విశాఖపట్నం, ఫిబ్రవరి 21: పురంధ్రీశ్వరి గొంతు బొంగురుబోయింది.. కళ్ళ వెంబడి వస్తున్న నీటిని అదిమి పట్టింది.. ఐదేళ్లుగా ఆమె ఇక్కడ అనుభవించిన క్షోభను కార్యకర్తల ముందు వెళ్లగక్కింది.. అధిష్ఠానం తనను పూచిక పుల్లలా ఎలా తీసి పారేసిందో క్యాడర్‌కు వివరించింది.. అధిష్ఠానం శల్య సారథ్యం పట్ల విసిగి వేసారిన ఆమె తన భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్‌తో చర్చించాలనుకుంది. ఐదేళ్ల తన ఆవేదనను ఒక్కసారిగా వారి ముందుంచింది. ఎన్టీఆర్ చిన్నమ్మా.. అని ముద్దగా పిలుచుకునే పురంధ్రీశ్వరి కాంగ్రెస్ పార్టీలో.. మరీ ముఖ్యంగా విశాఖ అనుభవించిన నరకయాతనను కార్యకర్తలకు చెపుతుంటే..చాలామంది నిశే్ఛష్ఠులైపోయారు.. ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, విజ్ఞురాలు.. ఒకప్పుడు సోనియా, మన్మోహన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన పురంధ్రీశ్వరికి ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి? ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగుతారా? లేక ఆమె కుమారునికి బాధ్యతలు అప్పగించి, ప్రశాంతగా జీవిస్తారా? ఒకవేళ రాజకీయాల్లో ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? లేక వేరేపార్టీలోనైనా చేరుతారా? అన్న అనేక ప్రశ్నలకు జవాబు దొరకాల్సి ఉంది. పార్టీకి రాజీనామా చేసిన తరువాత గురువారం ఆమె నగరానికి చేరుకున్నారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలతో రుషికొండలోని ఆమె కుమార్తె ఇంటి వద్ద భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
పురంధ్రీశ్వరి మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం తనను చిన్నచూపు చూసింది. నియోజకవర్గానికి సంబంధించిన ఏ విషయాన్ని తనతో సంప్రదించలేదు. తన నియోజకవర్గంపై తనకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర విభజన విషయంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న తనను ఏనాడూ అధిష్ఠానం సంప్రదించలేదు. నా అభిప్రాయాన్ని తీసుకోలేదు. దీంతో నా మనసు గాయపడింది. కేంద్ర మంత్రినై ఉండి వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది?? తమ కన్నా బిజెపి వారికి ఎక్కువైందా? తాము చేసిన ప్రతిపాదనలను కాదని, బిజెపి ప్రతిపాదనలను ఎందుకు పరిగణనలోకి తీసుకుంది? ప్రజల నుంచి గెలిచి వెళ్లిన వాళ్ళం మేము. జనానికి ఏం చెప్పాలో తెలియని దుస్థితిలో ఉన్నాం అని పురంధ్రీశ్వరి అన్నారు. అలాగే విశాఖ ఎంపిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక శక్తులు తనను మానసికంగా హింసిస్తూ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ సీటు విషయంలో తనకు, సుబ్బరామిరెడ్డికి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు అధిష్ఠానం పిలిచి మాట్లాడితే, సమస్య పరిష్కారం అయ్యేది కదా! అని పురంధ్రీశ్వరి అన్నప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి రాజ్యసభ ఇచ్చి, విశాఖ సీటును మీకు కేటాయించడం ద్వారా మిమ్మల్నే అధిష్ఠానం గుర్తించింది కదా! అని అన్నారు. సుబ్బరామిరెడ్డికి విశాఖ సీటే కావాలనుకుంటే, నేను వదులుకుని రాజ్యసభకు వెళ్ళేదాన్నికదా! ఆయన ఇక్కడ అనేక పనులు చేస్తున్నారు. ఆయనకు మంచి జరిగేది కదా! అని పురంధ్రీశ్వరి అన్నారు. అధిష్ఠానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తనను మానసికంగా హింసించిందని చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక ఆడదాన్ని.. వౌనంగా అంతా భరించాను. కనీసం విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ పదవులు మంజూరు చేసినప్పుడైనా తనతో కనీసం సంప్రదించకపోవడం తనను మరింత బాధించింది. అయినా సహనంతో ఉన్నాను. నన్ను నమ్ముకున్న క్యాడర్, నా మనుషుల ఏమైపోయినా ఫరవాలేదా? ఇంత జరుగుతున్నా ఎప్పుడూ ఎవ్వరినీ విమర్శించలేదు. ప్రశ్నించలేదు. ఇదే స్థానంలో మరో ఎంపి ఉంటే, పార్టీ ఇలాగే వ్యవహరించేదా? ఇలా జరిగితే ఆ ఎంపి ఊరుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు.
దిగ్విజయ్‌సింగ్‌ను తనను కలిసినప్పుడు మీరు వచ్చే ఎన్నికల్లో విజయవాడ, నర్సరావుపేట, రాజమండ్రిలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అడిగారని, తను వేరే చోటికి ఎందుకు వెళ్లాలి? తను సిట్టింగ్ ఎంపిని విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పానని పురంధ్రీశ్వరి అన్నారు. అక్కడ మీకు క్యాడర్ లేదట కదా? దిగ్విజయ్‌సింగ్ వ్యంగ్యంగా అన్నప్పుడు నా మనసు ఎంతో బాధపడింది. క్యాడర్ లేదని ఆయన ఏవిధంగా చెప్పగలరు? తను వేరే పార్టీలో చేరుతున్నానని, ఆయా పార్టీలతో మాట్లాడుతున్నానని కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ నేను ఏపార్టీతోనూ మాట్లాడలేదు. ఇకపై ఆలోచించాలి అని పురంధ్రీశ్వరి కార్యకర్తలతో అన్నారు. అయితే ఈ సమావేశానికి హాజరైన క్యాడర్‌లో కొంతమంది ఆమెను పార్టీ మారవద్దని, అధిష్ఠానం మళ్లీ మిమ్మల్ని పిలిచి మాట్లాడుతుందని ఓదార్చారు. అయితే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఓట్లు పడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. మీరు ఏ పార్టీ మారినా, మీ వెంటే ఉంటామని చాలా మంది భరోసా ఇచ్చారు.
* అధిష్ఠానం నన్ను పట్టించుకోలేదు! * సూటిపోటి మాటలతో హింసించారు! * క్యాడర్‌తో మనసువిప్పి మాట్లాడిన పురంధ్రీశ్వరి
english title:
purandhreshwari
Date:
Saturday, February 22, 2014