కడప, ఫిబ్రవరి 21: వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజు పేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం బల్లి పడిన ఆహారాన్ని తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న వారందరినీ రైల్వేకోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుక్రవారం అల్పాహారం అందజేసిన నిర్వాహకులు అదితిన్న 24 విద్యార్థులు వాంతులు, విరేచనాలతో సతమతమవుతున్న విషయాన్ని పట్టించుకోలేదు. దీనితో పరిస్థితి విషమించింది. తెలిసిన సిబ్బంది చీదరించుకుని తమను గాలికొదిలేశారని బాధిత విద్యార్థులు చెబుతున్నారు. చావు బతుకుల కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులను ఆసుపత్రికి చేర్చిన ఉద్యోగులు అల్పాహారంలో బల్లి పడి ఉండవచ్చని అనమానం వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన వైద్యులు ఆ మేరకు వెంటనే వైద్యసేవలు ప్రారంభించారు. గురుకుల పాఠశాల ఉద్యోగుల నిర్లక్ష్యంతో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, తాజా సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.శివయ్య మాదిగ డిమాండ్ చేశారు.
డబుల్ డెక్కర్
ట్రయల్ రన్ 28న
కర్నూలు, ఫిబ్రవరి 21: రైల్వే బడ్జెట్‌లో మంజూరైన కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ రైలును ప్రయోగాత్మకంగా ఈనెల 28వ తేదీ నడిపేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైల్వేమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రైలును పరిశీలించిన అనంతరం కాచిగూడ నుంచి తిరుపతి వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అదే రైలులో మంత్రి కోట్ల కర్నూలు వరకు వస్తారు. తిరుపతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరుగులు తీస్తే ఆ తరువాత ఒకటి, రెండు రోజుల్లో తిరుపతిలో కొత్త రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. తిరుపతి స్టేషన్‌లో మంత్రి పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈరైలును తొలుత ఉదయం వేళల్లో వారానికి ఒక రోజు నడుపనున్నారు. ఈనెల 25వ తేదీ నాటికి రైలుకు సంబంధించిన వేళలను నిర్ధారించే అవకాశం ఉంది. కాగా కాచిగూడ నుంచి గుంటూరు వరకు మంజూరైన మరో డబుల్ డెక్కర్ రైలును ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక డోన్ నుంచి ఆదోని, రాయచూర్ మీదుగా ముంబయి నగరానికి మరో రైలును రైల్వే మంత్రి కోట్ల మంజూరు చేయించినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఈ రైలును కూడా మార్చి ఒకటి, రెండవ తేదీల్లో ప్రారంభించేందుకు అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఘరానా దొంగ అరెస్టు
తిరుపతి, ఫిబ్రవరి 21: డాక్టర్‌గా నటిస్తూ వయస్సు ఆధారంగా పెద్ద తరహాలో వ్యవహరిస్తూ అవకాశం దొరికిన చోటల్లా దోపిడిలు, దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర ఘరానా దొంగను తిరుపతి క్రైమ్ పోలీసులు శుక్రవారం వలవేసి పట్టుకున్నారు. తిరుపతిలో తన ఛాంబర్‌లో అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు విలేఖరులతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ఆర్ హరీష్ అలియాస్ అరసు, అలియాస్ డాక్టర్ హరీష్, అలియాస్ రవిని గురువారం సాయంత్రం తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌లో పట్టుకున్నారన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా తిరుపతి, రేణిగుంటలలో సుమారు 39 చోరీలకు పాల్పడిన ఈ ఘరానా దొంగ నుండి 50 లక్షల రూపాయలు విలువ చేసే ఒకటిన్నర కేజిల బంగారు, 2 కేజిల వెండి, 2 లక్షల రూపాయల నగదు, కెమేరాలు, ల్యాప్‌టాప్‌లు, చేతిగడియారాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2011 సంవత్సరంలో చెన్నైలోని ఎమ్మెల్యే కృష్ణస్వామి ఇంటిలో దొంగతనం చేసి ఒక సెల్ ఫోన్, 75వేల రూపాయల నగదును చోరీ చేశారన్నారు. 2012వ సంవత్సరంలో తిరుపతి విష్ణు నివాసంలో తలుపుల తాళాలు తొలగించి 3.50 లక్షల నగదు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేసినట్టు తమ విచారణలో అంగీకరించాడన్నారు.
హంతకుడి ఆత్మహత్య
బాసర, ఫిబ్రవరి 21: నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం దూపెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్న నిందితుడు నరేందర్‌రెడ్డి మృతదేహం శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో లభ్యమెంది. బంధువులు నిందితునికి సంబంధించిన సమాచారం మేరకు మృతదేహం నరేందర్‌రెడ్డిదేనని నిర్ధారించుకొని నిజామాబాద్ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం గోదావరి నదిలో గాలించినా ఫలితం లేదు. శుక్రవారం గోదావరి నదిలోని రెండో ఘాట్ వద్ద మృతదేహం కనిపించగా గజ ఈతగాళ్లతో బయటకు తీసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ ఎస్పీ తరుణ్‌జోషితో పాటు పోలీసలు అధికారులు సంఘటన స్థలం చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
రాజధాని కోసం ముమ్మర యత్నాలు
కర్నూలు/విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలోని రాజకీయపార్టీల్లో మరో చీలికకు తాజా పరిస్థితులు దారితీస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలుగా విడిపోయిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమగా చీలిపోయే ప్రమాదం పొంచిఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాష్టప్రతి ఆమోద ముద్ర లాంఛనమే. మిగిలిన 13 జిల్లాలకు రాజధాని ఎక్కడ అన్న అంశం ఇపుడు మరో వివాదానికి దారితీస్తోంది. తెలంగాణ ప్రాంతం రాష్ట్రం నుంచి వేరుపడినందున 1953లో మాదిరిగానే రాజధానిని కర్నూలులో ఏర్పాటుచేయాలని లేదంటే రాయలసీమలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. తమిళుల నుంచి విడిపోవాలన్న సంకల్పంతో 1937లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాజధాని కర్నూలులో నెలకొల్పాలని సీమ నేతలు కోరుకుంటున్నారు. ఈ మేరకు రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు సైతం ఇద్దరు కేంద్రమంత్రుల ఆధ్వర్యంలో తమ వంతుగా ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం వద్ద పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిలు ఢిల్లీలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా విడివిడిగా కసరత్తు చేస్తున్నారు. అగ్రనేతలకు మరో తలనొప్పి తప్పదనిపిస్తోంది.
మరో ఉద్యమం తప్పదంటున్న టిడిపి
సీమాంధ్రలో నిన్న మొన్నటివరకు టిడిపి నేతలు సమైక్యాంధ్ర కోసం ఎంత చేసినా విభజన జరిగిపోయింది. ఇప్పుడు ఇక పోరాటానికి మరో అంశం కావాలి కదా? ‘విజయవాడ పరిసరాల్లోనే రాజధాని’ డిమాండ్ కొత్తగా తెరమీదకు తెచ్చారు టిడిపి వారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బిజెపి నేతలే కారణమని అంటున్నారు. శాసనసభ, ఆపై లోక్‌సభ, రాజ్యసభలోను టిడిపి ఎంఎల్‌ఏలు, ఎంపిలు విభజనను ఆహ్వానించటమే కాదు సీమాంధ్రులపై దాడికి సన్నద్ధమైనా తమ నాయకత్వ లోపం ఏ మాత్రం లేదంటున్నారు ఈ ప్రాంత నేతలు. లోక్‌సభలో టిడిపి ఎంపి నామా నాగేశ్వరరావు తమపై దాడి చేశారని, దీన్ని చంద్రబాబు పట్టించుకోలేదని నరసరావుపేట ఎంపి మోదుగుల విమర్శిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కేశినేని నాని నేతృత్వంలో అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, సెంట్రల్, పశ్చిమ ఇన్‌చార్జిలు బొండా ఉమ, నాగుల్‌మీరా, ఇతర నాయకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాజా రాజధానిపై పోరాటం సాగిస్తామని మాత్రం పకటించారు.