
హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో సచివాలయంలో ఉద్యోగులు శుక్రవారం తెలంగాణ ధూం ధాం నిర్వహించారు. సచివాలయంలోని క్యాంటిన్ నుంచి సి బ్లాక్ వరకు తెలంగాణ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు డోలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సచివాలయం మొత్తం తిరిగారు. సి బ్లాక్ వద్ద మీడియా పాయింట్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఫ్లెక్సీ కనిపించడంతో దానిని చించివేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రవణ్‌రెడ్డి, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావులు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు కీలక పాత్ర వహించాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పాలన సక్రమంగా జరగకపోతే మొదటి రాయి ఉద్యోగులపైనే పడుతుందని అన్నారు. తెలంగాణ సాధించుకున్నాం, ఇక ఉద్యమాలను చాలించి తెలంగాణ ప్రజలకు మేలు కలిగే విధంగా ఉద్యోగ విధులు నిర్వహిద్దామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములం అవుతామని తెలిపారు. తెలంగాణ ధూం ధాంలో పలువురు తెలంగాణ కళాకారులు పాటలు పాడారు.
సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం: టిఆర్‌ఎస్
తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పిలుపు ఇచ్చారు. ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు వారు నగరానికి తిరిగి వచ్చారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజయ్య, గంగుల కమలాకర్, జూపల్లి కృష్ణారావులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులతో ఊరేగింపుగా గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం నాయకుడు ఈటెల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కల సాకారం అయిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలుపుకొనేందుకు అందరం కలిసి కృషి చేయాలని అన్నారు. తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ముందుకు రాగా, తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని నమ్మారని, ఉద్యమంలో తోడు నిలిచారని అన్నారు.
తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల విజయోత్సవం..
సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఆనందోత్సాహాలు.