
** హసీ తో ఫసీ (పర్వాలేదు)
తారాగణం:
సిద్దార్థ్ మల్హోత్రా, పరిణితి చోప్రా, అదాశర్మ
సంగీతం: విశాల్ - శేఖర్
కథ, స్క్రీన్‌ప్లే: హర్షవర్ధన్ కులకర్ణి
నిర్మాతలు: కరణ్ జోహర్ - అనురాగ్ కాశ్యప్
దర్శకత్వం: వినీల్ మాథ్యూ
హమ్మయ్య! బతికిపోయాం. కొన్ని వారాలుగా బాలీవుడ్‌లో వస్తూన్న ‘చిత్ర’ మెరుపుల్ని.. క్షమించాలి - మరకల్ని చూళ్లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఐతే - ఇదేదో భూ నభోంతరాళాల్లో కనీవినీ ఎరుగని అద్భుతం అని మాత్రం ఊహల్లోకి వెళ్లకండి. ‘గుడ్డికంటె మెల్ల మేలు’ కదా. మళ్లీ రాతియుగంలోకి- కోట్ల సంవత్సరాల్లోకి వెళ్తే - అక్కడ్నుంచీ పట్టుకొచ్చిన ఇతివృత్తమే ఇది. ‘పెళ్లి’ కానె్సప్ట్ బాలీవుడ్‌కి కలసివచ్చిన తారకమంత్రం. మొన్నటికి మొన్న ఇంతియాజ్ అలీ ‘జబ్ వీ మెట్’ - ఆనంద్‌రాయ్ ‘తనూ వెడ్స్ మనూ’, కత్రీనాకైఫ్ ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ ఇత్యాది కథలన్నీ పంజాబీ నేపథ్యంలో ధూంధాంగా జరిగిన ధారావాహికలే. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కావల్సినంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్‌లే. పెళ్లంటే ఇష్టంలేని పెళ్లికూతురు/ పెళ్లికొడుకు చెప్పాపెట్టకుండా పెళ్లి మండపం నుంచీ చెక్కేయటం.. లేకుంటే - నిశ్చితార్థం ముగిసినప్పటికీ.. వేరే ఎవరికో అధాటున మనసిచ్చి - మానసికంగా నలిగిపోయే హీరో/ హీరోయిన్. ఈ కథల్లో కొత్తదనం కనిపించదు. కారణం తెలిసిందే. ఎన్నిసార్లని చూస్తాం. కానీ - హసీ తో ఫసీ’ కొద్దిగా డిఫరెంట్. అందులోనే వెరైటీ వెతుక్కునే వెసులుబాటు. రొమాన్స్ - సెంటిమెంట్.. పంజాబీ పెళ్లిళ్ల సందడి -కలగలిపి థియేటర్ల మీదికి వదిలేశాడు కరణ్ జోహర్.
కథ - పలు జీవితాల్తో పెనవేసుకొన్న సర్కిల్. ఒకటి - నిఖిల్ (సిద్దార్థ్ మల్హోత్రా) కథ. సంపన్న వర్గానికి చెందినవాడు. స్వతంత్ర భావాలు కలిగినవాడు. తన కాళ్లపై తాను నిలబడాలనుకొనే మనస్తత్వం. అతగాడు ముందొక సవాల్. పెళ్లాడబోయే అమ్మాయి -కోట్ల రూపాయలు ఆర్జిస్తే పెళ్లాడతానంటుంది. అది ఆ అమ్మాయి టార్గెట్. ఆ నేపథ్యంలో ఏం జరిగిందన్నది అతగాడి మిగతా కథ అయితే - మిఠా (పరిణితి చోప్రా) కథ మరొకటి. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే కొంచెం పెద్ద కథవుతుంది. ఈమె తనకి తాను సైంటిస్ట్ అనేసుకొంటూంటుంది. ప్రయోగాలు గట్రా చేసేస్తూంటుంది. తండ్రి అంటే ఇష్టం - అయిష్టం. ఒక్కటంటే ఒక్కటి మంచి అలవాటు ఉండదు. చిన్నపిల్ల మనస్తత్వం. ఆఖరికి - ఇంట్లో ఇమడలేక.. డబ్బు తీస్కోని ఇంట్లోంచి పారిపోతుంది. అదీ చైనాకి. దీంతో తండ్రికి గుండెపోటు. ఆ గుండెని భద్రంగా కాపాడుకొంటూ వస్తుంది పెళ్లికూతురు సదరు మిఠా అక్కగారు. చైనాలో ఏం జరిగిందో తెలీదుగానీ - అక్కడ్నుంచీ నేరుగా ఇండియా వచ్చేసి - పెళ్లి మండపంలో తేలుతుంది మిఠా. ఎందుకంటే- ఆమెకీ డబ్బు కావాలి. చైనాలో చేసిన అప్పులు తీర్చటానికి. ఎలా? తండ్రికి కనిపిస్తే మళ్లీ గుండెపోటు. ఇక మిఠాని దాచటానికి అక్కగారు పడిన పాట్లు. అంటే - మూడు కోణాల్లోనూ ‘డబ్బు’ కానె్సప్ట్. అదే ప్రధానం. కోట్లు కావాలి. ఈ కోట్లలోంచి - కామెడీ పుట్టి.. పంజాబీ పెళ్లి వేడుకల్ని ఎంజాయ్ చేసేట్టు చేస్తుంది. ఇంతకీ నిఖిల్ - తనకి భార్య కాబోయే అమ్మాయినే చేసుకున్నాడా? మధ్యలో చైనా నుంచీ పారిపోయి వచ్చిన మిఠా సంగతి ఏమిటి? వీరు ముగ్గురికీ సొమ్ములు దక్కాయా? తండ్రి అకౌంట్‌ని హేక్ చేద్దామన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఇలా అనేకానేక మలుపుల తర్వాత ఈ చిత్రం ముగుస్తుంది.
బోర్ ఫీలయ్యే అవసరం రాదు. మధ్యమధ్య పరిణితి చోప్రా చేసే తలతిక్క పనులు మినహా. ఆ కేరెక్టర్‌ని అలా డిజైన్ చేయాలని అనిపించిన కథకుణ్ణి ఎక్కడ దొరికితే అక్కడ చితక బాదేయాలనిపిస్తుంది. అదీ కొద్దిసేపు. ఎందుకంటే - మధ్యలో ముద్దు సీన్లు వచ్చేస్తాయి కదా. అదే గొప్ప రిలీఫ్. పెళ్లి సందడి చెప్పనక్కర్లేదు. రొటీన్‌గా ఆయా సన్నివేశాలు ఆర్భాటంగా వచ్చి వెళ్లిపోతూంటాయి. పరిణితి ఈక్వేషన్ ప్రకారం ‘దో హాఫ్ మే ఏక్ ఫుల్ సే జ్యాదా మిల్తా హై’. ‘రెండు హాఫ్‌లతో ఒక ఫుల్ లార్జ్ కొట్టినట్టే’. ‘సోచో మే ఐడియా హోతీ ఔర్ తుమ్ టెక్నాలజీ, హమారీ పతంగ్ క్యా మస్త్ ఉడ్‌తీ నా?’ లాంటి మాటలతో తికమక పెట్టినా.. మొత్తానికి పెళ్లి బాగానే జరిగిందనిపించింది. సిద్దార్థ్ మల్హోత్రా - పరిణితి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.
నిఖిల్ కుటుంబ సభ్యులుగా చేసిన వారుగానీ.. కొలీగ్స్ గానీ.. ఇలా ఆయా పాత్రలన్నీ పాత్రోచితంగా నటించి ‘సీన్’ పండించారు. పరిణితి తండ్రిగా నటించిన పాత్రధారి ఆకట్టుకొంటాడు. సంగీత పరంగా - బోలెడన్ని పాటలున్నప్పటికీ.. కొన్ని ఆకట్టుకొంటాయి. ఏది ఏమైతేనేం - పంజాబీ పెళ్లిసందడి మళ్లీమళ్లీ చూడాలనుకొంటే - ‘హసీ తో ఫసీ’కి వెళ్లొచ్చు.
-హెచ్.