హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. 2008లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజన ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో భద్రాచలం పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో సీమాంధ్రలోని కొన్ని, తెలంగాణలోని కొన్ని నియోజక వర్గాలు ఉండేవి. కానీ 2008 పునర్విభజన తరువాత కేవలం తెలంగాణలోని ప్రాంతాలనే ఇక్కడ చేర్చారని, దీని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని అన్నారు.
ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. ఇక రాష్టప్రతి ఆమోదమే మిగిలింది. రాష్టప్రతి నోటిఫికేషన్‌లో అపాయింటెడ్ తేదీ పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త రాష్ట్రం ఆవిర్భవిస్తుంది.
మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే కొత్త రాష్ట్రం ఏర్పాటుపై రాష్టప్రతి నోటిఫికేషన్ వస్తుంది. అపాయింటెడ్ తేదీ సైతం ఫిబ్రవరి నెలలోనే ఉండే అవకాశం ఉంది. దాంతో మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేటప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఉనికిలో ఉంటాయి. కాబట్టి రెండు రాష్ట్రాలకు విడివిడిగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల్లో సత్వరం విడివిడిగా ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్నికల కమీషన్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికిప్పుడు రెండు రాష్ట్రాలకు విడివిడిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, అయితే ఒకే ఎన్నికల కమిషనర్ రెండు రాష్ట్రాల బాధ్యత నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామాలవారీగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ఓటర్ల వివరాలు వేరువేరుగానే ఉన్నందున రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించిన తరువాతనే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర అధికారులతో, ఎన్నికల కమిషన్‌తో ఈ అంశంపై ముందుగానే అభిప్రాయాలు తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు ఒకసారి జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలకు ఎన్నికల వరకు ఒకే ఎన్నికల కమిషన్ ఉంటుందని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర కమిషన్‌కు వెల్లడించినట్టు తెలిసింది.
తట్టా, బుట్టా సర్దుకుని పోదాం: పాలడుగు
హైదరాబాద్, ఫిబ్రవరి 21: రాబోయే 15, 25 రోజుల్లో తట్టా, బుట్టా సర్దుకుని వెళ్ళిపోదాం.. అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు తెలంగాణలో ఉన్న సీమాంధ్రులనుద్దేశించి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులకు అవమానం జరిగిందని ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ రోడ్లు, భవనాలు చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. సీమాంధ్రులు సంచారుల్లా మారాల్సి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు. సీమాంధ్ర నాయకుల్లో ఐక్యత లేదని, అందుకే విభజన జరిగిందని ఆయన విమర్శించారు.