలోని మెట్రో జోన్‌లోని అన్ని ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించి రోజుకి రెండు గంటల పాటు వేర్వేరు సమయాల్లో కోతలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే! ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కోతలను అమలు చేస్తున్న అధికారులు బుధవారం ఆకస్మికంగా గంటల తరబడి కోతలు అమలు చేశారు. పలు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటలకు నిల్చిపోయిన కరెంటు సరఫరా మధ్యాహ్నం రెండు గంటలకు పునరుద్ధరించారు. సిపిడిసిఎల్ అధికారికంగా ప్రజలకిచ్చిన సమాచారం మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు, ఆ తర్వాత ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మాత్రమే రెండు గంటల పాటు కోతలను అమలు చేయాల్సి ఉండగా, ఏకంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అనధికారికంగా నాలుగు గంటల పాటు కోతలను అమలు చేయటంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. కోతల వేళలపై అవగాహన ఉన్న కొందరు వినియోగదారులు స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, శివార్లలో హై టెన్షన్ తీగల్లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తాయని, వాటికి మరమ్మతులు చేపట్టేందుకు సరఫరా నిలిపివేసినట్లు చెప్పినట్లు కొందరు వినియోగదారులు తెలిపారు. మరికొన్ని కార్యాలయాల్లో అధికారులు వినియోగదారుల ఫిర్యాదులకు సమాధానం చెప్పేందుకు నిరాకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని వినియోగదారులంటున్నారు. నిజాంగానే హై టెన్షన్ తీగల్లో లోపాలు తలెత్తితే ఒక రోజు ముందుగానే వినియోగదారులకు సమాచారం ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. నగరంలో మామూలు 33/11కెవి ఫీడర్లకు మరమ్మతులు తలెత్తితే వాటికి మరమ్మతులు చేపడుతున్నట్లు పరిసర ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిల్చిపోయే ప్రాంతాల వివరాలతో ప్రకటన జారీ చేసే అధికారులు హైటెన్షన్ తీగల విషయంలో సమాచారమివ్వకపోవటంతో తామెన్నో ఇబ్బందులెదుర్కొన్నామని చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులంటున్నారు. అసలే విద్యార్థులకు పరీక్షల కాలం, కనీసం కోతలను అమలు చేస్తున్న సమయాన్ని మినహాయించి ఇతర సమయాల్లోనైనా ప్రశాంతంగా చదువుకునే పరిస్థితుల్లేవని మరికొందరు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే నెల మొదటి వారం నుంచి నగరంలో ఎండలు మరింత మండిపోయే అవకాశముండటంతో అపుడు కోతలు మరెంత తీవ్రమవుతాయోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టౌన్‌ప్లానింగ్ ప్రక్షాళన: భారీగా ఏసిపిల బదిలీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు స్థానం చలనం కల్పించిన కమిషనర్ సోమేశ్‌కుమార్ తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఆసరాగా చేసుకుని ఏళ్ల తరబడి టౌన్‌ప్లానింగ్‌లో తిష్టవేసిన పలువురు అధికారులను భారీగా బదిలీలు చేశారు. ఇందులో భాగంగా వెస్ట్‌జోన్ సీటీ ప్లానర్ నర్సింగ్ రావును సెంట్రల్ జోన్ జోనల్ ప్లానర్‌గా బదిలీ చేశారు. అలాగే అడిషనల్ సిపిగా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాముడును వెస్ట్‌జోన్ జోనల్ సిపిగా, అడిషనల్ సిపి కె. ఆనంద్‌బాబును నార్త్‌జోన్ జోనల్ సిపిగా నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మరో అదనపు సిపి వి.నరేందర్‌రావును కూడా ఈస్ట్‌జోన్ జోనల్ సిపిగా, డిప్యూటీ సిటీ ప్లానర్ వెంకట్‌రెడ్డిని సౌత్ జోన్ సిపిగా బదిలీ చేశారు. వీరితో కె. శ్రీనివాసరావును కూడా కోర్టు కేసులు, నాలాలు, చెరువులు, వీది వర్తకుల విభాగాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అడిషనల్ టౌన్‌ప్లానర్ దయానంద్‌ను సిటీ ప్లాన్‌గా ప్రధాన కార్యాలయానికి స్థానం చలనం కల్పించారు. సిపి ఉపేందర్‌రెడ్డిని సిటీ ప్లానర్‌గా, మహ్మద్ ఖాలిద్ సర్వర్‌ను ఇన్‌ఛార్జి సిపిగా, సిటీ ప్లానర్ జి. కృష్ణయ్యను సిపిగా, సిటి జి. బాబును ప్రధాన కార్యాలయం సిటీ ప్లానర్‌గా బదిలీ చేశారు. వీరితో పాటు ఎసిపి ఆర్.ఇ నాగేశ్వరరావును హౌజ్ నెంబరింగ్ సెల్‌కు, ఎసిపి జి. శంకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎసిపిగా, ఎసిపి ఎం.ఎ.సత్తార్‌ను రోడ్డు విస్తరణ ఎసిపిగా, ఎసిపి టిడివి ప్రసాద్‌ను సర్కిల్ 2 ఎసిపిగా ఇన్‌చార్జిగా నియమించారు. ఎసిపి ఎస్.ఎ.సమిని సర్కిల్ 3 ఎసిపిగా, సర్కిల్ 8 ఎసిపిని కె. వెంకటేశ్వరరావును సర్కిల్ 3 ఇన్‌ఛార్జి ఎసిపిగా, సర్కిల్ 3 ఎసిపి సివి పురుషోత్తమ్‌ను సర్కిల్ 4 ఎసిపిగా, ఎసిపి ఎన్. భువనేశ్వర్‌ను సర్కిల్ 4 ఎసిపిగా, సర్కిల్ 6 ఎసిపిని సర్కిల్ 5 ఎసిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఎల్‌ఆర్‌ఎస్ ఎసిపి మక్బూల్ జహాను సర్కిల్ 5 ఎసిపిగా, ఎసిపి సుబ్బారెడ్డిని సర్కిల్ 6 ఎసిపిగా, సి. సీతాకల్యాణిని సర్కిల్ 6 ఎసిపిగా, పి. శ్రీనివాసదాస్‌ను సర్కిల్ 7 ఎసిపిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు ఎసిపి మహ్మద్ మహమూద్ సర్కిల్ 7 ఇన్‌ఛార్జి ఎసిపిగా నియమించారు. ఎసిపి సాంబయ్యను సర్కిల్ 8 ఎసిపిగా, తులసీరాంను సర్కిల్ 9 ఇన్‌చార్జి ఎసిపిగా, ప్రధాన కార్యాలయంలోని ఎసిపి జి. అమృత్‌కుమార్‌ను సర్కిల్ 9 ఎసిపిగా నియమించారు. ఎసిపి రామచందర్‌ను సర్కిల్ 10 ఎసిపిగా, పి. రజనిని సర్కిల్ 11 ఎసిపిగా, ఎ. సంతోష్‌వేణును సర్కిల్ 12 ఇన్‌ఛార్జి ఎసిపిగా, చంద్రశేఖర్‌ను సర్కిల్ 15 పూర్తి స్థాయి ఎసిపిగా, ఎసిపి శారదాంబను సర్కిల్ 13 ఎసిపిగా, ఎసిపి ఎం.కె. ప్రేమ్‌కుమార్‌ను సర్కిల్ 14 ఎసిపిగా, ఎం.ఎ. సమిని సర్కిల్ 15 ఎసిపిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రధాన కార్యాలయంలోని ఎసిపి జలంధర్‌రెడ్డిని ఇన్‌ఛార్జి ఎసిపి సర్కిల్ 16గా, ఎసిపి ప్రసాద్‌ను సర్కిల్ 18 ఎసిపిగా బదిలీ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.